breaking news
Young entrepreneur
-
యువ హవా
ఘనమైన కుటుంబ వ్యాపార నేపథ్యం ఉన్నంత మాత్రాన... ‘విజయం అనివార్యం’ అని చెప్పడానికి లేదు. అంకితభావం, కష్టం ఉంటేనే విజయం సొంతం అవుతుంది.ఘనమైన కుటుంబ వ్యాపారనేపథ్యం లేనంత మాత్రాన...‘విజయం దూరం’ అని చెప్పడానికి లేదు. ఆసక్తికి అంకితభావం, కష్టం తోడైతే విజయం సొంతం అవుతుంది. దీనికి తాజా ఉదాహరణ... అవెండస్ వెల్త్–హురున్ ఇండియా–2025 జాబితా. 35 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన 155 మంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్లు వెల్త్–హురున్ ఇండియా జాబితాలో చోటు సాధించారు. వీరిలో... వారసత్వ బాధ్యతకు తమ శక్తియుక్తులను జోడించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. కొన్ని ఉత్పత్తులలో లోపాలు కనిపెట్టి లోపాలు లేని, సౌకర్యవంతమైన ప్రాడక్ట్స్ కోసం ఎంటర్ప్రెన్యూర్లుగా మారి విజయం సాధించిన వారూ ఉన్నారు... వారిలో కొందరు యంగ్ ఫిమేల్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి..సక్సెస్ఫుల్ యూఎస్పీతో...ప్రారంభ కష్టాల మాట ఎలా ఉన్నా... ఉమెన్ యాక్టివేర్ ‘బ్లిస్‌క్లబ్’ మార్కెట్లో నిలుదొక్కుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఈ ఆన్లైన్ బ్రాండ్ ఆ తరువాత రెండు ఆఫ్‌లైన్ స్టోర్లను కూడా లాంచ్ చేసి విజయం సాధించింది. ‘మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి కదా. మీ ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ‘బ్లిస్‌క్లబ్’ ఫౌండర్, సీయీవో మినూ మార్గరెట్ ముందు వచ్చి నిల్చుంది. సిగ్నేచర్ ఫ్యాబ్రిక్స్, వినూత్నమైన ప్రాడక్ట్ డిజైన్‌ను తమ కంపెనీ యూఎస్పీగా చేసుకొని విజయం సాధించింది మార్గరెట్.నేషనల్ లెవెల్ ఫ్రిస్బీ ప్లేయర్ అయిన మినూ మార్గరెట్ యాక్టివేర్కు సంబంధించిన డీసెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘బ్లిస్‌క్లబ్’ స్టార్టప్ ఆలోచనవచ్చింది.‘యాక్టివేర్ రంగంలోని కంపెనీలు డిజైన్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తాయి. మేము మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నాం. బ్లిస్క్లబ్కు డిజైన్ క్లబ్ లేదు. ప్రాడక్ట్ ఇంజినీరింగ్ టీమ్ మాత్రమే ఉంది. ఈ టీమ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యాక్టివేర్ సౌలభ్యానికి సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడం. ఉదాహరణకు చెన్నైలోని ఒక మహిళ గురించి. వేడి వాతావరణంలో ఆమెకు లెగ్గింగ్స్ ధరించడం కష్టమయ్యేది. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని వేడివాతావరణంలో కూడా సౌకర్యంగా ఉండే లెగ్గింగ్స్‌ను డిజైన్ చేశాం’ అంటుంది మార్గరెట్.దేశంలో తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్చెరకు, బయోప్లాస్టిక్కు సంబంధించిన ఆపరేషన్లలో యువ మార్గదర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అవంతిక సరౌగి. కాలిఫోర్నియాలో చదువుకున్న అవంతిక తమ బల్రామ్పూర్ చినీ మిల్స్ లిమిటెడ్ (బీసిఎంఎల్)ను పీఎల్ఏ (పాలీలాక్టిక్ యాసిడ్) తయారీ సౌకర్యాన్ని అందించే కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉంది. ఇది మన దేశంలోని మొట్ట మొదటి బయోప్లాస్టిక్ ప్లాంట్ కానుంది. పీఎల్ఏ అనేది చెరకు పునరుత్పాదక వనరుల నుండి తయారైన బయో ఆధారిత, కంపోస్టబుల్, తక్కువ ఉద్గారాల ప్లాస్టిక్. దీనిని సాధారణంగా ΄్యాకేజింగ్, త్రీడి ప్రింటింగ్‌లో ఉపయోగిస్తారు. మన దేశంలోని ఈ తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్ వల్ల బీసిఎంఎల్ లాభాల బాటలో పయనించనుంది. టర్నోవర్ పెరగనుంది. పర్యావరణ అనుకూలంగా కూడా మారనుంది.తరగతి గదినిమార్చేలావినూత్నమైన ఆలోచన విధానంతో విద్యా, సాంకేతిక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ పరిత పరేఖ్. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకుంది. బ్రౌన్ తరువాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్’పై మాస్టర్స్ చేసింది. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకునే రోజుల్లో పిల్లల విద్యావిధానం మీద దృష్టి పెట్టేది. స్టాన్‌ఫోర్డ్‌లో చేసిన పరిశోధనలు, నేర్చుకున్న ఆధునిక సాంకేతిక విషయాలు ఆమెను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు నడిపించాయి.కట్టింగ్–ఎడ్జ్ ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘టొడెల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించింది పరిత. మూస బోధన పద్ధతులకు అతీతంగా ఆధునిక బోధన పద్ధతులు, ఆలోచనలతో ‘టొడెల్’ ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేసింది. ‘టొడెల్’ ప్రభావంతో చాలా బడులలో ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే సంప్రదాయ, ఆధునిక విద్యాబోధనలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ‘టొడెల్’ కృషి చేస్తోంది. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెం పొందించే ప్రణాళికలతో ‘టొడెల్’ విద్యాప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది.చిన్న గదిలో మొదలై...కోట్ల టర్నోవర్ వరకుబెంగళూరులోని చిన్న గదిలో మొదలైన ‘యానిమల్’ రూ.550 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ స్థాయికి చేరింది. ఐఐటీ–దిల్లీలో చదువుకున్న కీర్తి జాంగ్ర, నీతూ యాదవ్‌ల బ్రెయిన్ చైల్డ్ ‘యానిమల్’. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవ్యవస్థీకృతంగా ఉన్న మన దేశంలోని పశువుల మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.పశువుల క్రయవిక్రయాలలో ‘యానిమల్’ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. తమ స్టార్టప్‌ను ప్రారంభించడానికి ముందు సర్వే నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు కీర్తి, నీతూ యాదవ్. డైరీ ఇండస్ట్రీలో కీలకమైన మార్పు తేవాలనుకున్న కీర్తి, నీతూ యాదవ్‌లు ‘యానిమల్’ యాప్‌తో తమ కలను నిజం చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మనం ఉన్న చోటు నుంచే వందల కిలోమీటర్ల దూరంలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్న ప్రదేశం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. -
Ridhi Khosla Jalan: మన జీవితానికి మనమే డిజైనర్లం..
