
ఉత్తమ టీచర్ అవార్డులు అభాసుపాలు
పనితనం కన్నా.. ప్రసన్నతే మిన్న
‘ఉన్నతవిద్య’ అవార్డుల్లో విచిత్రాలు
నిబంధనలకు విరుద్ధంగా వీసీకి అవార్డు
విధులకు సరిగా రానివారికి సైతం..
ఎంపికలో రాజకీయ కోణమే ప్రధానం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు అభాసుపాలయింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో బోధన ప్రతిభ కంటే రాజకీయమే పాసయింది. కూటమి ప్రభుత్వం దశాబ్దాలుగా వృత్తిలో సాధించిన ప్రగతిని పక్కనపెట్టి ఇంటర్వ్యూల పేరిట కాలక్షేపం చేసి అర్హులకు అన్యాయం చేసింది. విశ్వవిద్యాలయం మొదలుకొని పాఠశాల విద్య వరకు ప్రతిస్థాయిలోను ఉత్తమ టీచర్ల ఎంపిక ప్రహసనంగా మారింది. ఎంపికలో పలువురు అనర్హుల్ని అవార్డులకు సిఫార్సు చేశారు.
ఈ అవార్డుల తీరుచూసి నిజంగా అర్హులైనవారు.. తమను ఎంపిక చేయకపోవడమే మంచిదైంది అనుకునే పరిస్థితి నెలకొంది. ఈ ఎంపికల్లో తమవారా.. కాదా.. అనేది మాత్రమే కూటమి ప్రభుత్వం పరిశీలించిందన్న విమర్శలున్నాయి. ఎక్కడా ప్రతిభను పట్టించుకోలేదని, రాజకీయంగా ఏ పార్టీకి సానుభూతిపరులో చూసి మరీ పురస్కారాలు ప్రకటించారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వర్సిటీస్థాయిలో 32 మందికి, డిగ్రీ కళాశాల స్థాయిలో 18 మందికి, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఆరుగురికి అవార్డులు ప్రకటిస్తూ ఉన్నతవిద్య కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ద్రావిడ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీకి..
నిబంధనల ప్రకారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు పరిపాలన పదవుల్లో ఉన్నవారు దూరంగా ఉండాలి. అలాంటిది.. ఏకంగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ఎం.దొరస్వామికి ఉత్తమ టీచర్ అవార్డు ప్రకటించారు. వర్సిటీ స్థాయిలో దరఖాస్తులు/నామినేటెడ్ పేర్లను స్క్రీనింగ్ చేసేందుకు వీసీ చైర్మన్‌గా కమిటీ ఉంటుంది. ఇక్కడ ఆ కమిటీ చైర్మన్ అయిన ఇన్‌చార్జి వీసీ దొరస్వామి తనపేరే సిఫార్సు చేసుకున్నారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి కమిటీ సైతం ఆయన్ని ఎంపిక చేసేసింది. అసలు ఆయన నాన్ టీచింగ్ విభాగానికి చెందిన ఉద్యోగి. లైబ్రరీ శాఖకు చెందిన వ్యక్తి. ఈ వర్సిటీలో ఆయన బోధించడానికి అస్సలు లైబ్రరీసైన్స్ కోర్సులే లేవు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆయన బోధనాపటిమను గుర్తించారో తెలియదు.
వర్సిటీలో 2010లో తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ లైబ్రేరియన్‌గా అడుగుపెట్టిన ఆయన ఎక్కడిక్కడ నిబంధనలు మీరి రెగ్యులర్ అయిపోయి, నాన్‌టీచింగ్ డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టు (అసోసియేట్ ప్రొఫెసర్) నుంచి ఏకంగా టీచింగ్ విభాగంలోని ప్రొఫెసర్ పోస్టులోకి వచ్చేశారని వర్సిటీవారే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం పొందారంటూ కోర్టుల్లో కేసులున్న వ్యక్తిని అవార్డుకు ఎలా ఎంపిక చేశాంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్వ్యూల పేరిట కాలక్షేపం..
ఈ అవార్డులకు ఎంపిక కోసం కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఇంటర్వ్యూలు నిర్వహిచింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు నిర్వహించిన ఇంటర్వ్యూలు ఒక్కోచోట ఒక్కో విచిత్రాన్ని తలపించాయి. ఉత్తమ ఆచార్యుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ ఘనంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత మీరు ఎంపికయ్యారంటూ ఆహ్వానాలు పంపింది.
తీరా.. ఎంపిక జాబితా వెలువడటానికి కొద్దిగంటల ముందు ‘సారీ మీరు డ్రాప్ అవ్వండి.. మేం ఏం చేయలేం..’ అంటూ సందేశాలు పంపించి ప్రతిభ, సామర్థ్యం ఉన్న ఎందరో ఆచార్యులను అవార్డులకు దూరం చేసింది.ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు కళాశాల డైరెక్టరేట్ రెండు, మూడు నిమిషాల్లోనే ఇంటర్వ్యూలు ముగించింది. ‘కళాశాల అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? మీరు దరఖాస్తులో సమరి్పంచిన రికార్డులు మీవేనా? ఇక వెళ్లి రండి..’ ఇదీ వారికి నిర్వహించిన ఇంటర్వ్యూ.
సాంకేతికవిద్యలో మరో కోణం
రాష్ట్ర సాంకేతిక విద్యావిభాగంలో మరో అడుగు ముందుకేసి అవార్డులు పంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విభాగంలో 16 అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒక్కో అవార్డుకు ఇద్దరు చొప్పున దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచి్చనా పెద్దగా స్పందన రాలేదు. దీంతో దరఖాస్తు గడువును పెంచి సిబ్బందికి ప్రత్యేకంగా సమాచారం అందించి అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ నుంచి ప్రిన్సిపల్ కేటగిరిలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఎస్వీయూ రీజియన్‌లో ఒక్కరే దరఖాస్తు చేయగా ఆయన్నే ఎంపిక చేశారు. ఈ విభాగంలో 15 మందిని ఉత్తమ అధ్యాపకులుగా ప్రకటించారు. వీరిలో పలువురు విధులకు హాజరయ్యే విషయంలో సమయపాలన పాటించలేదని తేలింది.
ఇటీవల ఉన్నతాధికారులు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం నుంచి వివరాలు విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సమయానికి కాలేజీకి రానివారు ఉత్తమ అధ్యాపకులు ఎలా అవుతారని సాంకేతికవిద్యలో పనిచేసే అధ్యాపకులే విమర్శిస్తున్నారు. వీటిని పరిశీలిస్తే.. ఈ ఏడాది అవార్డుల ఎంపికను పాలకులు ఎంతగా దిగజార్చారోఅర్థమవుతోంది.