breaking news
Sahitya Akademi awards
-
నిర్వర్ణం
‘ఒకరోజు నలుపు తెలుపు ప్రేమలో పడింది. కానీ ఈ తెలుపు ఆ నలుపుని తనూ ‘తెలుపు’ అయి రమ్మని, అలా మారితేనే ప్రేమిస్తానంటుంది. పాపం ‘నలుపు’! తను తెలుపుగా మారటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. పాల మీగడలు పాత్రలకొద్దీ తింటాడు. ఆకాశాన తెలతెల్లని మబ్బుతరగలపై రోజూ పొర్లుతాడు. సాగర కెరటాల నురగలపై స్నానాలు చేస్తాడు. ధవళ వస్త్రాలెన్నో చుట్టుకుంటాడు. తెల్లని పూలమాలలు లక్షలాదిగా ధరిస్తాడు. హంసలు, పావురాలు వంటి ఎన్నో తెలుపు రంగు పిట్టల రెక్కలను ఎరువు తెచ్చుకుని; ఎగురుతూ, దుముకుతూ క్షీరసాగరాలలో మునకలేస్తాడు. గుడులూ గోపురాలపైన వెలిగే శ్వేతకాంతుల దివ్వెల వెలుగులను తనలోకి స్వీకరిస్తాడు. నింగిచుక్కల తళుకులు తెచ్చుకుని దేహమంతా పులుముకుంటాడు. హేమంత వేళల హిమాద్రుల మంచుమంచెలపై ఎన్నో రాత్రులు శయనిస్తాడు. ఇన్ని చేసినా తీరా నలుపు– తెలుపును సమీపించిన ప్రతిసారీ నలుపుగానే ఉంటున్నాడు. ‘ఎప్పటికైనా నలుపు నలుపే గదా!’ అని దుఃఖిస్తున్నాడు. అలా వేల వసంతాలు వృథా అయిపోవలసిందేనా అని నలుపు ఎంతో బెంగపెట్టుకున్నాడు. చివరికి ఓ క్షణంలో జాలిపడిన తెలుపు నలుపుని దగ్గరకు తీసుకుంటుంది. ఒకే ఒక బిగి కౌగిలి! అంతే! ఆ రాత్రి నక్షత్రాలు నీలాకాశంతో ‘రహస్యంగా’ రమించాయట! నలుపు ప్రాణులన్నీ తెలుపు ప్రాణులను పెనవేసుకున్నాయి. రేయీ పగలూ కలిసి ఒకే మధుపాత్ర నుండి రతిఫలరసాలు తప్పతాగాయి. cవెలుగుల స్పర్శతో ఆ క్షణాన చీకటి ఛాయలన్నీ తీయని స్ఖలనాలు పొందాయట!ఉదయం విరిసింది. వేకువనే లేచి, తెల్లని ఉల్కలను రాలుస్తున్న తన పైటకొంగును సర్దుకుని లేచి వెళ్ళిపోబోతున్న ‘తెలుపు’ చేతిని గట్టిగా పట్టుకుని లాగి ‘అదేంటి? నన్నెందుకు విడిచి పోతున్నావు?’ అని నిలదీస్తాడు నలుపు. అతని బేలతనం చూసి నవ్వుకున్న తెలుపు ‘ఈ లోకం ఏనాడో అనాదిగా నలుపు– తెలుపులుగా విడిపోయిందోయ్! ఎప్పుడైనా, ఎక్కడైనా వాటి మధ్య ఉండే పలుచని విభజన రేఖలు ఒకవేళ ఎవరైనా శాశ్వతంగా చెరపగలిగితేనే, చీకటి వెలుగుల సంగమాల సంజెపొద్దుల్లోనే మనకు శాశ్వత కలయిక సాధ్యం! అప్పటివరకు సెలవా మరీ!’ అంటూ శ్వేత వలయాలుగా పైకి లేచి పరిసరంలోని ప్రతి తెల్లని జీవ నిర్జీవ పదార్థాలలోకి ఇంకిపోయి అదృశ్యమైపోయింది తెలుపు! నలుపు ఎంతో నిస్పృహతో తన కన్నతల్లి అయిన నిశీధి ఒడిలో తలవాల్చి పడుకొని విశ్వంలో కృష్ణబిలాలకు ప్రభాత వేలుగురేఖల కుంచెలతో తెలుపు రంగులద్దుతున్నట్లుగా తెల్లవారు ఝామున కలలు కంటూ ఇంకా తన ప్రేయసి ‘తెలుపు’ తలపులలోనే బతుకెళ్ళదీస్తున్నాడు. యుగాల నిరీక్షణ అది. అయినా నలుపు నలుపే, తెలుపు తెలుపే గదా! వాటి సంగమం అసాధ్యం. సాధ్యమైనా అది క్షణ భంగురమే కదా!’‘ఇప్పుడది ఎందుకే అంత పెద్దగా చదువుతున్నావు?’‘మొత్తం మీద భలే లౌక్యంగా రాశావే మామ్మా, సో క్రాఫ్టీ!’‘తమరి పొగడ్తలేం నాకవసరం లేదులే!’