
అలెక్స్ హేలీ రాసిన ‘ఏడు తరాలు’ చాలా ప్రసిద్ధం. ఇప్పటి పిల్లలు కనీసం మూడు తరాలు తెలుసుకుని ఉన్నారో లేదో. దాయాదుల సంగతి తర్వాత. మేనత్తలు, మేనమామలు, పిన్ని, బాబాయి... ఈ రక్తానుబంధం పిల్లలకు తెలియచేయాలి. తల్లి తరఫు తాత, తండ్రి తరఫు తాత అక్కడి నుంచి సాగిన కొమ్మలు రెమ్మలు ఈ వంశ వృక్షం తెలియాలి. మూలాలు తెలిసిన ప్రయాణం అర్థవంతమైనది. ఈ వేసవిలో పిల్లల చేత ఫ్యామిలీ ట్రీ తయారు చేయించండి. వారితో మీరు తయారు చేయించే చార్టు నిధి పటానికి తక్కువ కాదు.
పిల్లలకు ఊహ తెలిశాక ‘అమ్మా... నేను ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్న అడుగుతారు. పిల్లలకు తమ జన్మ మూలాలే కాదు జన్మకు కారణమైన వారి మూలాల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లో పెద్దవాళ్ల ఫొటోలు గోడలకు వేలాడుతుండేవి. పిల్లలు ఎదుగుతూ ఆ ఫొటోల్లో ఉన్నది తమ పెద్దవారని తెలుసుకునేవారు. జేజి నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య... వీళ్లను ఫొటోల్లో చూసి తెలుసుకునేవారు. రాను రాను ‘ఇంటీరియర్స్’లో భాగంగా ఈ ఫోటోలకు పెద్దగా చోటు లేకుండా పోయింది.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో ‘ఫ్యామిలీ ఆల్బమ్స్’ ఉండేవి. అవి తెరిచి వాటిని చూస్తూ ఉంటే రక్త సంబంధీకులందరూ తెలిసేవారు. డిజిటల్ యుగం వచ్చాక ఆల్బమ్‌లు కూడా పోయాయి. ఉమ్మడి కుటుంబాలుంటే ఒకరు చెప్పక΄ోయినా మరొకరైనా పెద్ద వాళ్ల గొప్పతనాలు, ఘనతలు, పడిన కష్టాలు పిల్లలకు తెలియచేసేవారు. ముత్తాత, తాతలు అంత కష్టపడి, అన్ని గొప్ప పనులు చేశారు... నేను వారి పేరు నిలబెట్టాలి అని పిల్లలకు తెలిసి వచ్చేది. కాని ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలూ లేవు.
వాస్తవం చెప్పాలంటే నేడు చాలా ఇళ్లల్లో పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలు అతి కష్టం మీద తెలుస్తున్నారు. మనిషికి ఒంటరితనం అనుమతి లేదు. ప్రకృతి అలా అంగీకరించదు కనుకే కుటుంబాన్ని ఇచ్చింది. బంధు పరివారాన్ని ఇచ్చింది. నూరేళ్లు జీవించాలంటే ఎన్ని సందర్భాలలోనో ఎందరి తోడో అవసరం. మనకంటూ నిలబడేది మనవారే అనే భావన పిల్లలకు రావాలంటే వారికి ‘వంశ వృక్షం’ తెలియాలి.
పెద్దవాళ్లూ... గమనించండి... నేడు పిల్లలకు లోకేశ్ కనకరాజ్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ యూనివర్స్ తెలుస్తున్నాయిగాని... సొంత ఫ్యామిలీ యూనివర్స్ తెలియడం లేదు. అందుకని ఈ సమ్మర్‌లో ఒక ప్రాజెక్ట్ వర్క్‌లాగా వారి చేత ఫ్యామిలీ ట్రీని గీయించండి.
చార్టులూ, నోట్‌బుక్కులూ:
ఫ్యామిలీ ట్రీని చార్టు మీద తయారు చేయడం ఆనవాయితీ. అంత పని వారు చేయలేక΄ోయినా ఒక నోట్‌బుక్ ఇచ్చి పేజీకి ఒక ఫ్యామిలీ రాయించి కూడా వారికి ఫ్యామిలీ ట్రీని తెలియచేయనివ్వ వచ్చు. వారి చేత ఇలా ఫ్యామిలీ ట్రీ తయారు చేయించండి.
1. మొదట సొంత ఇంటి చెట్టు గీయించండి. నేనూ, తమ్ముడు, అమ్మా, నాన్నా. అమ్మా నాన్నలు చెట్టు కాండమైతే కొమ్మలు పిల్లలు.
2. మరోరోజు ఇంకొంచెం పెద్ద చెట్టు గీయించండి. ఈ చెట్టులో నాన్న తల్లిదండ్రులు, అమ్మ తల్లిదండ్రులు వస్తారు.
3. మూడోరోజు మరికాస్త పెద్ద చెట్టు గీయించి ముత్తాతల వరకూ పేర్లు రాయించాలి. దీంతో ప్రాథమిక వంశ వృక్షం పూర్తయినట్టే. ఇక్కడి నుంచి పిల్లల అవగాహనను బట్టి శాఖలు విస్తరించుకుంటూ వెళ్లాలి.
పెద తాత, చిన తాత
తాతల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉంటారని వారూ వారి పిల్లలు మనకు దగ్గరి బంధువులు అవుతారని చెప్పాలి. అలాగే నానమ్మ, అమ్మమ్మల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉంటారని చెప్పాలి. వాళ్లల్లో ఇప్పుడు అందరూ పిల్లలకు పరిచయంలో లేకపోవచ్చు. కాని కొందరు ఉంటారు. వారు ఫ్యామిలీట్రీలో ఎక్కడ చేరుతారో గీయించాలి.
తక్షణ తరం
పిల్లలకు తక్షణమే అనుబంధంలో ఉండాల్సిన వారు పెదనాన్న, చిన్నాన్న, మేనత్తలు వారి పిల్లలు. ఈ ట్రీని ఒకటి తయారు చేయించాలి. అలాగే పెదమ్మ, పిన్ని, మావయ్య... వీరూ వీరి పిల్లలు. ఈ ట్రీ కూడా తెలియాలి. వీరందరి పిల్లల గ్రూప్‌ను ఒకటిగా చెట్టు మీద చిటారు కొమ్మల్లో రాయించవచ్చు.
సాయాలూ, ప్రేమలూ:
ఫ్యామిలీ ట్రీలో వరుసలు తెలిస్తే సరిపోదు. ఆ రక్త సంబంధీకులంతా ఒకరి కోసం ఒకరు ఎలా నిలబడ్డారో ఏ సమయంలో ఎవరు సాయం చేశారో, ఎవరు ఎలాంటి ప్రేమను ప్రదర్శించారో పిల్లలకు చె΄్పాలి. తెగిన బంధాల గురించి వాటిపై ఉన్న కోపాల గురించి పిల్లలకు చెప్పకపోవడమే మంచిది. ‘రేపు మీరు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసినా ఎక్కడ ఉన్నా మీ వాళ్లు ఎవరో వారు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలి. మంచి చెడుల్లో పాల్గొనాలి. కమ్యూనికేషన్‌లో ఉండాలి’ అని గట్టిగా చెప్పాలి. రోజులు, ప్రపంచం టఫ్‌గా మారుతున్నప్పుడు పిల్లలకు బలగం ఉందన్న భరోసా ఫ్యామిలీ ట్రీ ఇస్తుంది. ఆ చెట్టు పచ్చగా ఉండేలా చూడండి.
ఫస్ట్–ఉమన్ దుఃఖాన్ని జయించి...
ప్రతిష్ఠాత్మకమైన ‘మిచెలిన్ స్టార్’ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఫిమేల్ ‘సుషీ చెఫ్’గా పారిస్‌కు చెందిన 54 ఏళ్ల చిజుకో కిమురా రికార్డ్ సృష్టించింది. నిజానికి ఆమె అనుకోని పరిస్థితుల్లో చెఫ్‌గా మారాల్సివచ్చింది. కిమురా భర్త షునై చెఫ్. మూడు సంవత్సరాల క్రితం రెస్టారెంట్ ప్రారంభించి తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు.
ఆ రెస్టారెంట్ విజయవంతం అయింది. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవ లేదు. భర్తకు క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో చిజుకో కిమురాకులు పోలేదు. ఆ విషాదం నుంచి తేరుకొనక ముందే భర్త చనిపోయాడు. ఏడుస్తూ కూర్చోవడం కంటే భర్త కలను నెరవేర్చడమే ముఖ్యం అనుకుంది.
ఒకప్పుడు టూర్ గైడ్‌గా పనిచేసిన కిమురాకు రెస్టారెంట్ వ్యవహారాలు, వంటల గురించి బొత్తిగా తెలియదు. ఒక్కటొక్కటిగా భర్త నుంచి నేర్చుకుంది. భర్త లేక΄ోయినా ఆయన నేర్పిన విద్య తనకు తోడుగా ఉంది. ఆ విద్య తనను తిరుగులేని చెఫ్‌ని చేసింది. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది.
(చదవండి: భారతీయ హస్తకళకు అర్థంపట్టే డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..)