
ఘనమైన కుటుంబ వ్యాపార నేపథ్యం ఉన్నంత మాత్రాన... ‘విజయం అనివార్యం’ అని చెప్పడానికి లేదు. అంకితభావం, కష్టం ఉంటేనే విజయం సొంతం అవుతుంది.
ఘనమైన కుటుంబ వ్యాపారనేపథ్యం లేనంత మాత్రాన...‘విజయం దూరం’ అని చెప్పడానికి లేదు. ఆసక్తికి అంకితభావం, కష్టం తోడైతే విజయం సొంతం అవుతుంది.
దీనికి తాజా ఉదాహరణ... అవెండస్ వెల్త్–హురున్ ఇండియా–2025 జాబితా.
35 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన 155 మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు వెల్త్–హురున్ ఇండియా జాబితాలో చోటు సాధించారు. వీరిలో... వారసత్వ బాధ్యతకు తమ శక్తియుక్తులను జోడించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. కొన్ని ఉత్పత్తులలో లోపాలు కనిపెట్టి లోపాలు లేని, సౌకర్యవంతమైన ప్రాడక్ట్స్ కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారి విజయం సాధించిన వారూ ఉన్నారు... వారిలో కొందరు యంగ్ ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ల గురించి..
సక్సెస్‌ఫుల్ యూఎస్పీతో...
ప్రారంభ కష్టాల మాట ఎలా ఉన్నా... ఉమెన్ యాక్టివేర్ ‘బ్లిస్‌క్లబ్’ మార్కెట్‌లో నిలుదొక్కుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఈ ఆన్‌లైన్ బ్రాండ్ ఆ తరువాత రెండు ఆఫ్‌లైన్ స్టోర్‌లను కూడా లాంచ్ చేసి విజయం సాధించింది. ‘మార్కెట్‌లో ఎన్నో బ్రాండ్‌లు ఉన్నాయి కదా. మీ ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ‘బ్లిస్‌క్లబ్’ ఫౌండర్, సీయీవో మినూ మార్గరెట్ ముందు వచ్చి నిల్చుంది. సిగ్నేచర్ ఫ్యాబ్రిక్స్, వినూత్నమైన ప్రాడక్ట్ డిజైన్‌ను తమ కంపెనీ యూఎస్పీగా చేసుకొని విజయం సాధించింది మార్గరెట్.
నేషనల్ లెవెల్ ఫ్రిస్బీ ప్లేయర్ అయిన మినూ మార్గరెట్ యాక్టివేర్‌కు సంబంధించిన డీసెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘బ్లిస్‌క్లబ్’ స్టార్టప్ ఆలోచనవచ్చింది.
‘యాక్టివేర్ రంగంలోని కంపెనీలు డిజైన్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తాయి. మేము మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నాం. బ్లిస్‌క్లబ్‌కు డిజైన్ క్లబ్ లేదు. ప్రాడక్ట్ ఇంజినీరింగ్ టీమ్ మాత్రమే ఉంది. ఈ టీమ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యాక్టివేర్ సౌలభ్యానికి సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడం. ఉదాహరణకు చెన్నైలోని ఒక మహిళ గురించి. వేడి వాతావరణంలో ఆమెకు లెగ్గింగ్స్ ధరించడం కష్టమయ్యేది. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని వేడివాతావరణంలో కూడా సౌకర్యంగా ఉండే లెగ్గింగ్స్‌ను డిజైన్ చేశాం’ అంటుంది మార్గరెట్.
దేశంలో తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్
చెరకు, బయోప్లాస్టిక్‌కు సంబంధించిన ఆపరేషన్‌లలో యువ మార్గదర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అవంతిక సరౌగి. కాలిఫోర్నియాలో చదువుకున్న అవంతిక తమ బల్‌రామ్‌పూర్ చినీ మిల్స్ లిమిటెడ్ (బీసిఎంఎల్)ను పీఎల్‌ఏ (పాలీలాక్టిక్ యాసిడ్) తయారీ సౌకర్యాన్ని అందించే కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉంది. ఇది మన దేశంలోని మొట్ట మొదటి బయోప్లాస్టిక్ ప్లాంట్ కానుంది. పీఎల్‌ఏ అనేది చెరకు పునరుత్పాదక వనరుల నుండి తయారైన బయో ఆధారిత, కంపోస్టబుల్, తక్కువ ఉద్గారాల ప్లాస్టిక్. దీనిని సాధారణంగా ΄్యాకేజింగ్, త్రీడి ప్రింటింగ్‌లో ఉపయోగిస్తారు. మన దేశంలోని ఈ తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్ వల్ల బీసిఎంఎల్ లాభాల బాటలో పయనించనుంది. టర్నోవర్ పెరగనుంది. పర్యావరణ అనుకూలంగా కూడా మారనుంది.
తరగతి గదినిమార్చేలా
వినూత్నమైన ఆలోచన విధానంతో విద్యా, సాంకేతిక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ పరిత పరేఖ్. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకుంది. బ్రౌన్ తరువాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్’పై మాస్టర్స్ చేసింది. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకునే రోజుల్లో పిల్లల విద్యావిధానం మీద దృష్టి పెట్టేది. స్టాన్‌ఫోర్డ్‌లో చేసిన పరిశోధనలు, నేర్చుకున్న ఆధునిక సాంకేతిక విషయాలు ఆమెను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు నడిపించాయి.
కట్టింగ్–ఎడ్జ్ ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘టొడెల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించింది పరిత. మూస బోధన పద్ధతులకు అతీతంగా ఆధునిక బోధన పద్ధతులు, ఆలోచనలతో ‘టొడెల్’ ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేసింది. ‘టొడెల్’ ప్రభావంతో చాలా బడులలో ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే సంప్రదాయ, ఆధునిక విద్యాబోధనలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ‘టొడెల్’ కృషి చేస్తోంది. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెం పొందించే ప్రణాళికలతో ‘టొడెల్’ విద్యాప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది.
చిన్న గదిలో మొదలై...కోట్ల టర్నోవర్ వరకు
బెంగళూరులోని చిన్న గదిలో మొదలైన ‘యానిమల్’ రూ.550 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ స్థాయికి చేరింది. ఐఐటీ–దిల్లీలో చదువుకున్న కీర్తి జాంగ్ర, నీతూ యాదవ్‌ల బ్రెయిన్ చైల్డ్ ‘యానిమల్’. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవ్యవస్థీకృతంగా ఉన్న మన దేశంలోని పశువుల మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
పశువుల క్రయవిక్రయాలలో ‘యానిమల్’ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. తమ స్టార్టప్‌ను ప్రారంభించడానికి ముందు సర్వే నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు కీర్తి, నీతూ యాదవ్. డైరీ ఇండస్ట్రీలో కీలకమైన మార్పు తేవాలనుకున్న కీర్తి, నీతూ యాదవ్‌లు ‘యానిమల్’ యాప్‌తో తమ కలను నిజం చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మనం ఉన్న చోటు నుంచే వందల కిలోమీటర్‌ల దూరంలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్న ప్రదేశం తదితర వివరాలు తెలుసుకోవచ్చు.