
మన పురాతన తాటాకు శాసనాల గ్రంథాల్లో అన్నీ ఉన్నాయో లేవోగానీ... మన సినిమాల్లో మాత్రం సకల విజ్ఞాన శాస్త్రాలూ ఉన్నాయి. అందుకు నిదర్శనమే మనదైన పానిండియన్ సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘రోబో’!
ఏ అద్భుత ముహూర్తాన మన డైరెక్టర్ శంకర్ ‘రోబో’ తీశాడోగానీ... లోకమంతటా అవే వింతలు అచ్చం అలాగే జరుగుతున్నాయి. ఉదాహరణకు... ఇక్కడి మన సినిమాలో హ్యూమనాయిడ్ రోబో కాస్తా మానవ మానస వికాసాలూ, వికారాలూ ఒంటబట్టించుకుని ‘రోబో సేపియన్’ అవుతాడా! అలా అవ్వగానే ఆ ‘టాయ్’ఫ్రెండు కాస్తా హీరోయిన్‌కి ‘బాయ్’ఫ్రెండుగా మారి... అచ్చం మన మానవ కుర్రాళ్లలాగే... తనను ప్రేమించని అమ్మాయి మీద యాసిడ్లూ గట్రా విసిరేంత క్రూరమైన ‘సెల్ఫ్‌స్టైల్‌డ్ లవర్‌బా(టా)య్’గా మారిపోతాడు కదా.
అక్కడ అమెరికాలోని ఒహాయో రాష్ట్ర చట్టనిపుణులు బహుశా ‘రోబో’ సినిమా చూసి హడలిపోయి ఉంటారేమో... మానవ మేధకూ, కృత్రిమ మేధస్సుకూ మధ్య వివాహాలు వద్దంటే వద్దంటూ గొడవ గొడవ చేస్తున్నారు. అంతేనా... ఆ మేరకు ఓ చట్టం తీసుకు వచ్చేందుకు బిల్లు కూడా ప్రిపేర్ చేశారు.
అదే డైరెక్టర్ శంకర్‌గారి ఆయొక్క అదే ‘రోబో’ సినిమాలో... ‘‘ఇనుములో ఓ హృదయం మొలిచెలే పాటనుంచి స్ఫూర్తి పొందినట్టుగా... ఇప్పటికే మన పొరుగు దుండగీడైన చైనావాడు ‘దివిరి ఇసుకన తైలంబు’ రీతిగా దివిరి ఇనుమున గర్భసంచి నుంచి చిన్నారి పాపలను రేపీపాటికి తీసిస్తానంటూ తొడలుగొడుతూ, హడలగొడుతున్నారన్న సంగతి తెలిసిందే. అంతే కాదు... రోబోలకు సీమంతాలవీ గట్రా చేసేసి కృత్రిమ ‘ఊంబ్’ల లోంచి ఉంగా ఉంగా పాపాయిలను పుట్టిస్తానంటూ సవాళ్లు విసురు తున్నారు కూడా.
అమిత వింతలకు నెలవైన అమెరికాలో... ఈ చిత్రవిచిత్రాలన్నీ చూస్తున్న ఒహాయో రాష్ట్రపు మేధావులు భయపడి పోతున్నారేమో...ఆఆందోళనతో స్థిమితంగా ఉండలేక... బహ్మాండమైన ఓ వివాహ నిషేధ చట్టాన్ని తెచ్చేందుకు నిశ్చయించు కున్నారు. ఆ మేరకు బిక్కు బిక్కుమంటూ బిల్లొకదాన్ని అక్కడి చట్టసభల్లో ప్రవేశపెట్టబోతున్నారు కూడా! దీనికి కారణ మేంటంటే... అక్కడి కుర్రకారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పెళ్లిళ్లు చేసుకునేందుకు తెగ ఉత్సాహపడిపోతున్నారట!
హాయ్యో...! ఇప్పటికే అతి మేధావులైన మానవులూ, అమితమైన మేధస్సుల ‘కృత్రిమ మేధ’ మధ్య పెళ్లిళ్లు జరిగితే... రేపు సదరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కాస్తా పవరాఫ్ ఆటార్నీలంటూ పవర్‌పట్టా తీసుకోవడం, పార్ట్‌నర్‌తో చెట్టాపట్టాలే కాకుండా, లీగల్ వ్యవహారాల్లోకి దూరి, అసలు నిపుణులు తట్టాబుట్టా సర్దుకునేలా, చెట్టూపుట్టా పట్టుకు పోయేలా, బెదిరీ చెదిరీ΄ోయేలా చేస్తాయేమోనని హడలెత్తుతున్నారు ‘ఓహాయో రాష్ట్ర’పు చట్ట నిపుణులు.
అందుకే... మనుషులకూ, యంత్రాలకు మధ్య పెళ్లిమంత్రాలు వద్దంటే వద్దంటూ పట్టు పడుతున్నారు. మానవులూ, యాంత్రాల మధ్య మనువులు వద్దంటూ వాదిస్తున్నారు. ఇది ‘యంత్రమాత్రమూ’ తగదంటూ బల్లగుద్ది మరీ శాసిస్తున్నారు మన ఒహాయో స్టేట్ రిప్రజెంటేటివూ, రిపబ్లికన్ మెంబరూ అయిన మిస్టర్ ‘థాయిడస్ క్లాగెట్’ గారు!
అలనాడెప్పుడో బ్రహ్మంగారు చెప్పిన వింతలన్నీ అక్కడా ఇక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీ నేపథ్యంలో ఈ పుట్టు తెలివితేటలున్న మన మానవాళీ... పెట్టు తెలివితేటలున్న రోబోయంత్రాళీ...కలగలసి సంకరమైతే... రేపు భవిష్యత్తులో సకల‘అతి’తెలివితేటలున్న బుజ్జిబుజ్జి రోబో–కంగాళీలకు ఆస్కారముంటుందేమోనని అనుమానిస్తున్నారు.
అచ్చం రోబో సినిమాలోలాగే... రేపెప్పుడైనా పొరబాటున ఆ ‘చిట్టి’ చిట్టి రోబోలకు విలనీయులైన ఏ అడ్డమైన సైంటిస్టులో ‘రెడ్డు చిప్పు’ పెడితే... అప్పుడది మన మానవాళి చేతికి ‘డేంజరు చిప్పే’ననేమోనంటూ ఇన్నిరకాల ఆంక్షలూ, హాహాకారాలంటూ లోకంలోని ప్రజలంతా తెగ చెవులు కొరుక్కుంటున్నారన్నది అభిజ్ఞ వర్గాల అతి రహస్య భోగట్టా.
ఇదీ చదవండి: ధన త్రయోదశి ఆరోగ్యమస్తు ధన ప్రాప్తిరస్తు.. ప్రాశస్త్యం ఇదీ!
ఏఐ మ్యారేజ్ ప్రపోజల్
ప్రేమలేఖల నుంచి ఎస్‌ఎంఎస్‌ల వరకు లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ పలు రకాలు. తాజా విషయానికి వస్తే...ఒక కుర్రాడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉపయోగించి ఫేక్ డిస్నీ–స్టైల్ ట్రైలర్ ద్వారా తన స్నేహితురాలికి మ్యారేజ్ ప్ర΄ోజ్ చేశాడు. ఈ వీడియోకు 11 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీషేర్ చేస్తున్నారు. ‘ది ఈజీయెస్ట్ యస్. యస్, ప్ర΄ోజ్‌డ్ టు జె... యూజింగ్ ఏఐ’ అని వీడియోకు కాప్షన్ ఇచ్చారు. వీడియో చివరలో ‘విల్ యూ మ్యారీ మీ’ అనే కామెంట్ కనిపిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ‘యస్’ చెప్పిందా? యస్! ‘ది మోస్ట్ బ్యూటీఫుల్ మ్యారేజ్ ప్రపోజల్’ అంటూ స్పందించారు నెటిజనులు.
– యాసీన్