
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి..
హైదరాబాద్‌తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి.
అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్‌సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి.
పూర్తి భిన్నంగా..
మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి.
పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది.
సర్వే చెబుతోన్నదేంటి!?
గతేడాది ప్రచురితమైన బీఎమ్‌సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది.
అవగాహన లేమి..
నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం..
పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్‌ఏఎన్‌యూయూ పరిశోధకులు వెల్లడించారు.
పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది.
వ్యక్తిగత భద్రత ముఖ్యం..
విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.!
అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
– డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్