రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.
స్టార్ హీరోయిన్
భారతీరాజా పుతియ వార్పుగల్ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్ స్క్రీన్‌కు పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
తెలుగులో సినిమాలు
తెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్‌బాబు జీవిత రథం, ఎన్టీఆర్‌తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.

వైవాహిక బంధంలో సమస్యలు
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్‌లో, హిందీ సిరియల్స్‌లో నటుడిగా కొనసాగుతున్నాడు.
30 ఏళ్లు నరకం
ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను.
భరించడం నా వల్ల కాక..
ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది.
ఏం చేస్తోందంటే?
ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్‌లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్ నడుపుతోంది. యాక్టింగ్ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది.


