భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం అంటిలియా (Antilia) గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అయితే.. సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ భవనానికి నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
2010లో అంబానీ.. ముంబయిలోని ‘అంటిలియా’కు మారిన తరువాత, మొదటి నెలలో 637240 యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్లు, దీనికోసం కరెంట్ బిల్ ఏకంగా రూ.70,69,488గా చెల్లించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ బిల్లును సకాలంలో చెల్లించడం వల్ల.. అంబానీకి రూ.48,354 డిస్కౌంట్ కూడా లభించిందని సమాచారం. అంటిలియా భవనం ఉపయోగించే కరెంట్ దాదాపు 7000 సగటు ముంబై గృహాల నెలవారీ విద్యుత్ వినియోగానికి సమానం.
అంటిలియా ప్రత్యేకతలు
ముంబై నగరంలో నిర్మించిన.. ముఖేష్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్‌లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.
ఔట్ డోర్ ఏసీ లేదు!
ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.


