సూపర్ స్టార్ రజినీకాంత్..ఈ పేరు వింటే చాలు అభిమానులకు ఆ డైలాగ్ తప్పకుండా గుర్తుకొస్తుంది. 'ఆడదంటే అణకువగా ఉండాలి.. తొందర పడకూడదు. చదువు ఉండాలి సంస్కారం మరిచి పోకూడదు. అధికారం ఉండాలి.. అహంకారం ఉండకూడదు.. క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు.. భయభక్తులు ఉండాలి.. బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు' అంటూ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ ఎప్పటికీ అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయింది.
1999లో వచ్చిన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇవాళ తలైవా బర్త్ డే కావడంతో మరోసారి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేటితో రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తలైవాకు సినీతారలు, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్నప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది కూలీతో అభిమానులను అలరించిన సూపర్ స్టార్.. జైలర్ సీక్వెల్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం డేరింగ్ స్టంట్స్ కూడా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.
జైలర్-2లో సాహసం చేస్తోన్న తలైవా..
ప్రస్తుతం రజినీకాంత్ జైలర్-2తో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 75 ఏళ్ల వయసులోనూ యాక్షన్ సినిమాలు చేస్తోన్న తలైవా.. ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం రజినీకాంత్ సాహసం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ వయసులో ఫైట్ సీన్ కోసం..
ఇటీవలే జైలర్-2 షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. రజినీకాంత్‌తో ఓ ఫైట్ సీన్ కోసం బరువైన వస్తువులు ఎత్తాల్సి ఉంది. ఈ ఫైట్ సీన్ కోసం తలైవా బరువైన వస్తువును ఎత్తి తలకిందులుగా పెట్టాలి. ఈ కష్టమైన సీన్‌కు డూప్‌ను ఏర్పాటు చేశారు దర్శకుడు నెల్సన్. కానీ రజినీకాంత్ వద్దని చెప్పారట. ఆయనే డూప్ లేకుండా ఆ బరువును ఎత్తడానికి ప్రయత్నించారట. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఈ వయసులో ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వయసులో ఇంత సాహసం చేయడం తలైవాకే సాధ్యమంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.
కాగా.. జైలర్-2 చిత్రంలో ఎస్‌జే సూర్య, యోగిబాబు, రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్‌లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


