breaking news
Childrens career
-
మేం మేం చేశాం నేరం
సాక్షి, సిద్దిపేట : ‘ శ్రావణ్‌ది తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామం. ప్రస్తుతం మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం శ్రావణ్ తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీశైలం ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం చేద్దామని అందినకాడికి అప్పులు చేసి బోరు బావులు తవ్వించారు. బోరు బావుల్లో చుక్క నీరు పడక పోవడంతో వ్యవసాయం సన్నగిల్లింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో 2014లో శ్రావణ్ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాల్సిన శ్రావణ్ అనాథగా మారాడు. చేరదీయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్రావణ్ సంరక్షణ భారం నానమ్మ సత్తవ్వ భుజస్కంధాలపై పడింది. సత్తవ్వకు వచ్చే ఆసరా పింఛన్‌తో శ్రావణ్‌ను పోషించుకుంటోంది. ఆసరా పింఛన్ డబ్బులు సత్తవ్వ మందులకే సరిపోవడంతో శ్రావణ్ చదువులకు ఆటంకం ఏర్పడింది. దీంతో గ్రామంలోని కొందరు యువకుల సహకారంతో మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించి చదివిస్తుంది.’ ‘నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జాల మల్లేశం బతుకుదెరువు నిమిత్తం సౌదీ వెళ్లి గత ఏడాది అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ సరిగా వేతనం లభించకపోవడం, స్వగ్రామంలో అప్పులబాధ వెరసి అతడు సౌదీలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు 14 ఏళ్లలోపు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక వైపు భర్త దేశంకాని దేశంలో ఆత్మహత్య చేసుకోగా.. ముగ్గురు పిల్లలతో లక్ష్మి బతుకు బండిని ఈడుస్తూ క్షణమొక యుగంగా గడుపుతోంది. ఏ పాపం ఎరుగని పిల్లలు తండ్రిప్రేమకు దూరమయ్యారని, కన్నీరు మున్నీరు అవుతుంది.’ ఇలా లక్ష్మి, శ్రావణ్, మరో చోట పల్లవి, కల్యాణ్ వంటి పసిపిల్లలు ఏపాపం ఎరుగకుండానే అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పుతో సాటి పిల్లలు అమ్మానాన్నలతో సంతోషంగా ఉంటే వీరు మాత్రం అమ్మానాన్నలను కోల్పోయి ముసలి తాత, అమ్మలకు భారంగా ఉన్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు, వరకట్నం, అత్యాచారాలు, ఆఘాయిత్యాలతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరిని పురిటిలోనే చెత్తకుప్పల పాలు చేసిన అమ్మలు ఉండటం గమనార్హం. అయితే వీరిలో కొందరిని అమ్మానాన్నలు, బంధువులు చేరదీయగా, మరికొందరు వీధిబాలలుగా, నేరస్తులుగా, దోపిడి దొంగలుగా మారుతున్నవారు ఉన్నారు. సమాజంపై కసిని పెంచుకొని రాక్షసులుగా మారినవారు కూడా లేకపోలేదు. 16 నెలల్లో 687 స్త్రీ, పురుషుల ఆత్మహత్యలు.. గడిచిన 16 నెలల్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో 687 మంది స్త్రీ, పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. వీరిలో తల్లిదండ్రులు, తమ పిల్లలకు కూడా విషమిచ్చి వారు విషం తీసుకొని మరణించిన వారు ఉండగా.. మరికొందరు తాము చనిపోయి పిల్లలను అనా«థలుగా చేసిన వారు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 729 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 522 మంది పురుషులు ఉన్నారు. వీరిలో దుబాయ్, మస్కట్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. అదే విధంగా కరువు జిల్లా కావడంతో కాలం కలిసి రాక వ్యవసాయంలో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. మరికొందరు చిన్న చిన్న సంఘటనలకు మనోవేదనకు గురై నిండుప్రాణం నిలువునా తీసుకున్నవారు లేకపోలేదు. అదేవిధంగా 165 మంది మహిళలు ఉన్నారు. వీరు కూడా భార్య భర్తల మద్య మనస్పర్థలు, అత్తా మామలు, ఇతర గొడవలు, వరకట్నం వేదింపులకు తాళలేక ఒక చోట ఫ్యాన్‌కు ఉరివేసుకొని, మరొక చోట క్రిమిసంహారక మందు తాగి, ఇంకొక చోట కిరోసిన్, పెట్రోల్‌తో తగుల బెట్టుకొని మరణించిన వారు ఉన్నారు. అయితే ఈ 687 మందిలో దాదాపుగా 90 శాతం మంది వివాహితులు కావడం, వారికి చిన్న చిన్న పిల్లలు ఉండటం గమనార్హం. తనువు చాలించే సమయంలో పసికూనల భవిష్యత్ ఆలోచించి ఉంటే వారు బతికుండేవారని, అనేవారు కొందరైతే ఏ పాపం ఎరుగని పసిపిల్లల బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసి వెళ్లిపోయారని అనేవారు కొందరు ఉన్నారు. ఎవ్వరేమన్నా.. అనా«థలుగా మారిన బాల్యం మాత్రం అనునిత్యం మనోవేదనకు గురవుతూనే ఉన్నారు. బాల్యానికి భరోసా ఏదీ? పిల్లలను వేధించడం నేరం అని తల్లిదండ్రులకు కూడా శిక్షలు వేసే దేశాలు ఉన్నాయి. బాల్యం విలువైనది, వారి హక్కులను హరించే అధికారం ఎవరికి లేదని మన దేశంలో కూడా ఎన్నో హక్కులు వచ్చినా.. తల్లిదండ్రుల క్షణికావేశం, ఇతర కారణాలతో పిల్లలను వదిలేయడం, బాల్య వివాహాలు చేసి వారి భవితను అంధకారం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు బాలుర రక్షణ, సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా మాతా, శిశుసంక్షరణ, పోలీస్ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1651 మందిని గుర్తించారు. ఎవరూ లేక భిక్షాటన చేసేవారు, అనాధలు, బడిమానేసిన వారు, బాలకార్మికులుగా జీవనం సాగించేవారు ఉండటం గమనార్హం. కౌన్సెలింగ్ అవసరం.. ఆత్మహత్యలు క్షణికావేశంలో చేసే పని. మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతారు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు జీవితాంతం వేదన చెందాల్సి ఉంటుంది. మానసికంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం. చిన్న చిన్న విషయాల్లో భయాందోళన చెందిన వారిని గుర్తించాలి. వారి కుటుంబ సభ్యులు వెంటనే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించాలి. చిన్నతనం నుంచే సమాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాలి. – డాక్టర్ అనూష, మానసిక వైద్యురాలు, సిద్దిపేట రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు జిల్లా బాలురు బాలికలు మొత్తం సిద్దిపేట 333 85 468 సంగారెడ్డి 206 411 617 మెదక్ 258 358 566 మొత్తం 797 854 1651 -
