పెద్దాయన్ని చూశారా? చైనాకు చెందిన ఈయన వయసు 75 ఏళ్లు. ఈ ముదిమి వయసులో తన భార్యను విడాకులు ఇస్తావా లేదా అని పదేపదే ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటారా? ప్రేమలో పడ్డాడు మరి. ఈ వయసులో ఎవరితోనబ్బా అంటే.. ఏఐ జనరేటెడ్ ఆన్‌లైన్ మోడల్‌తో. జియాంగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏఐ మహిళా అవతార్‌ను చూశాడు. యువతకైతే అది ఏఐ సృష్టి అని తెలిసిపోతుంది.
కానీ ఈయనకు ఆ విషయం తెలియక అమ్మాయి అని భ్రమపడ్డాడు. పైగా ఆమె అందమైన రూపానికి తోడు ఆకట్టుకునే గాత్రం, సంభాషణలు చూసి మరీ ఫిదా అయిపోయాడు. రోజూ గంటల తరబడి ఫోన్లోనే కాలం గడపడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన జియాంగ్ భార్య.. గట్టిగా తిట్టడంతో భార్యతో విడిపోతే ఆమెతో కాలం గడపొచ్చని విడాకులు అడగడం మొదలుపెట్టాడు. చివరకు జియాంగ్ పిల్లలు అది ఏఐ సృష్టి అని.. నిజమైన మనిషి కాదని చెప్పి ఒప్పించేసరికి వారి తల ప్రాణం తోకకొచి్చంది. ఏం ఏఐనో ఏంటో.. ముందుముందు ఏమేం చిత్రవిచిత్రాలు చూడాలో అనిపిస్తోంది కదా?