సొంతంగా ఇంటి అలంకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లల కోసం కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన రిధి ఖోస్లా జలాన్ని ఈ రోజు ఉన్నతంగా నిలబెట్టింది. హోమ్ డెకార్‌లో డిజైన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన రిధి పిల్లల కోసం లిటిల్ నెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైన్ స్టోర్‌తో మార్కెట్లో ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని ఫిక్కీ వైఎఫ్‌ఎల్‌ఓ ఏర్పాటు చేసిన సెషన్లో పాల్గొన్న ఈ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందో వివరించింది. ‘మనలో ఉన్న అభిరుచి ఏంటో తెలుసుకుని, దానిని అమలులో పెడితే విజయం మన వెన్నంటే ఉంటుంది’ అంటుందామె. స్ఫూర్తివంతమైన ఆమె మాటలు... సాధారణ గృహిణిగా ఉన్న రిధి తన జీవితాన్ని ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి మలుపులు తిప్పిందో వివరించింది. ఇంటీరియర్ డిజైనర్ నుండి కిడ్స్ ఫర్నీచర్ స్టోర్ యజమాని వరకు రిధి పేరొందింది. ‘‘ఫైనాన్స్, మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాక పెళ్లవడంతో ముంబై వెళ్లిపోయాను. మొదటి బిడ్డ పుట్టాక నాలో తన కోసం ప్రత్యేకమైన డిజైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతేకాదు పిల్లల బట్టలు, వారికి కావల్సిన వస్తువుల విషయంలోనూ ఆలోచన పెరిగింది. అప్పుడే ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకున్నా. రెండవసారి ప్రెగ్నెంట్ అయిన టైమ్‌లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాను. అలా ఆ అభిరుచే వృత్తిగా మారింది. నా లైఫ్‌లో ఇదొక స్పెషల్ జర్నీ అని చెప్పవచ్చు. పిల్లల గదులను డిజైన్ చేయడం అనే నా హాబీ నన్ను చాలామందికి చేరువ చేసింది. మొదట ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించాను. ఫర్నీచర్, డెకార్ వస్తువుల కోసం ఎక్కడ షాపింగ్ చేయాలనే దానిపై స్నేహితులు తరచూ సలహాలు అడుగుతుండేవారు. వ్యక్తిగతంగానూ, నా స్నేహితులు పడుతున్న కష్టాన్ని గమనించినప్పుడు నా డిజైనింగ్‌లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందో స్వయంగా తెలుసుకున్నాను. స్నేహితులకు సూచనలు ఇచ్చే క్రమంలో నాకూ చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. కిడ్స్ డెకార్ బ్రాండ్‌ను ప్రారంభించడానికి ముందు మార్కెట్ పోకడలను గమనించాను. అప్పుడు ‘లిటిల్ నెస్ట్’ పేరుతో స్టోర్ ప్రారంభించాను. ఈ క్రియేటివ్ డిజైన్ నన్ను చాలా మందికి చేరువ చేసింది. ముందు కుటుంబమే నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, చేస్తున్న వర్క్ప్రోగ్రెస్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఒక ప్రశ్న– సమాధానంతో సోషల్ మీడియా వీడియోను ప్రారంభించాను. ఏడాది లోపు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లకు చేరువయ్యాను. ప్రజలు కోరుకునే సమాచారాన్ని అందించడంపై పెట్టే దృష్టి నన్ను ఇంతమందికి చేరువ చేసింది. అయితే, ఇల్లే నా మొదటి ప్రాధాన్యత. ఇంటిని మేనేజ్ చేయగలగితే చాలు, బయట అన్ని పనులను సులువుగా చక్కబెట్టవచ్చు. ఇందుకు నా పిల్లల సాయం కూడా ఉంటుంది. నా బిజీ వర్క్, ప్లానింగ్ చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు కూడా వారి పనులు వారు చేసుకుంటారు. నా వర్క్ వల్ల సోషల్‌గా అందరితోనూ అంతగా కలిసే సమయం ఉండదు. మొదట్లో అన్నీ బ్యాలెన్స్ చేయగలిగాను. కానీ, డెకార్ వర్క్, కంటెంట్ క్రియేటివ్‌కు ఎక్కువ టైమ్ పడుతుంది. ఇదొక డైనమిక్ జర్నీ అవడంతో నా ముందున్న మార్పులను కూడా ఉత్సాహంగా చేసుకుంటూ వెళుతున్నాను. గ్లోబల్ డిజైన్ మ్యాప్‌లో మన దేశం నుంచి నేను ఉండాలన్నది నా కల. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమందికి చేరవయ్యాను. ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. రెండు వారాలకు ఒకసారి.. ఎంత పని ఉన్నా రెండు వారాలకు ఒకరోజు పూర్తి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం నేను అన్నట్టుగా ఉంటాను. ఆ రోజులో ఎక్కువ సమయం బుక్స్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాను. రోజువారీ పనితో ఏ మాత్రం సంబంధం లేని పనులను చేస్తాను. దీంతో మరింత ఉత్సాహంగా మారిపోతాను’’ అని తన విజయానికి వేసుకున్న బాటలను ఇలా మన ముందు ఉంచారు రిధి. అప్డేట్గా ఉంటాను.. ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మెయింటెయిన్ చేయాలంటే ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. ప్రతిరోజూ నాలుగు పేజీల షెడ్యూల్‌ని వేసుకుంటాను. ఇల్లు, వర్క్‌స్పేస్, అప్డేట్స్, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి ప్రోత్సాహాన్ని కలిగించే కోట్స్ నోట్ చేసుకుంటాను. దీని వల్ల ప్రతిదీ ఏ రోజు కా రోజు ప్లానింగ్‌గా జరిగిపోతుంటుంది. భవిష్యత్తు గురించి అంటే మరో ఐదేళ్లలో నా ప్రాజెక్ట్స్ గ్లోబల్ లెవల్‌కి వెళ్లాలి. ప్రపంచంలోని అత్యుత్తమ డిజైన్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఉండాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
అధిరోహణ: బుక్ షెల్ఫ్ నుంచి భవనం దాకా!
