● మూడో విడత సర్పంచ్ అభ్యర్థుల మల్లగుల్లాలు ● రెండు విడ
కరీంనగర్: పల్లెపోరు చివరి దశకు చేరింది. రెండు విడతల్లో జరిగిన పలు సంఘటనలు.. గెలుపోట ములు.. మూడో విడత అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు చేసిన వారే ఓటమిని చవిచూశారన్న సమాచారంతో కొందరు గెలుపే లక్ష్యంగా ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరికొందరు సాధ్యమైనంత వరకు ఖర్చుచేసి కాళ్లా..వేళ్లా పడేందుకు నిర్ణయించుకున్నా రు. జిల్లాలోని హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఇక్కడ ప్రచారం ముగిసి, సైలెంట్ మోడ్ ప్రారంభం కావడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు.
ప్రలోభం.. ప్రసన్నం
గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఒకప్పుడు అభ్యర్థి పేరు, వంశపారంపర్యం, గ్రామానికి చేసిన సేవలు గుర్తొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నోటు, మద్యం, మాంసం మధ్యే గ్రామ రాజకీయాలు నడుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్నది కాదు.. ఓటరును ప్రసన్నం చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. గత రెండు విడతల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టిన కొందరు ఓటమి పాలవుతుంటే, సాదాసీదాగా ప్రజలతో మమేకమైన కొందరు విజయపథాన నడిచారు. మూడో విడతలోనూ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా వీడియోలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రసంగాలతో బిజీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు పూర్తిగా ప్రలోభాల బాట పట్టారు. మద్యం, మాంసం, ఓటుకింత అంటూ అభ్యర్థులు స్వయంగా రంగంలోకి దిగకుండా తమ అనుచరులతో పని కాని చ్చేస్తున్నారు. ఎవరి ఇంటికి ఏ రోజు ఏ ‘సరుకు’ వెళ్లాలన్నది ముందే లిస్టులు తయారు చేసుకొని కార్యాచరణ పూర్తి చేస్తున్నారు. ఇక వార్డు మెంబర్ అభ్యర్థులు ఉపసర్పంచ్ పదవిని లక్ష్యంగా పెట్టుకొని రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ‘ఇప్పుడు ఖర్చు చేస్తేనే రేపు పదవి’ అన్న భావనతో ముందుకు సాగుతున్నారు. ఓటరు మాత్రం తమ మనసుకు నచ్చిన వారికే ఓటు వేస్తున్నారు. ఈ విషయం గత రెండు విడతల్లో ఖాయమైంది. మూడో విడత అభ్యర్థుల ఫలితాల కోసం బుధవారం సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే.


