
దేశీ కుబేరుల జాబితాలో ఆధిపత్యం
గౌతమ్ అదానీకి రెండో ర్యాంక్
ఎం3ఎం హురున్ 2025 నివేదిక వెల్లడి
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోకెల్లా ధనవంతుడిగా నిలిచారు. 2025 ఎం3ఎం హురున్ ఇండియా బిలియనీర్ జాబితా ప్రకారం అంబానీ సంపద 6 శాతం క్షీణించి రూ. 9.55 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ 2025లో దేశీయంగా అపర కుబేరుడిగా అవతరించారు. దీంతో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రూ. 8.14 లక్షల కోట్ల సంపదతో దేశీ బిలియనీర్లలో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు.
గతేడాది అదానీ సంపద 95 శాతం జంప్‌చేసి రూ. 11.6 లక్షల కోట్లను తాకడంతో అంబానీని అధిగమిస్తూ టాప్ చెయిర్‌ను పొందిన సంగతి తెలిసిందే. నిజానికి యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు పతనమైనప్పటికీ తిరిగి నష్టాలు రికవర్ అయ్యాయి. కాగా.. తొలిసారి హెచ్‌సీఎల్ గ్రూప్ రోష్నీ నాడార్ మల్హోత్రా టాప్–3లో చోటు సాధించారు.
రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో మూడో ర్యాంకులో నిలవగా.. సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం రూ. 2.46 లక్షల కోట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఈ బాటలో కుమార మంగళం బిర్లా రూ. 2.32 లక్షల కోట్ల సంపదతో ఐదో ర్యాంకులో నిలిచారు. నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం సంపద 43 శాతం జంప్‌చేసి రూ. 2.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నారు.
దేశ జీడీపీలో
హురున్ జాబితాలో చోటుచేసుకున్న బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ. 167 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. జాబితాలో రూ. 1,000 కోట్ల సంపదతో 1,687 మంది వ్యక్తులు స్థానం పొందగా.. ఈ సంఖ్య 284 పెరిగింది. వీరిలో 148 కొత్తగా చోటు సాధించారు. గత రెండేళ్లుగా భారత్‌లో ప్రతీ వారం ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లు హురున్ పేర్కొంది. దీంతో జాబితాలో చోటు పొందినవారిద్వారా ప్రస్తుతం రోజుకి రూ. 1,991 కోట్ల సంపద జమవుతున్నట్లు తెలియజేసింది. కాగా.. పెర్‌ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్లతో జాబితాలో స్థానాన్ని పొందారు. తద్వారా యువ బిలియనీర్‌గా నిలిచారు. యువ బిలియనీర్లలో ఓయో వ్యవస్థాపకుడు 31 ఏళ్ల రితేష్ అగర్వాల్ సైతం రూ. 14,400 కోట్ల నెట్‌వర్త్‌తో పిన్నవయస్కుడిగా జాబితాలో చోటు సాధించారు.
జెప్టో వ్యవస్థాపకులకు చోటు
హురున్ తాజా జాబితాలో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో సహవ్యవస్థాపకులు 23 ఏళ్ల ఆదిత్ పాలిచా, 22 ఏళ్ల కైవల్య వోహ్రా చోటు సంపాదించారు. బిలియనీర్లలో పిన్న వయసు్కలు(జెన్ జెడ్)గా నిలిచారు. 2021లో ఏర్పాటైన జెప్టో వేగంగా వృద్ధి చెందడంతో వోహ్రా సంపద రూ. 4,480 కోట్లకు చేరగా, పాలిచా నెట్‌వర్త్ రూ. 5,380 కోట్లను తాకింది. కంపెనీ విలువ 5.9 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 1,140 కోట్ల సంపదతో ఎస్‌జీ ఫిన్‌సర్వ్ వ్యవస్థాపకుడు రోహన్ గుప్తా, ఆయన కుటుంబం సైతం చోటు సాధించారు.