
నోరూరించే వివిధ రకాల వంటకాలకు నగరం వేదికైంది.. పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పలువురు చెఫ్‌లు వివిధ ప్రాంతాల వంటకాలతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలోని సనత్‌నగర్‌లో అగ్రోమెచ్ స్టూడియో తెలంగాణ, ఆంధ్ర చెఫ్‌ల వంటకాలకు గురువారం వేదికైంది. అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమం చెఫ్‌ల ఐక్యత, వారసత్వ కళ, పాకశాస్త్రానికి వేదికగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన చెఫ్‌లు కేవలం వేడుక జరుపుకోవడానికి మాత్రమే కాకుండా, ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి, మెరుగైన భవిష్యత్తుకు తమ అనుభవాలను పంచుకున్నారు. పాకశాస్త్రంలో పేరెన్నికగన్న చెఫ్స్ కాశీ విశ్వనాథన్, శేఖర్, సంజయ్ తుమ్మ, సుధాకర్ ఎన్.రావు, మిస్టర్ పాల్గుణి నాయుడు, సుధా కుమార్, మిస్టర్ అన్మోల్ ప్రభు, మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రవీందర్ రెడ్డి వంటి ప్రఖ్యాత చెఫ్‌లు, ముఖ్య అతిథులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరంతా పాక శాస్త్రం, ఆరోగ్యం, ఆవిష్కరణల పరిణామంపై ప్రభావవంతమైన సూచనలను అందించారు. ఆహారం అంటే పోషకాహారం మాత్రమే కాదు, సంరక్షణ, సృజనాత్మకత, స్థానిక భాష.. అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెషనల్ చెఫ్‌లతో పోటీ పడుతూ తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అనుభవజ్ఞులైన చెఫ్‌ల నేతృత్వంలోని ఇంటరాక్టివ్ షేరింగ్ సెషన్స్, మనదైన వారసత్వ వంటకాలను పంచుకున్నారు.
బెస్ట్ వంటకాల ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. చెఫ్‌ల మధ్య సోదరభావాన్ని ఏర్పరిచింది. ఈ సందర్భంగా సీఏటీఏ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి చెఫ్ యాదగిరి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు.. ఇది ఓ కుటుంబం, ఆహారానికీ జీవం పోసే ప్రతి కళాకారుడినీ వృద్ధిలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం’ అన్నారు. చెఫ్స్ ఐక్యత, సేవా సందేశంతో తెలంగాణ, ఆంధ్ర అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం– 2025 వేడుకను ముగింపుగా కాకుండా ఒక ప్రారంభ సూచికగా నిలిచింది..
(చదవండి: ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..)