స్పెషల్ ఎడ్యుకేషన్
టాప్ స్టోరీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్.. వృత్తి బాధ్యతలు ఎంతో ప్రత్యేకం.. పిల్లల పట్ల కేరింగ్ చాలా ముఖ్యం! ఎందుకంటే.. తాము బోధించాల్సిన విద్యార్థులకున్న ప్రత్యేక అవసరాలే అందుకు కారణం. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు సంపాదనతోపాటు సేవా సంతృప్తి సొంతమవుతుంది. ఇటీవల కాలంలో సామాజికంగా ప్రాధాన్యత పెరుగుతూ.. కెరీర్ పరంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. తోటి పిల్లలతో కలిసి ఆడుతూ,పాడుతూ కేరింతలు కొట్టాల్సిన అయిదారేళ్ల వయసులో.. తమకే తెలియని మానసిక, శారీరక సమస్యలతో అందమైన బాల్యాన్ని కోల్పోయే చిన్నారులు ఎందరో! అలాంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి రూపొందించిన కోర్సులే.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విషయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని వైకల్యాలను గుర్తించారు. అవి.. బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం (మూగ). స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేసిన వారు ఇలాంటి సమస్యలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఉత్తీర్ణులకు మంచి డిమాండ్ ఉంది. పలు ఇన్స్టిట్యూట్స్ ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆర్సీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లక్ష్యం ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ బోధన, శిక్షణ కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) పేరుతో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే సంస్థలన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లు అందించే కోర్సులు, సర్టిఫికెట్లకే జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు. ప్రవేశం ఇలా ఆర్సీఐ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్స్ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్స్ నోటిఫికేషన్ ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. సాధారణంగా ప్రతి ఏటా మే, జూన్‌లో ప్రవేశాలు జరుగుతాయి. బ్యాచిలర్ కోర్సులు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్/లెర్నింగ్ డిజేబిలిటీస్/లోకోమోటలర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్/మల్టిపుల్ డిజార్డర్/ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్)వంటి కోర్సులున్నాయి. బీఏ బీఈడీ (విజువల్ ఇంపెయిర్మెంట్); బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్); బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ; బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ వంటి కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశించడానికి అర్హత డిగ్రీ. అవకాశాలు పుష్కలం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అవకాశాలు పుష్కలం. ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలోనూ డిమాండ్ ఉంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాక నెలకు రూ.15 వేల జీతంతో ప్రైవేటు రంగంలో కెరీర్ ప్రారంభించొచ్చు. వీరికి ప్రభుత్వ విభాగంలో డీఎస్సీలోనూ పోటీ పడే అవకాశముంది. సర్టిఫికెట్ కోర్సులు స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్. పదో తరగతి, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులు వీటిల్లో చేరొచ్చు. డిప్లొమా స్థాయి కోర్సులు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు అర్హతగా డిప్లొమా స్థాయి కోర్సులు ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపెయిర్మెంట్), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ (మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్). పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో ఎంపీఈడీ, ఎమ్మెస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి విజువల్ ఇంపెయిర్మెంట్; హియరింగ్ ఇంపెయిర్మెంట్; మెంటల్ రిటార్డేషన్; ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకోసోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు వీటిలో ప్రవేశించడానికి అర్హులు. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి పలు పీజీ డిప్లొమా కోర్సులు సైతం అభ్యసించే వీలుంది. ఇన్స్టిట్యూట్స్ * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్. * స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు. * కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళాసభ, ఓయూ క్యాంపస్. * డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం. * శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. * దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఓర్పు, నేర్పు అవసరం స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఖాయం. కానీ ఇదే సమయంలో కేవలం కెరీర్ అవకాశాలను పరిగణించే ఈ కోర్సులు ఎంపిక చేసుకోవాలనుకోవడం సరికాదు. కారణం.. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా తాము బోధించాల్సిన విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులని గుర్తించాలి. ఓర్పు, నేర్పు ఉన్న వారే స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్. వి.ఆర్.పి. శైలజ, హెచ్ఓడీ, స్పెషల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్