ఏఐ వ్యూహాన్ని మార్చుకుంటున్న సేల్స్ ఫోర్స్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.
నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్‌లు
‘ఒక సంవత్సరం క్రితం ఎల్‌ఎల్‌ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్‌నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్‌లో మరింత నియంత్రిత ఆటోమేషన్‌ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.
సాంకేతిక వైఫల్యాలే కారణమా?
ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్‌కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..
ఎక్కువ సూచనలు ఉంటే ఎల్‌ఎల్‌ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.
వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.
25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
డేటా ఫౌండేషన్లపై దృష్టి
ఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!


