
పెర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో (M3M Hurun India Rich List 2025) అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. చెన్నైకి చెందిన 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ 21,190 కోట్ల వ్యక్తిగత సంపదతో రిచ్ లిస్ట్‌లో అరంగేట్రం చేశారు. డీప్-టెక్, ఏఐ (AI)-ఆధారిత ఆవిష్కరణలలో భారతదేశం ఎంత వేగంగా ఎదుగుతోందన్న దానికి ఇది ప్రతిబింబం.
ప్రపంచ దిగ్గజాలకు పోటీగా ఉన్న ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్ అయిన పెర్‌ప్లెక్సిటీ అరవింద్ శ్రీనివాస్‌కు ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఆయన్ను దేశపు అత్యంత ఉత్తేజకరమైన కొత్త-యుగ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా చేసింది. జెప్టోకు చెందిన కైవల్యా వోహ్రా (22), ఆదిత్ పాలిచా (23) సహా ఇతర యువ పారిశ్రామికవేత్తలతో పాటు ఆయన ఈ జాబితాలో ఉన్నారు.

భారతదేశంలో ఇప్పుడు 358 మంది బిలియనీర్లు ఉన్నారని నివేదిక చూపిస్తుంది. ఇందులో రికార్డు స్థాయిలో 1,687 మంది 1,000 కోట్ల రూపాయల సంపదను దాటినవారు ఉన్నారు. ఆ 358 మంది బిలియనీర్ల మొత్తం సంపద 167 లక్షల కోట్ల రూపాయలు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం. గడిచిన రెండేళ్లలో దేశంలోని ధనవంతులు సగటున రోజుకు 1,991 కోట్ల రూపాయల సంపదను పెంచుకున్నారు. దేశంలో ప్రతి వారం ఒక కొత్త బిలియనీర్ తయారవుతున్నారు.