శ్రియా శరణ్ మూవీ.. రిలీజ్ కాకుండానే మూడు అవార్డులు..! | Unreleased Tamil film Sandakari wins 3 State awards | Sakshi
Sakshi News home page

Sandakari Movie: ఇదెక్కడి చోద్యం.. రిలీజ్ కానీ సినిమాకు మూడు అవార్డులు..!

Feb 2 2026 4:06 PM | Updated on Feb 2 2026 4:54 PM

Unreleased Tamil film Sandakari wins 3 State awards

ఏదైనా సినిమా రిలీజై హిట్‌ అయితే ప్రశంసలు కురిపిస్తారు. అలాగే అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కథ బాగుండి సూపర్ హిట్ అయిన సినిమాలకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తుంటారు. కానీ రిలీజ్ కానీ సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్‌ ఇవ్వడం మీరెక్కడైనా చూశారా? కానీ సరిగ్గా అదే జరిగింది. ఐదేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. కానీ తాజాగా అవార్డుల వేడుకలో మాత్రం ఏకంగా మూడింటిని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరేంటో తెలుసుకుందామా? 

విమల్, శ్రియా శరణ్ జంటగా నటించిన చిత్రం 'సందకరి'.  తాజాగా ఈ చిత్రం మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29న తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 సంవత్సరాల వరకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో చాలా మంది అగ్రశ్రేణి నటీనటులు, చిత్రాలు, సాంకేతిక నిపుణులను ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందించింది.

అయితే 'సందకరి' అనే సినిమారు 2020 ఏడాదిగానూ మూడు అవార్డులను గెలుచుకుంది. ఇదే ఇప్పుడు ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేసింది. అసలు ఈ సినిమా విడుదల కాలేదని.. మరి ఇలాంటి చిత్రానికి అవార్డులకు ఎలా ఇచ్చారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీ ఉత్తమ చిత్రం (మూడవ బహుమతి) అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ నేపథ్య గాయకుడు అమ్రిష్  (మేల్), అయ్యప్పన్ ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డులకు ఎంపికయ్యారు. రిలీజ్‌ కానీ సినిమాకు అవార్డులు రావడమేంటని కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే తమిళనాడు రాష్ట్ర అవార్డులకు అర్హత పొందాలంటే ఆ చిత్రం థియేటర్లలో విడుదల అయి ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా అవార్డుల కోసం ఆ ఏడాదిలో రిలీజైన ఎన్నో చిత్రాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ కాదని.. ఒక మలయాళ రీమేక్‌కు మూడు అవార్డులు ఇవ్వడంపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాగా.. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ 'మై బాస్'కు రీమేక్‌గా సందకారిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిలీప్, మమతా మోహన్‌దాస్ నటించారు.  ఈ తమిళ వర్షన్‌లో విమల్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ మదేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement