
నా పెళ్లయి సంవత్సరం అవుతోంది. నేనూ నా భర్త, బెంగళూరులో ఉంటాం. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కూతురిని. నన్ను మా ఇంట్లో ఒక రాకుమారి లాగా పెంచారు. కానీ మా అత్త గారింట్లో నన్నెవరూ పట్టించుకోవడం లేదు! నా భర్త వాళ్ళ అమ్మ మాటకే విలువ ఇస్తాడు. నామాట అసలు వినడు. అత్తగారు అక్కడి నుంచే మా ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది. మా ఆయన సంపాదించే డబ్బులు ఖర్చు పెట్టుకునే స్వాతంత్య్రం నాకు లేదు. ఆయన కూడా ఏదైనా కొనమంటే... ఉన్నదానితో సర్దుకోమంటాడు. మా అత్తగారింటికి వెళితే నాకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. ఆమె టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. ఈ విషయం గురించి కూడా మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాకు ఇంక వేరే సమస్యలు ఏం లేవు. మా అమ్మ వాళ్ళేమో విడాకులు తీసుకుని వచ్చేయమని అంటున్నారు. నా భర్త మంచివాడు, తనంటే నాకు చాలా ఇష్టం. నా భర్తని నేను పూర్తిగా కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పి నా కాపురాన్ని నిలబెట్టండి!
– ప్రత్యూష, బెంగుళూరు
ఇది మీ ఒక్కరి సమస్యే కాదు! చాలా కుటుంబాల్లో అత్త – కోడలు మధ్య ఈ రకమైన ఒత్తిళ్లు, మనస్పర్థలు సర్వసాధారణం! కొడుక్కి గడ్డాలు, మీసాలు వచ్చినా తన వేలు పట్టుకుని నడిపించాలి అనుకుంటారు చాలా మంది తల్లి తండ్రులు. ఆ ఆలోచనలతోనే వారి జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. ఇవన్నీ పెళ్లికి ముందు బాగానే ఉన్నా, పెళ్లి తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. పిల్లల జీవితంలో ఒక భాగ స్వామి వచ్చాక వారి నిర్ణయాలను వారే తీసుకునే స్వాతంత్య్రం ఇవ్వాలి తల్లిదండ్రులు!
ఒక తల్లి తన కోడలిని బయట నుంచి వచ్చిన అమ్మాయిలా కాకుండా, తన కొడుకుతో జీవితాంతం తోడుండే, ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించాలి, అలాగే భర్త కూడా తన కుటుంబాన్ని వదిలి వచ్చిన భార్యని గౌరవించడం కనీస బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి.. ఇక్కడ మనం గమనించాల్సంది. ‘సంసారం అంటే ఒకరినొకరు నియంత్రించుకోవడం కాదు, ఒకరి నొకరు అర్థం చేసుకోవడం‘. మీ భర్త తన తల్లిని గౌరవించడం తప్పు కాదు. కానీ అదే సమయంలో మిన్ముల్ని చిన్నచూపు చూడడం కూడా తగదు.
మీరు మీ భర్తను పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకోవాలనుకోవడం కూడా సరైనది కాదు. మీ తల్లితండ్రులు మీకు విడాకులు తీసుకోమని సలహా ఇస్తున్నా, అది ఈ సమస్యకి పరిష్కారం కానే కాదు! మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ భర్తని గెలవాలంటే ముందు మీరు మీ అత్తగారిని గెలవాలి. అది ద్వేషంతో కాదు, ప్రేమతో, మీ మృదువైన మాటలతో కాస్త తెలివిగా ఆలోచించి, ఆమెతో మాట్లాడితే ఆమె కూడా కొన్ని విషయాల్లో మారతారు.
నిదానంగా ఆమె కూడా మీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను కోపంతో, ఆవేశంతో కాకుండా ఓపికతో, చాకచక్యంగా ఎదుర్కొంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. మీ భర్తతో మీరు ప్రశాంతంగా ఈ అంశం గురించి మాట్లాడండి. ఏదైనా అవసరం అయితే మీకు సహాయం చేయడం కోసం మానసిక నిపుణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!.
(చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..)