‘సర్లేవే! ఇంతకీ ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన మహానుభావులెవరో? గట్టిగానే లాబీయింగ్ చేసినట్టున్నావు. మూడొందల పేజీల ముచ్చటైన అబద్ధాలు– అబ్బో! ‘కాల–శ్వేత సంగమం’ అంటూ తమరి ఈ మహావచన కావ్యానికి ఆ టైటిలొకటి! అంతా వొట్టిదే!’’‘నోర్ముయ్! వొట్టిదో గట్టిదో మరి నువ్వూ ఇలా రాయవే చేతనైతే!’‘రాస్తాను.. రాస్తాను.. కానీ ఇలా కాదు!’‘అబ్బో! మరెలా?’‘నే రాస్తే నీలా కాదులే, రాసిందే జీవిస్తా! జీవించేదే రాస్తా!’‘రాసేది అంతా చూసేదేనే ఫూల్! చేసేది కాదు!’‘ఏం? చేసేది రాస్తే? ఒకట్రెండు పుస్తకాల్లోనైనా తమరు చేసింది రాస్తే బాగుండేది!’‘గమ్మునుండవే పిల్లా! భయమెరుగని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!’‘నువ్వే గమ్మునుండవే! వృద్ధనారీ పతివ్రతా! నాకూ వచ్చు సామెతలు’‘ఎంతగా బరితెగిస్తున్నారే మీ తరం!’‘మీ తరాలేమన్నా తక్కువ తిన్నారా ఏంటి?’‘ఏం తెలుసే మా గురించి నీకు కోణంగిదానా?’‘క్లబ్బులూ పబ్బులూ చాలా ఉండేవిగా మీ అభ్యుదయ రైటర్స్ గ్యాంగులకు! ఏ అర్ధరాత్రో, అపరాత్రో గూళ్ళకు చేరుకునేవాళ్ళటగా!’‘ఏయ్.. నోర్మూయ్!’‘హేయ్.. నువ్వే మూసుకో!’‘నువ్వా కులం తక్కువోడితో కులికొచ్చినట్లు కాదులే!’‘ఐతే కులం ఎక్కువైనోళ్లతో గెలుక్కోవచ్చన్న మాట– మీలా!’పొగలు సెగలు కక్కుతూ బామ్మ చెప్పు తీసుకొని కొట్టటానికన్నట్లు చేయి పైకి లేపింది. మనుమరాలు వేగంగా కదిలి, బామ్మ చేతినలాగే ఒడిసి పట్టుకొని ఆమెను విసురుగా నెట్టేసింది. గోడకు కొబ్బరికాయలా తగిలిన బామ్మ తల పగిలి కిందికి జారుతూ ఉంటే ఆ గోడపై సన్నగా, బారుగా ఓ నెత్తురు చిత్తరువును అద్దినట్లయింది. అన్ ఫోర్స్డ్ ఎర్రర్ అయినా, ఆవేశపు అనర్థం అనుకున్నా, మొత్తం మీద జరిగింది వర్ధమాన రచయిత్రి చేతిలో వెటరన్ కవయిత్రి దుర్మరణం.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సీనియర్ కవయిత్రి, కథా రచయిత్రి, మూడుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు తీసుకున్న శ్రీమతి సత్యవేణమ్మ హత్య. ఆవేశపరురాలైన ఆమె మనవరాలు విశ్వంభరనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అయితే, ఇంట్లో వాళ్లు తన కులాంతర ప్రేమ వివాహానికి అంగీకరించక హింసించటం వల్లనే అసలిదంతా ఒక్క క్షణంలో ఆవేశకావేశాలు కమ్మి జరిగిపోయిందని హత్యకు పాల్పడ్డ మనవరాలు చెబుతోంది. అతి ఆవేశపరురాలు అయిన ఆ మనవరాలిని సత్యవేణమ్మగారి గదిలో కాకుండా వేరే గదిలో నిర్బంధించి వున్నట్లయితే మహారచయిత్రి ప్రాణాలు నిలిచి ఉండేవని పోలీసులు, నేర నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ ఈ హత్యను ఖండిస్తున్నారు. మన దేశంలో యువతలో ముఖ్యంగా యువతుల్లో నానాటికీ చెలరేగుతున్న హింసా ప్రవృత్తిని చర్చించటానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు జాయినవుతున్నారు ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు, గొప్ప మహిళా అభ్యుదయవాది, మహావక్త శ్రీమతి మౌనమ్మగారు, అలాగే నేషనల్ మెన్స్ రైట్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ శ్రీ వాగేశ్వర్రావుగారు. చర్చకు ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్!