
దీపావళి పండుగంటే టపాసులు ఖర్చు కాదు.. ఈ వెరైటీ స్వీట్స్ కూడా అంతే ఖరీదు. నిజానికి లక్ష్మీ దేవి పండుగ అయినా ఈ దీపావళి రోజున బంగారం, వెండి కొంటుంటారు కొందరు. కానీ ఆ బంగారాన్నే ఆస్వాదించేలా తయరు చేస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్స్ స్టాల్. వీటిని బంగారం, వెండిపూతతో ఆస్వాదించేలా తయారు చేస్తున్నారు. ఈ తియ్యటి మిఠాయిల ఖరీదు ఎంతో తెలిస్తే గుండెల్లో టపాసులు పేలినంతం పనవ్వుతుంది. వామ్మో..! ఇంత ఖరీదా అనిపిస్తుంది. మరి ఆ కథాకమీషు ఏంటో చూసేద్దామా..!.
త్యోహార్ జైపూర్ స్వీట్స్ స్టాల్ ఈ ఖరీదైన స్వీట్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సీజన్‌లో ఈ స్వీట్స్ మహా ఫేమస్. బంగారు ఆభరణాలను ధరించడమే కాదు నోటిలో కరిగిపోయేలా కూడా ఆస్వాదించొచ్చు అనేలా అందిస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్ షాప్. అంజలి జైన్ అనే మహిళ ఈ వెరైటీ స్వీట్లకు శ్రీకారం చుట్టింది.
ఈ గోల్డ్ స్వీట్స్ సిరీస్‌లో అత్యంత ఖరీదైన స్వీట్ స్వర్ణ ప్రసాదంగా పిలిచే మిఠాయి. దీని ధర కిలోగ్రాముకు రూ. 1,11,000 పలుకుతుంది. చదరపు ఆకారంలో ఉండే ఈ స్వీట్ తినాలంటే అంత ఖర్చు చేయక తప్పదు. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం, రాయల్టీని అందించే స్వీట్స్ ఇవి. ఆయుర్వేదంలో స్వర్ణ భస్మం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలది అని చెబుతుంటారు. ఆ నేపథ్యంలోనే ఇలా స్వీట్స్ తయారీలో లోహాలను వినియోగిస్తున్నట్లు చెబుతోంది ఈ స్వీట్స్ సృష్టికర్త అంజలి. వీటిని ప్యాక్ చేసే బాక్స్‌లు సైతం అత్యంత విలక్షణంగా బంగారుపెట్టెలను తలపించేలా ఉండటం విశేషం.
ఎవరీమె అంటే..
చార్టర్డ్ అకౌంటెంట్(CA)గా తన కెరీర్‌ను ప్రారంభించి.. అనుకోకుండా పాకశాస్త్రంలోకి అడుగుప్పెట్టి తన క్రియేటివిటీకి పదును పెట్టింది. అలా తన రుచికరమైన వంటకాలతో ప్రంపంచాన్ని జయించాలని మహమ్మారి సమయంలో ఈ రంగంలోకి అడుగు పెట్టింది. తన సీఏ నేపథ్యం ఈ స్వీట్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిందని అంటోంది.
ఇక తన ఉత్పత్తులన్నింటికి ప్రామాణికత ఉందని, సాధారణ వంటకాలకు తన సృజనాత్మకతను జోడించి విలక్షణంగా పరిచయం చేయడమే తన విజయ రహస్యమని చెబుతోంది. సంప్రదాయ వంటకాలకు ఆధునికతను జోడించి సక్సెస్‌ని అందుకున్నాని చెబుతోంది.
ఈ స్వీట్స్‌లోని కొన్నింటి ఖరీదు..
చాంది భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,150
స్వర్ణ్ భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,950/ కిలోకు రూ. 85,000
24 క్యారెట్ కాజు కట్లి - కిలోకు రూ. 3,500
24 క్యారెట్ పిస్తా లోంజే - కిలోకు రూ. 7,000
24 క్యారెట్ లడ్డూ - కిలోకు రూ. 2,500
(చదవండి: ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..)