హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే రివాల్వర్ రీటాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియంటేడ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తోట్టం అనే మూవీలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్.. తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి రోజు తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ భావోద్వేగానికి గురయ్యాడని వెల్లడించింది. 15 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడంతో తాను మరింత ఎమోషనల్ అయ్యాడని తెలిపింది. ఆంటోనీ కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూడటం మొదటిసారని అన్నారు.
కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'మేము ఇలాంటి పెళ్లి గురించి కలలో కూడా ఊహించలేదు, ఎందుకంటే మేము పారిపోయి పెళ్లి చేసుకుందామని అక్షరాలా అనుకున్నాం. కానీ ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ ఊహించలేదు. అది నిజం కావడంతో మాకు మాటలు రాని స్థితిలో ఉండిపోయాం. ఈ క్షణం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూశాం. ఇదంతా కేవలం 30 సెకన్లలోనే ముగిసింది. నేను పూర్తిగా శూన్యంలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు తాళి తప్ప అన్నీ శూన్యంగా అనిపించాయి. అది చాలా భావోద్వేగభరితమైన క్షణం. బహుశా అతను కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నేను చూడటం అదే మొదటిసారి. ఇది ఒక అందమైన ప్రయాణం' అంటూ చెప్పుకొచ్చింది.
కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ..
కాగా.. కీర్తి సురేశ్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందే ఆంటోనీ తట్టిల్ ప్రేమలో ఉంది. చిన్ననాటి స్నేహితుడైన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం నడిచింది. ఈ జంట డిసెంబర్ 12, 2024న గోవాలో వివాహం చేసుకున్నారు. మొదట సాంప్రదాయ హిందూ వివాహం.. ఆ తర్వాత మలయాళీ క్రైస్తవ పద్ధతిలో ఒక్కటయ్యారు.