శిఖరాలను అధిరోహించాలంటే పర్వతాల దగ్గరకే చేరుకోనక్కర్లేదు. ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడం కూడా అధిరోహణే. ప్రతి అధిరోహణలోనూ సవాళ్లు ఉంటాయి. సానుకూలంగా గమనిస్తూ అధిగమిస్తేనే దారి సుగమమం అవుతుంది. ఢిల్లీలో ఉంటున్న 30 ఏళ్ల భవ్నా ఖన్నా పురుషుల ప్రపంచమైన భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకుంటోంది. తనే శిఖరమంతగా ఎదిగి మరికొందరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఆర్కిటెక్చర్ రంగం దాదాపు పురుషులదే అయి ఉంటుంది. అలాంటి రంగంలో మూడు వేల రూపాయల నుంచి వర్క్ మొదలుపెట్టిన భవ్నా ఖన్నా నేడు మూడు కోట్ల ప్రాజెక్ట్‌లను కూడా అందిపుచ్చుకుంటోంది. ఢిల్లీవాసి అయిన భవ్నా పెద్ద పెద్ద భవనాలను, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, రిసార్ట్స్నూ డిజైన్ చేస్తోంది. 30 ఏళ్ల భవ్నా భవన నిర్మాణ రంగంలో ఎదుగుతున్న తీరు, సమస్యలను అధిగమిస్తున్న విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం. ‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్తైన భవనాలను చూసి, ఎంతో ఇష్టపడేదాన్ని. కొన్నాళ్లకు నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నా 13వ పుట్టిన రోజున బిల్డింగ్ గేమ్ కానుకగా ఇచ్చారు. ఆ గేమ్‌లో బ్లాకులను కలుపుతూ ఏదైనా భవనాన్ని కట్టచ్చు. ఆ ఆటలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. కట్టిన వాటిని పడేస్తూ, తిరిగి కడుతూ చాలా సమయం గడిపేసేదాన్ని. పన్నెండవ తరగతి తర్వాత, ఐదేళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్సు చేశాను. ఏడాది పాటు ఉద్యోగం చేశాను. తర్వాత ఉద్యోగంలో నాకోసం నేనేదీ చేయలేనని అర్థం చేసుకున్నాను. నా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. ఎవరి సూచనలతోనో పనిచేయలేకపోయాను. నాకు నా సొంత ఆలోచనలు ఉన్నాయి. భవనం లేదా ఫామ్ హౌజ్ లేదా కోట దేనిని నిర్మించాలన్నా ముందగా నా ఆలోచనలను కాగితంమీద పెట్టేదాన్ని. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ.. భవనాన్ని నిర్మించాలంటే ఒక్కో ఇటుకను పేర్చాలి. అలాగే, సిమెంట్, స్టీల్, స్టోన్.. ప్రతీ పనిలో నైపుణ్యం చూపాలి. అందుకు తగిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నా నైపుణ్యాలు నాకు అర్థమయిన తర్వాత నా ఉద్యోగం వదిలి, ఆపై నా పనిని ప్రారంభించాను. స్టూడియో ఆస్ట్రిడ్ ఇండియా పేరుతో కంపెనీని ప్రారంభించాను. ఈ రంగంలో నాకు గాడ్‌ఫాదర్ లేకపోవడంతో నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం సవాళ్లతో కూడుకున్నది. ప్రతీ పని స్వయంగా తెలుసుకుంటూ చేయాలి. ముందు ఎవ్వరూ టీమ్‌గా చేరలేదు. నెమ్మదిగా కలిశారు. చిన్న పుస్తకాల షెల్ఫ్‌తో మొదలు.. కొన్ని రోజుల వరకు నా కంపెనీ పనిలో నేనున్నాను. 2016లో ఒకరోజు త్రీ బై త్రీ బుక్ షెల్ఫ్ చేసివ్వమని ఒక ఆర్డర్ వచ్చింది. మూడు వేల రూపాయలతో వచ్చిన చిన్న ప్రాజెక్ట్ అది. నా కలలు పెద్దవే. కానీ, మొదటి ప్రాజెక్ట్, అందుకే కష్టపడ్డాను. ఆ చిన్న బుక్ షెల్ఫ్ నుంచి ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, రిసార్టులు డిజైన్ చేస్తున్నాను. 