శాస్త్రీయ రంగంలో ప్రతిభను మరియు "నవ భారత్" స్ఫూర్తిని కొనియాడుతూ జరిగిన ఒక ప్రత్యేక సాయంత్రం వేళ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్‌కు ఘన నివాళులర్పించారు. డాక్టర్ మషేల్కర్ రికార్డు స్థాయిలో 54 గౌరవ డాక్టరేట్లు పొందిన అసాధారణ విద్యా మైలురాయిని పురస్కరించుకుని, ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం, పుస్తకావిష్కరణ నిర్వహించారు.
ఈ వేడుకలో ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మ, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, శాస్త్రీయ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.
వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు వరకు..
సభికులను ఉద్దేశించి అంబానీ మాట్లాడుతూ, ముంబై వీధి దీపాల కింద చదువుకున్న ఒక సామాన్య బాలుడు ప్రపంచ స్థాయి శాస్త్రీయ ఐకాన్‌గా ఎదిగిన డాక్టర్ మషేల్కర్ ప్రయాణాన్ని వివరించారు.
"డాక్టర్ మషేల్కర్ జీవిత ప్రయాణంలో నేను ఆధునిక భారతదేశ ప్రయాణాన్ని చూస్తున్నాను," అని అంబానీ పేర్కొన్నారు. "అతను పేదరికం నుంచి ప్రపంచ స్థాయి గౌరవం వరకు ఎదిగారు. దీనికి కారణం వారి తల్లి అంజనీ గారి ప్రేమ, ఆయన ఉక్కు సంకల్పమే."
చాలామంది జీవితంలో ఒక డిగ్రీ పొందడానికే కష్టపడతారని, కానీ మషేల్కర్ గారు 54 డాక్టరేట్లు సాధించారని అంబానీ కొనియాడారు. అంత ఎదిగినా ఆయన ఎంతో వినయంగా ఉంటారని, "పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ కిందకే వంగి ఉంటుంది" అనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుందని అన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై డాక్టర్ మషేల్కర్ చూపిన ప్రభావం ఈ ప్రసంగంలో ప్రధానాంశంగా నిలిచింది. రిలయన్స్‌ను కేవలం ప్రాజెక్టులను అమలు చేసే సంస్థ నుంచి సైన్స్ ఆధారిత ఆవిష్కరణల (Innovation) దిశగా మళ్లించడంలో మషేల్కర్, ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మల పాత్ర కీలకమని అంబానీ అంగీకరించారు.
2000వ సంవత్సరంలో మషేల్కర్ సూచన మేరకు స్థాపించబడిన రిలయన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కంపెనీ సంస్కృతినే మార్చివేసిందని ఆయన వెల్లడించారు. నేడు రిలయన్స్‌లో 1,00,000 కంటే ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉన్నారని గర్వంగా చెప్పారు. "రిలయన్స్‌ను ఒక పారిశ్రామిక సంస్థగా కాకుండా, ఒక సైన్స్ కంపెనీగా చూడాలని ఆయన మాకు నేర్పారు," అని అంబానీ అన్నారు. ముఖ్యంగా జియో & గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మషేల్కర్ దార్శనికతకు నిలువుటద్దాలని పేర్కొన్నారు.
'గాంధీ ఇంజనీరింగ్' మరియు కృత్రిమ మేధ (AI)
ఈ సందర్భంగా డాక్టర్ మషేల్కర్ రాసిన తాజా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆయన ప్రసిద్ధ సిద్ధాంతమైన *"More from Less for More"* (తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్కువ ఉత్పత్తి చేయడం) గురించి వివరించారు. దీనినే ఆయన 'గాంధీ ఇంజనీరింగ్' అని పిలుస్తారు.
ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుత కృత్రిమ మేధ (AI) యుగానికి అన్వయిస్తూ, అంబానీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు: "AI రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం వహించాలి, కానీ 'కరుణ లేని సాంకేతికత.. కేవలం యంత్రం మాత్రమే' అని మనం గుర్తుంచుకోవాలి." తెలివితేటలతో పాటు సానుభూతిని, సంపదతో పాటు లక్ష్యాన్ని జోడించడం ద్వారా భారత్ ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాను చూపగలదని ఆయన ఆకాంక్షించారు.
క్వాంటం కంప్యూటింగ్, సింథటిక్ బయాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో భారత్ "డీప్-టెక్ సూపర్ పవర్"గా ఎదగాలంటే, పారిశ్రామిక రంగం & విద్యా సంస్థల మధ్య బలమైన అనుసంధానం ఉండాలని అంబానీ పిలుపునిచ్చారు. ప్రసంగం ముగియగానే, అంబానీ "జ్ఞాన యోగి" అని పిలిచిన డాక్టర్ మషేల్కర్‌కు సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవ వందనం సమర్పించారు.


