బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' సినిమాకు ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు ఇచ్చింది. ఈ మేరకు బుకింగ్స్ ప్రారంభించారు. కానీ గురువారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ రేట్లు తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో పెంచిన ధరలతోనే టికెట్స్ అమ్మారు. షోలు పడ్డాయి. దీంతో ఇప్పుడు మరో న్యాయవాది ఈ విషయమై పిటిషన్ వేశారు. న్యాయస్థానం చెప్పినా సరే ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో హైకోర్ట్.. చిత్రబృందంపై, బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్క లేదా ? ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని బుక్ మై షోని హైకోర్టు ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో సమాధానమివ్వగా.. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా లేదా? అని ప్రశ్నించింది. ఎందుకు మీపై కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని సీరియస్ అయింది. మధ్యాహ్నం మళ్లీ విచారణ జరగనుంది.
మరోవైపు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో 'అఖండ 2' నిర్మాణ సంస్థ 14 రీల్స్.. లంచ్ మోషన్ దాఖలు చేసింది. అఖండ-2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను, డివిజన్ బెంచ్‌లో 14 రీల్స్ సంస్థ అప్పీలు చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్‌లో అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉతర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. 14వ తేదీ వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్.. తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేసింది.
అలానే సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. కోర్ట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదు? హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కోర్టు ఉత్తర్వులు పట్టవా? సీనియర్ అధికారులు అయి ఉండి ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారు? ప్రతిసారి ఈ మెమొలు ఇవ్వడం ఎందుకు ?? కోర్టు ఉత్తర్వులు తర్వాత విత్డ్రా చేయడం ఎందుకు?? అని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హై కోర్టు నోటీసులు జారీ చేసింది.