చాలారోజులపాటు ఆ ఒక్క వార్త నాన్–వెజ్ చానళ్ళ నోటికి నల్లిబొక్కలా, వెజిటేరియన్ చానళ్ళకు ఆవకాయ ముద్దల్లా రుచిగా నలిగింది.∙∙ ‘ఒకరోజు తెలుపు నలుపుని ప్రేమిస్తుంది. నలుపు కూడా తెలుపుని ఇష్టపడతాడు. నలుపు తామిద్దరం కలవటం లోకానికి ఇష్టముండదని, ఒకవేళ కలిసినా లోకం సహించలేక తమను అంతం చేస్తుందని, అందుకే నలుపు తన ప్రియురాలు తెలుపుని తనలా ‘నలుపు’గా రూపాంతరం చెంది తిరిగి రమ్మని కోరుకుంటాడు.పాపం ఆ తెలుపు తాను నలుపు కావటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకృతిలోని కాటుక వర్ణాలన్నీ సేవిస్తుంది. అగ్గిని తొక్కుతుంది. బుగ్గిని బుక్కుతుంది. నిశరాత్రుల గుండెల్లోని తమస్సునంతా తాగుతుంది. కారు మేఘాలను, కాకులూ కోయిలల రెక్కలను ఎరువు తెచ్చుకుని ఎగురుతుంది. నీలి సంద్రపు గర్భాల అంధకారపు నీడలతో తానమాడుతుంది. కృష్ణపక్షపు నీలిమనంతా గంధలేపనాలుగా పులుముకుంటుంది. పాతాళపు ఛాయలు భుజిస్తుంది. ధైర్యం చేసి ఓ అడుగు ముందుకెళ్ళి భీకర రక్తమాంసాలు పారే వైతరణీ నదిలో యమకింకరుల చేతుల్లో గాలాలకు దొరికిన చేపల్లా వేలాడుతూ, భీకర ఘోషల ప్రతిధ్వనులతో నిండిన శాపగ్రస్థులైన వారి ఆత్మల్లో దాగి ఉన్న పశ్చాత్తాపపు చీకటిని సేవించి, పున్నమి జోత్స్నల వెన్నెల రేఖ ఒక్కటి కూడా తనపై పడకుండా జాగ్రత్తగా ఆకాశ వీథులు దాటి బయలుదేరింది. అలా తెలుపు తాను నలుపు రంగు ముగ్ధమనోహరియై సందెపొద్దుల్లో తన ప్రియుని బిగికౌగిళ్లలో కరిగిపోవాలని ఆశగా ఎగిరొస్తుంటే, తన సొంత తెలుపుజాతి వాళ్లే దారుణంగా దాడిచేసి, ‘ఏమే నీచపుదానా! మన జాతి వర్ణాన్నే మార్చాలని చూస్తావే? హంసలా పుట్టి కాకిలా మారటమేంటే భ్రష్టురాలా!’ అంటూ నలుపుగా మారిన తెలుపుపై చెప్పలేని అశ్లీల భాషను ఉపయోగించారు! ఆ నలుపుగా మారిన తెలుపుని పాతకాలంనాటి పెద్ద పెద్ద గంగాళాలలో పురాతన వర్ణ ద్రావకాలలో ముంచి సంప్రోక్షణలు, శుద్ధి క్రియలూ చేసి దానిని మళ్లీ తెలుపురంగులోకి మార్చి వదిలేశారు! అయ్యో పాపం తెలుపు! గుండెలు పగిలే దుఃఖంతో విలపిస్తూ, తను మళ్లీ నలుపు దగ్గరకు తిరిగొచ్చింది. విషయమంతా గ్రహించిన నలుపు తన ప్రేయసి తెలుపుని దగ్గరకు తీసుకొని విశ్వమంత ప్రేమను పంచి శాశ్వత సంగమంతో తనలో కలిపేసుకుంటుంది. ఆశ్చర్యంగా అనంతర యుగాలలో ఈ నలుపు–తెలుపులు రెండూ కూడా క్రమంగా తమ తమ రంగుల్ని విడిచి ‘నిర్వర్ణం’ కాసాగాయి.’‘ఎందుకమ్మా ఆ ఇంట్రోని మళ్ళీ మళ్ళీ బిగ్గరగా చదువుతున్నావు?’‘అబ్బ బామ్మా! ఇంత లోతుగా రాశావంటే నువ్వు ప్రపంచాన్ని ఎంత బాగా చూసి ఉంటావు!’‘నే చూసింది మాత్రమే రాయలేదే!’‘మరి?’‘నేను చేసింది, నాకు నే చేసుకుంది, లోకం నాకు చేసిందీ కూడా!’‘నిర్వర్ణం– ద కలర్ ఈజ్ డెడ్’– ‘అసలీ పుస్తకం టైటిలే అమోఘం బామ్మా! ఈ పుస్తకానికి ఒకే ఏడాది సాహిత్య అకాడమీ, సరస్వతీ సమ్మాన్ అవార్డులు, బుకర్ ప్రైజ్ రావటం రియల్లీ ఆసమ్! యు మేడ్ హిస్టరీ, గ్రాండీ!’‘ఈ అవార్డులు రివార్డుల కన్నా నా మనవరాలులాంటి ఎంతోమంది యూత్ నా పుస్తకాలు చదివి, స్పందించటం అతి గొప్ప ప్రశంస అమ్మా! రోజూ ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజ్‌లో..’ అంటూ మనవరాలి నుదుటిపై ఓ తియ్యటి ముద్దిచ్చింది విశ్వంభర. ‘గ్రేట్ బామ్మా! కీప్ రాకింగ్!’‘షాకింగ్ టూ బేబీ!’ఇద్దరూ ఒక్కసారే ఫెళ్లుమని నవ్వారు.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సంచలనాత్మక, వివాదాస్పద రచయిత్రి శ్రీమతి విశ్వంభరకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం, ఈ ఉదయం ఆమెకు అవార్డు ప్రకటించిన భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ. ఒక భారతీయ మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను, బాహాటంగా రాయగలగడం మహా సాహసం అని అవార్డు కమిటీ సభ్యులు విశ్వంభరను ప్రశంసించారు. చిన్ననాడు తను ఈడుకొస్తున్న రోజుల్లో తన మేనమామ వెంటబడి ఎలా హింసించాడో, తాను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటానంటే తన తండ్రి తనను ఎలా గృహనిర్బంధంలో ఉంచాడో, ఆ సమయంలో తనను బంధించిన గదిలో మేనబావలు నీచంగా, నిర్లజ్జగా ‘ఆ జాతి తక్కువ వాడితో కాకపోతే మనలోనే ఎవడో వరసైనవాడిని తగులుకోరాదటే!’అంటూ తనపై తోడేళ్లలా ఆ రోజు ఎలా దాడికి సిద్ధమయ్యారో– ఇవన్నీ తెలిసి కూడా ఖండించని తన బామ్మ, అభ్యుదయ రచయిత్రి అయిన శ్రీమతి సత్యవేణమ్మతో ఒక సందర్భంలో మాటా మాటా పెరిగి చివరికి వారిరువురి మధ్యన జరిగిన చిన్న పెనుగులాటలో సీనియర్ రైటర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవటం ఎలా జరిగిందో; అదంతా అన్ ఫోర్స్డ్ ఎర్రర్లా జరిగిందని తాను పశ్చాత్తాపంతో ఎంత మొత్తుకున్నా ఎవరూ అర్థం చేసుకోలేదని; చివరికి తాను జైలుపాలైనప్పుడు సైతం జైలు అధికారుల్లో ఒకడు దారుణంగా భయపెట్టి తనను ఎలా శారీరకంగా దోచుకున్నాడో; ఇదంతా తెలిసీ తను విడుదలైన తర్వాత తనను స్వీకరించి వివాహం చేసుకున్న భర్తతో కూడా సంసార జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు అనుభవించిందో; భర్త మరణం తర్వాత ఒంటరిదై ఒక తోటి నవలా రచయితతో తను స్నేహం చేసేటప్పుడు ఇంటా బయటా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నదో– అలాంటి ఎన్నో జీవితానుభవాల్ని ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా రాసినందుకు శ్రీమతి విశ్వంభర ఎట్టి అవార్డుకైనా అర్హురాలేనని అభ్యుదయవాదులు అంటున్నారు. అయితే మాజీ నేరస్థురాలు, ముప్పయ్యేళ్లుగా తన రచనలతో హద్దుమీరిన స్వేచ్ఛను, తిరుగుబాటు ధోరణిని, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో ఆడవాళ్ళను తప్పుదారి పట్టిస్తూ వచ్చిన ఈ రచయిత్రికి ఇంత అత్యున్నత సాహితీ పురస్కారం ఇవ్వటం పట్ల అటు పురుషుల ఐక్య సంఘాల జేఏసీనే గాకుండా, ఇటు కొన్ని మహిళా సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ అవార్డు ప్రకటన అంశం గురించి చర్చించటానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవిపండితులు, సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీ అవాకుల అప్పారావుగారు, ప్రముఖ అభ్యుదయవాది, ఎమ్మెల్సీ అయిన శ్రీమతి చెవాకుల సక్కుబాయిగారు– ఇంకా.................గారు, ................. గారు కూడా.’మొదటి వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’రెండవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’మూడవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’‘ఈనాటి ఈ బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా.... లైవ్ డిబేట్ ఇంతటితో ముగిసింది. నిత్యం ‘తాజా లొల్లి’ కోసం మన సత్యం‘బాజా’ చానల్‌ను వీక్షిస్తూనే ఉండండి– వీక్షిస్తూనే ఉండండి– తర్వాతి కార్యక్రమం ‘మేం వాగుతునే ఉంటం– మేం వాగుతునే ఉంటం’‘స్టే ట్యూన్డ్!’ -
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలకు చెందిన రచయితలు బండి నారాయణ స్వామి, పెన్నా మధుసూదన్‌లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను డిసెంబర్ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. కాగా, సంస్కృత భాషలో పెన్నా మధుసూదన్ రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన కూడా మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. పెన్నా మధుసూదన్ జడ్చర్లకు చెందినవారు. గతంలో ఆయన సోమనాథ్ సంస్కృత పండిట్ అవార్డు, పండిట్ లట్కర్‌శాస్త్రి మెమోరియల్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సాధువు గులాబ్‌రావు మహారాజ్ ఆధ్యాత్మిక తత్వబోధనలపై ప్రజ్ఞాచాక్షుషం రచించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు. చాలా ఆనందంగా ఉంది అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబంలో ఒక నిర్దన పరివారంలో పుట్టిన ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని 850 శ్లోకాల్లో రాశాను. ఆయన జీవితం, ఆయన దార్శనిక విచారాలు, తత్వజ్ఞానాలు ప్రస్తావించాను. ఆ మహాత్ముడి జీవితం తెలియాలి. 34 ఏళ్లు మాత్రమే జీవించారు. 134 పుస్తకాలు,4 భాషల్లో రాశారు. భారతీయ ధర్మాన్ని స్థాపించాలని ప్రయత్నించారు. మరిన్ని రచనలు చేసేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్నిస్తుంది. –పెన్నా మధుసూదన్ అవార్డు రావడం సంతోషకరం నేను రాసిన శప్తభూమి నవలకు ఈ అవార్డు రావడం పాఠకులకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. దాని ఆధారంగా నాకూ సంతోషాన్నిచ్చింది. తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమకు కూడా తనకంటూ ఒక భాష, సంస్కృతి ఉందని వివిధ ప్రాంతాలకు తెలియపరిచేందుకు ఈ శప్తభూమి రాశాను. రాయలసీమ చారిత్రక మూలాలు 18వ శతాబ్దం నుంచి తీసుకుని ఈ నవల రాశాను. రాయలసీమ కరువు, కరువుల పరంపరలను నవలలో రాశాను. రాయలసీమ కరువు కాటకాలను, సుఖదుఃఖాలను వివిధ ప్రాంతాలతో పంచుకునే అవకాశం లభించింది. – బండి నారాయణ స్వామి -
