బర్నింగ్‌ ది క్లాక్స్‌ | Burning the Clocks: lantern parade and fire show held on 21st of December each year in Brighton | Sakshi
Sakshi News home page

బర్నింగ్‌ ది క్లాక్స్‌

Dec 21 2025 1:05 AM | Updated on Dec 21 2025 1:05 AM

Burning the Clocks: lantern parade and fire show held on 21st of December each year in Brighton

కాలాన్ని ఒడిసి పట్టే గడియారాలను దహనం చేయడమే బ్రిటన్‌లోని ‘బర్నింగ్‌ ది క్లాక్స్‌’ ఫెస్టివల్‌ ప్రత్యేకత. బ్రిటన్స్ లోని ససెక్స్‌లో ఉన్న బ్రైటన్‌ నగరంలో ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 21 లేదా 22న జరిగే అద్భుతమైన సామూహిక ఉత్సవమే ‘బర్నింగ్‌ ది క్లాక్స్‌’. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఈ వేడుక జరుగుతుంది. ఇది పాత సంవత్సరాన్ని గౌరవంగా సాగనంపి, రాబోయే కొత్త ఆశలకు, వెలుగులకు స్వాగతం పలికే వేడుక!

ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ‘సమ్‌ స్కై’ అనే స్థానిక కళా సంస్థ నిర్వహిస్తుంది. రకరకాల పోటీలు కూడా ఏర్పాటు చేస్తుంది. శీతకాలపు చీకటిని పోగొట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.

సాయంత్రం వేళ జరిగే లాంతర్ల ఊరేగింపు, ఈ ఉత్సవంలో అత్యంత ఆకర్షణీయమైనదని చెప్పొచ్చు. బ్రైటన్‌ స్థానికులు, అక్కడికి వచ్చిన కొందరు ఔత్సాహికులు తమ చేతులతో తయారుచేసిన ప్రత్యేకమైన లాంతర్లను తీసుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా నడుస్తారు. వీటిలో ఎక్కువ శాతం గడియారాలు ఉంటాయి. ఈ లాంతర్లను సాధారణంగా కాగితం లేదా వెదురుతో తయారు చేస్తారు. అవి గడియారాలే కాక చంద్రుడు, నక్షత్రాలు, చిత్రవిచిత్రమైన ఎన్నో రూపాలను పోలి ఉంటాయి. ఈ చూడముచ్చటైన దృశ్యంతో వీధులన్నీ మెరుస్తాయి.

ఇక చివరిగా బ్రైటన్‌ సముద్ర తీరం వద్ద ఈ ఊరేగింపు ముగుస్తుంది. అక్కడ, ప్రతి ఒక్కరూ తమ లాంతర్లను ఒక పెద్ద కొయ్యపై వేసి, అగ్నితో దహనం చేస్తారు. గడియారాలు కాలాన్ని సూచిస్తాయి కాబట్టి వాటిని దహనం చేయడమంటే పాత బాధలను, చెడు జ్ఞాపకాలను, గడిచిన కాలాన్ని విడిచిపెట్టడమే అని అక్కడి వారు భావిస్తారు. ఆ తరువాత, బాణాసంచా ప్రదర్శనతో ఆకాశం కాంతులీనుతుంది. చూపరుల మనసు నిండుతుంది.

  • సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement