
నయా ట్రెండ్‌గా నానో బనానా ఏఐ పోటోల సందడి మాములుగా లేదు. ఈ ట్రెండ్ చీరల దగ్గర నుంచి నవరాత్రుల సెలబ్రేషన్స్ వరకు పాకేసింది. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఓ అద్భుతాన్ని సృష్టిస్తున్నా.. మన గోప్యతకు ముప్ప తప్పదనేది గ్రహించాలి. నిజానికి ఇది ఎంతవరకు ఉపయోగించడం మంచిదనేది సవివరంగా తెలుసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. మన వ్యక్తిగత ఫోటోలను నచ్చిన విధంగా ఈ సరికొత్త ట్రెండ్ సాయంతో చూసుకోవడం అనేది వావ్..! అనిపిస్తున్నా..కొంత ప్రమాదం కూడా లేకపోలేదన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే..
మన ఫోటోలను ఏఐ ఫ్లాట్‌ఫామ్‌కి అప్పగించడం వల్ల గోప్యత నుంచి సామాజిక హాని వరకు చాలా గణనీయమైన ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ హవా నడుస్తుందని మీ వ్యక్తిగత ఫోటోలను అప్పగించే ముందు ఎదురయ్యే ప్రమాదాలను గురించి కూలంకషంగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటంటే..
AI జనరేటర్‌లకు ఫోటోలను ఫీడ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు..
డీప్‌ఫేక్ క్రియేషన్:
ఏఐ మీ ఫోటోలను ఉపయోగించి నమ్మదగిన డీప్‌ఫేక్‌లను సృష్టించగలదు. ఫలితంగా మీ గుర్తింపుకు, ప్రతిష్టకు నష్టం, పైగా వేధింపులు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా నానో బనానా ఏఐ జెనరేటెడ్ చిత్రాల వల్ల ఇది మరింత ఎక్కువ.
ఫోటోలపై నియంత్రణ కోల్పోవడం
ఒక్కసారి ఏఐ జనరేటర్లకు ఫోటోలను అప్‌లోడ్ చేసినట్లయితే. .అవి ఎలా ఉపయోగించుకుంటున్నారనేది తెలియదు. పైగా ఆ చిత్రాల సాయంతో లొకేషన్ డేటా, వ్యక్తిగత వివరాలు సామాజిక కనెక్షన్‌లతో సహా సమాచారాన్ని గ్రహించేస్తాయి. అదీగాక డిజిటలైజ్ చేసిన మీ చిత్రం అనంతంగా లేదా మీ అనుమతి లేకుండానే మారిపోవచ్చు. ఇది ఒకరకంగా హింసాత్మక, లేదా తప్పుదారి పట్టించే అవకాశం కూడా లేకపోలేదని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇమేజ్ ప్రామాణికత క్షీణించటం: ఇమేజ్ ప్రామాణికత నష్టపోతుంది. ఎందుకంటే నకిలీ ఫోటోల మధ్య ఏది అసలైనది అనేది గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా జర్నలిజం, ప్రకటనలకు సంబంధించిన దృశ్య కంటెంట్‌లపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.
అనుమతి లేకుండానే వాణిజ్య వినియోగం: AI ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలను అనుమతి లేకుండానే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
గోప్యతకు భంగం, డేటా దుర్వినియోగం: ఏఐలో అప్‌లోడ్ అయిన ఫోటోలు బయోమెట్రిక్ డేటాకు యాక్సెస్ అయ్యి మీ గుర్తింపుకు అంతరాయం ఏర్పడవచ్చు. అంతేగాదు కొన్ని కంపెనీలు ఈ ఫోటోలను ఇతరత్రగా షేర్ చేయడం లేదా విక్రయించే అవకాశం లేకపోలేదు.
వివక్షత, పక్షపాత ధోరణి: తరచుగా కొన్ని సమూహాలు స్టీరియో టైపిక్ మైండ్‌తో.. మీ ఫోటోని లోపభూయిష్ట నమునాలుగా ఫీడ్ చేసి వివక్షతకు ఆజ్యం పోయడమే గాక జాతిపరమైన ప్రొఫైలింగ్ లేదా సవరణలతో అందం ప్రమాణాలను వక్రీకరించే సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..!)