తెలుగు రచయితలకు సాహిత్య అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ /పార్వతీపురం: కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఈ ఏడాదికి గాను బాల సాహిత్య పురస్కారాలు, యువ పురస్కారాలు ప్రకటించింది. పురస్కార గ్రహీతల ఎంపికకు అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బోర్డు అగర్తలాలో ఆమోదముద్ర వేసింది. ఇద్దరు తెలుగు రచయితలు అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు. డాక్టర్ గడ్డం మోహన్‌రావుకు ‘కొంగవాలు కత్తి’ తెలుగు నవలా రచనకు గాను సాహిత్య అకాడమీ యువ పురస్కారం–2019 లభించింది. ‘తాత మాట వరాల మూట’ కథా సంపుటి రచించిన బెలగం భీమేశ్వరరావును బాల సాహిత్య పురస్కారం దక్కింది. చిందు ‘కళ’కు అక్షర రూపమిచ్చిన గడ్డం నల్గొండ జిల్లాకు చెందిన గడ్డం మోహన్‌రావు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిందు భాగవతం కళాకారుల జీవితాలకు అక్షర రూపం ఇస్తూ మోహన్‌రావు కొంగవాలు కత్తి, చిందు జాంబవ పురాణం, నేను చిందేస్తే.. అనే మూడు పుస్తకాలను రచించారు. అంతరించిపోతున్న చిందు కళను, ఈ కళను వృత్తిగా స్వీకరించిన వారి జీవితాలను ఈ పుస్తకాల ద్వారా భావితరాలకు పరిచయం చేశారు. బాల సాహిత్యంలో ‘భీముడు’: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన భీమేశ్వరరావు నాలుగు దశాబ్దాలుగా బాల సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నారు. ఈయన గతంలో మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారం, డాక్టర్ ఎన్.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, విజ్ఞాన వివర్థిని బాల సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాల సాహిత్య కీర్తి పురస్కారాలను అందుకున్నారు. భీమేశ్వరరావు రచించిన కొన్ని రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలుగా చేర్చింది. పురస్కారాన్ని అందుకున్న కృష్ణారావు ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. భీమేశ్వరరావు, గడ్డం మోహన్‌రావు -
రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్‌లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్‌లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ఇక్కడ లౌకికవాదమూ సమస్యే! భారత్‌లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు. -
'మీదే అసహనం.. కల్పిత నిరసన!'
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అహసనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ పురస్కారాలను వాపస్ ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. తమ భావజాలంలోని అసహనం చేతనే వారు కల్పిత నిరసనతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ఆవుమాంసం తిన్నారనే ఆరోపణలపై దాద్రిలో మహ్మద్ అఖ్లాఖ్ను చంపడం తీవ్ర దురదృష్టకరమని, గర్హనీయమని పేర్కొన్నారు. దాద్రి ఘటన నేపథ్యంలో పలువరు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇవ్వడం వెనుక వారి ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు. 'ఇది నిజమైన నిరసనా? లేక సృష్టించినదా? ఇది భావజాల అసహనం కాదా?' అని జైట్లీ ప్రశ్నించారు. వామపక్ష వాద, నెహ్రూవియన్ రచయితలు మోదీ ప్రభుత్వంతో తమకు సరిపడటం లేదనే నిరసనలకు పూనుకుంటున్నారని విమర్శించారు.