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎల్తైన భవనాలు, మెరిసే అద్దాల గోడలు నా కళ్లలో కలల ఇంటిని కట్టుకునేవి. చిన్నతనంలో నా అరచేతిలో రూపుదిద్దుకున్న చిట్టి చిట్టి భవనాలపైనే నాకు అంత ఆకర్షణ ఉందని అప్పట్లో తెలియదు. పెద్దయ్యాక ఆ కలే నన్ను ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ప్రోత్సాహమిచ్చింది. క్లయింట్ అవసరాలు వినడం నుంచి అమలు చేయడం వరకు అన్ని పనులు స్వయంగా చూస్తుంటాను. సవాళ్లను ఎదుర్కొంటేనే సరైన దారి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నాలో మార్పు స్పష్టంగా చూశాను. నామీద నాకు చాలా నమ్మకం వచ్చింది. అనుభవం పెరిగింది. ఎక్స్పోజర్ పెరిగింది. ఆరు సంవత్సరాలలో నైపుణ్యం కలిగిన క్రియేటివ్ డైరెక్టర్‌గా నన్ను నేను చూసుకుంటున్నాను. ఆడపిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు చేసే రోజులు పోయాయి అని నన్ను నేను చూసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించింది. నా స్నేహితుల జాబితాలో కూడా నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడే అమ్మాయిలు ఇప్పుడు మంచి వక్తలుగా మారారు. శిల్పకళ లేదా వ్యాపార రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు పదే పదే చెప్పే మాట ‘ప్రతి రంగానికి దానికి తగిన సవాళ్లు ఉంటాయి. వాటిని వదులుకోవద్దు. మార్గం ధైర్యంతోనే వేయబడుతుంది. మీరు వృద్ధిలోకి వస్తున్నప్పుడు మరికొన్ని మార్గాలను కనుక్కుంటారు’ అని వివరిస్తారు భవ్నా ఖన్నా. ఈ ఆరేళ్లలో స్పార్క్ ఎక్సలెన్స్ అవార్డు, యువ పారిశ్రామికవేత్త బిరుదును అందుకున్న భవ్నాఖన్నా గురించి ప్రముఖ జాతీయ మ్యాగజైన్లు కవర్‌పేజీ కథనాలతో ఆమె ఘనతను చాటాయి. విజయం ఒక్కరోజులోనే అందకపోవచ్చు. ప్రతీరోజు ప్రయత్నంతోనే మొదలవ్వాలి. ప్రతీ ప్రయత్నం విజయంవైపుగా కృషి చేయాలి. సవాళ్లను స్థైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ ఆర్కిటెక్చర్ జీవనం ఎంతోమందికి ప్రేరణనిస్తోంది. -
యువ పారిశ్రామికులకు ఎస్బీహెచ్ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న స్థాయి యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలను మంజూరు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ముందుకొచ్చింది. ఇందుకోసం భారతీయ యువశక్తి ట్రస్ట్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఎస్బీహెచ్-బీవైఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పోగ్రామ్’ పేరుతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం జూలై1 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఎస్బీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమోదయెగ్యమైన వ్యాపార ప్రణాళిక ఉన్న 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు, అంగవైకల్యం కలిగినవారికి, గ్రామీణ పట్టణ యువతకు రూ. 50 లక్షల వరకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా రుణాలను అందిస్తారు.


