ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ అడవుల్లో ఆపరేషన్
డీవీసీఎం ఎర్రగొల్ల రవితో సహా 16 మంది ఉన్నట్టు అనుమానం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన డీవీసీఎం(డివిజన్ కమిటీ) ఇన్‌చార్జ్‌తో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసు బలగాలకు చిక్కినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం సిర్పూర్ యూ మండలం బాబ్జిపేట, కకర్‌బుడ్డి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన డీవీసీఎం ఎర్రగొల్ల రవితో మరో ఇద్దరు డీవీసీఎం కేడర్‌తోపాటు 16 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
వీరిని ఏకే 47, ఇన్సాస్ రైఫిల్ వంటి ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొదటగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే పట్టుబడిన వారిలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిసింది.
నిఘా వర్గాల సమాచారంతో కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, సిర్పూర్ యూ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోల కదలికలు గుర్తించి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర నిర్బంధ పరిస్థితులు ఏర్పడడంతో సేఫ్ జోన్‌గా భావించి వీరంతా ఏజెన్సీకి వచ్చారా, లేక పోలీసులకు లొంగుబాటులో ఇది ఓ భాగమా? ఇంకా ఏదైనా కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
పోలీసుల అదుపులో ఉన్న వారికి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపంత్‌ను ఈ విషయంపై ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా, ఎలాంటి సమాచారమున్నా, పై అధికారులే వెల్లడించే అవకాశముందన్నారు.


