
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్యలో ప్రతియేటా దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమం ఎంతో వేడుకగా నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి పలు భద్రతా కారణాల రీత్యా ఉత్తరప్రదేశ్ సర్కారు అయోధ్యలో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేయడంపై నిషేధం విధించింది.
దసరా సందర్భంగా 240 అడుగుల ఎత్తయిన రావణుడితో పాటు 190 అడుగుల ఎత్తయిన మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడంపై అధికార యంత్రాంగం నిషేధం విధించిందని అధికారులు తెలిపారు. అయోధ్య సర్కిల్ ఆఫీసర్ దేవేష్ చతుర్వేది మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా భారీ రావణ దహన కార్యక్రమానికి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోలేదని కూడా ఆయన తెలిపారు. పెట్రోలింగ్ సమయంలో ఈ దిష్టిబొమ్మల నిర్మాణాన్ని గమనించి, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
కాగా ఫిల్మ్ ఆర్టిస్ట్ రామ్‌లీలా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుభాష్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ రావణ దహనంపై చివరి నిమిషంలో నిషేధం విధించడం తగదన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన కళాకారులు 240 అడుగుల రావణునితో పాటు ఇతర దిష్టిబొమ్మల తయారీని పూర్తి చేశారని అన్నారు. ఈ దిష్టిబొమ్మల తయారీకి ఖర్చు చేసిన వేలాది రూపాయలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా కోసం తయారుచేసిన రావణ దిష్టిబొమ్మలను దహనం చేయకపోతే పలువురు దానిని అశుభంగా పరిగణిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
అయోధ్యలో ఏదోఒక ప్రాంతంలో 240 అడుగుల రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి అనుమతినివ్వాలని మాలిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేశారు. తాను బీజేపీకి చెందిన కార్యకర్తనని, గత ఏడేళ్లుగా అయోధ్యలో భారీ రామ్‌లీలను నిర్వహించడంలో చురుకుగా పాల్గొంటున్నానని తెలిపారు. సెప్టెంబర్ 22న అయోధ్యలో ‘రామ్ లీల’ ప్రారంభమయ్యింది. అధునాతన త్రీడీ టెక్నాలజీతో 120 అడుగుల వేదికపై దీనిని ప్రదర్శిస్తున్నారు. అక్టోబర్ 2 వరకు రామ్ లీల కొనసాగనుంది. అదేరోజున రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.