
నా భార్య మరొకరితో సంబంధం పెట్టుకొని నా నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల కేసులో నేను తనకు ఫలానా వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అని పేరుతో సహా చెప్పినప్పటికీ, తనకు అలాంటివేమీ లేవని కోర్టును నమ్మించింది. దాంతో నేను పదిలక్షల రూపాయలు భరణంగా చెల్లించవలసి వచ్చింది. మా విడాకులు అయిన 7 నెలలకే తను అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తను నా భార్యగా ఉన్నప్పుడు వారు కలిసి తీసుకున్న ఫోటోలు కొన్ని పెళ్లి వీడియోలో పెట్టి ఇంటర్నెట్లో కూడా పెట్టుకున్నారు. నన్ను మానసిక క్షోభకి గురి చేసినందుకు నేను నా మాజీ భార్య ప్రస్తుత భర్తపై కేసు వేయవచ్చా? ఎందుకంటే, ఇటీవలే పేపర్‌లో తైవాన్‌లో భార్య ప్రియుడిపై భర్త కోర్టులో దావా వేయగా కోర్టు అతనికి పరిహారం కూడా చెల్లించమని చెప్పిందని ఒక వార్త చదివాను. మనదేశంలో కూడా అలా చేసే వీలుందా? – సంపత్, హైదరాబాద్
రెండు వారాల క్రితం ఇలాంటి ఒక కేసు గురించి మన పత్రికలో కూడా సమాధాన రూపంగా చె΄్పాను. వివాహేతర సంబంధాలు చట్టరీత్యా నేరాలుగా పరిగణించక పోయినప్పటికీ, సివిల్ దావాలు/పరిహారాలు కోరడానికి భారతీయ చట్టాలలో ఎటువంటి అడ్డంకీ లేదు. మారుతున్న సామాజిక పరిణామాల దృష్ట్యా, వివాహేతర సంబంధాలు ఇకపై సివిల్ కోర్టుకు చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మీరు మీ మాజీ భార్య ప్రియుడి మీద (ప్రస్తుతం ఆమె భర్త) ఖచ్చితంగా కేసు వేయవచ్చు. పరిహారం కూడా కోరవచ్చు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఒక భార్య తన భర్త ప్రియురాలిపై వేసిన దావా చెల్లుతుంది అని పేర్కొంది. అయితే మీరు కేసు వేసిన తర్వాత, మీ మాజీ భార్యకి, తన భర్తకి సంబంధం ఉండేదనే విషయాన్ని ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో రుజువు చేయవలసి ఉంటుంది. కోర్టును ఎవరు ఆశ్రయిస్తే వారే తమ పక్షం వాదనని వాస్తవాలేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది! కేవలం గతంలో వారిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోల ఆధారంగా మాత్రమే మీరు కేసు గెలవడం కొంత కష్టమే! అయితే, అసలు మీ మాజీ భార్యకు అతనితో పెళ్లికి ముందు పరిచయమే లేదు అతను ఎవరో నాకు తెలియదు’’ వంటి సమాధానాలు చెప్పి ఉన్నట్లయితే, మీ డైవర్స్ కేసులో జరిగిన వాదోపవాదాలను ఆధారంగా తీసుకొని మీ తరఫు సాక్ష్యాలుగా కూడా కోర్టు ముందు ఉంచవచ్చు.
చదవండి: ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారా
ఇవన్నీ ఒకవేళ రుజువు అయినట్లయితే మీకు మానసిక క్షోభ కలిగించినందుకు గాను, ఆర్థికంగా కూడా మీరు నష్టపోయినందుకు గాను, మీరు తగిన పరిహారం పొందే అవకాశం లేకపోలేదు. మీరు కేసు వేయాలి, తగిన సాక్ష్యాధారాలతో రుజువు చేయగలను అనుకుంటే, మీ మాజీ భార్యని కూడా కేసులో పార్టీ చేయండి. ఇంతవరకు ఇలాంటి కేసులు లేకపోయినప్పటికీ, ఇటీవలే మన భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మీ కేసు విచారణకు మాత్రం అర్హత సాధించింది. కేసు గెలవడం ఓడిపోవడం తర్వాత సంగతి. అన్ని సాక్ష్యాధారాలు, ముఖ్యంగా మీ డైవర్స్ కేసులో మీ మాజీ భార్య ఇచ్చిన వాంగ్మూలాలు/ క్రాస్ ఎగ్జామినేషన్‌లో తను చెప్పిన సమాధానాలు వంటివి నిక్షిప్తపరిచి ఒక లాయర్‌ను సంప్రదిస్తే మీకు ఉపశమనం లభించవచ్చు.
ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు.