హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్‌లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్‌రూమ్‌లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
బుల్లీయింగ్‌కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్‌లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్‌ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్‌కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు.


