
నరక చతుర్దశి
ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద పండగ చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయిందంటే.... నరకుడు అజ్ఞానానికి, పీడనకు, హింసకు ప్రతీక. నరకం అంటే దుర్గతి.
అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. ఆ చెడు తన కుమారునిలో ఉందన్న కారణంగానే అతడి సంహారానికి కారణమయింది తల్లి సత్యభామ. తనలా మరే తల్లీ ఎవరి గర్భశోకానికీ కారణం కాకూడదన్న కోరికతో తన కుమారుడి పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా వరం కోరుకుంది. అందుకే శ్రీకృష్ణుడు అతడి పేరు మీదుగానే భవిష్యతులో అందరూ ‘నరక చతుర్దశి’ జరుపుకుంటారని వరమిచ్చాడు.
హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు.
భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఎందుకంటే స్వయానా తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను చేసిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. నరకుడు విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు.
దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీ కృష్ణుడు ఇతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు. మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం వాడికో వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగలేదు.
చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ రాక్షసాధముని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపుబాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు.
అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి నరకుణ్ణి నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు తేరుకుని సుదర్శన చక్రం ప్రయోగించి అతడిని సంహరించాడు. అలా ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి వల్లనే సంభవించింది.
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది.
ఈ రోజు ఏం చేయాలి?
ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణ చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు.
అభ్యంగన స్నానానంతరం దక్షణాభిముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.
నరక చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు నమ్ముతారు. నరకచతుర్దశి మరునాడే దీపావళి.
రావణుడు... మా ఊరి అల్లుడు!
దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు పది కిలోమీటర్‌ల దూరంలో ఉన్న మండోల్‌లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే.
దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు!
చీకటి దీపావళి!
దీపావళి వేడుకల తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్‌ప్రదేశ్‌కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.
దేవరి రాత్రి
ఛత్తీస్‌ఘడ్‌లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.
ఆవులను తమపై నడిపించి...
మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీపావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.
భర్త కోసం రాత్రంతా దీపాలు...
మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.
శ్రీవిష్ణువు భూలోకానికి...
గుజరాత్‌లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్‌లో దీపావళి జరుపుకుంటారు. కోల్‌కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.
సోదర, సోదరీమణులు...
మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.
లక్ష దీపాల ఆగ్రా కోట
అక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగిపోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు.
– డి.వి.ఆర్.