అమృత్ పనుల్లో అలసత్వం వద్దు
కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2 పథకం పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ శ్రీదేవి హెచ్చరించారు. పనులు మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపల్ కమిషనర్‌లు సమ్మయ్య, ఆయాజ్, నాగరాజు పాల్గొన్నారు. అమృత్ 2 పథకం అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా పైప్‌లైన్ పనులు, సమస్యలు, రిజర్వాయర్లు, సంప్‌ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీడీఎంఏ చర్చించారు. పనులను ప్రారంభించకుండా, నత్తనడకన పనులు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా పైప్‌లైన్‌ల పనులతో పాటు, రిజర్వాయర్లు, సంప్‌ల నిర్మాణం పనులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం అమృత్ అభివృద్ధి పనుల పురోగతి ఫొటోలు, వీడియోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అమృత్‌లో భాగంగా చేపట్టిన లేక్ పునర్జీవ స్కీం ఒప్పందం పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం యూడీఐఎఫ్ ద్వారా విడుదల చేసిన రూ.50 కోట్ల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రణాళికలు సిద్దం చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఈ రాజ్ కుమార్, ప్రజారోగ్యశాఖ ఈఈ సంపత్ రావు పాల్గొన్నారు.


