జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్
‘చదువు మాత్రమే చదివితే చదువు రాదు. మీకు మంచి హాబీలు ఉండాలి’ అన్నారు గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ‘మీ ఓటమిని అంగీకరించండి. దానిని నోట్‌బుక్‌లో రాసుకోండి. తర్వాత ఏం చేయాలో మీకే తెలుస్తుంది’ అని పిల్లలకు చెప్పారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో తన తాజా పుస్తకం ‘లైటెనింగ్ కిడ్’ గురించి మాట్లాడుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎన్నో విలువైన సూచనలు చేశారు.
‘రష్యన్ గ్రాండ్‌మాస్టర్ కార్పొవ్ ఒకసారి నాతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. మా ప్రస్తావన ఒక గ్రాండ్‌మాస్టర్ గురించి వచ్చింది. అతను తరచూ ఓటమి పాలు అవుతున్నాడు. అప్పుడు కార్పొవ్ నాతో ఇలా అన్నారు– అతను ఎందుకు ఓడిపోతున్నాడో తెలుసా? కేవలం చెస్ తప్ప మరో ధ్యాసే లేనట్టుగా ఉన్నాడు అందుకని – అన్నారు. మనందరం బాగా చదువుకోవాల్సిందే. అయితే కేవలం 24 గంటలు చదువు మీదే ధ్యాస పెడితే చదువు రాదు. మీకు మంచి హాబీలు ఉండాలి.
హాబీకి నిర్వచనం ఏమిటి? ఏ ఆదాయమూ చేకూరక పోయినా మీరు చాలా ఇష్టంగా చేసే పనిని హాబీ అంటారు. మ్యూజిక్ వినడం హాబీ. దానికి ఎవరైనా డబ్బు ఇస్తారా? కాని మీరు ఇష్టంగా మ్యూజిక్ వింటే రిలాక్స్ అవుతారు. తర్వాత చేయాల్సిన పని మీద దృష్టి లగ్నం చేస్తారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు ఇష్టమైన హాబీ ఉండాలి’ అన్నారు ప్రపంచ చెస్ విజేత విశ్వనాథన్ ఆనంద్. జైపూర్‌లో భారీగా మొదలైన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ రెండో రోజున తన పుస్తకం ‘లైటనింగ్ కిడ్’ వెలువడిన సందర్భంగా క్రిక్కిరిసిన విద్యార్థుల మధ్య ఆయన మాట్లాడారు.
ఓటమిని ఎలా ఎదుర్కొనాలి?
‘ఓటమి ఎవరికీ నచ్చదు. గెలుపు మీద మన అంచనా కంటే వేరొకరు మన మీద అంచనా పెట్టుకుంటే, అప్పుడు ఓటమి వస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకు మనకు వెయ్యో ర్యాంకు వస్తుందని తెలుస్తుంటే ఎవరో వచ్చి ‘నీకు ఫస్టు ర్యాంకు వస్తుందిలే. ఇరగదీస్తావు’ అంటారు. మనకు రెండు వేల ర్యాంకు వస్తే మన అంచనా తప్పినందుకు బాధ కంటే వాళ్ల అంచనా తప్పినందుకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇలాంటివి మామూలు.
మీరు ఓటమి నుంచి పారిపోవద్దు. దానిని గుర్తించండి. ఎక్కడెక్కడ తప్పులు చేశారో ప్రశాంతంగా ఒక నోట్‌బుక్ మీద రాసుకోండి. మనసు ఎలాంటిదంటే తర్వాత ఎప్పుడో ఓటమిని ఎనలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు నచ్చిన వెర్షన్‌ను అంటే మీదేం తప్పులేదన్నట్టు చెబుతుంది. నోట్‌బుక్ తెరిచి చూస్తే అసలు వెర్షన్ ఉంటుంది. నేను నా తప్పులను నోట్‌బుక్‌లో రాసుకుని వాటిని మళ్లీ చేయకుండా ఉంటూ విజయాలు సాధించడానికి ప్రయత్నించాను’ అన్నారాయన.
మా అమ్మా నాన్నల వల్లే
‘మా అమ్మ నాకు చెస్ నేర్పించింది. నీ శక్తిసామర్థ్యాలను... నీ బలహీనతలను నీ శత్రువుకు తెలియనివ్వకు. నీ కోసం కొన్ని దాచుకో అనే విలువైన పాఠాన్ని ఆమె చెప్పింది. దానిని నేటికీ పాటిస్తున్నాను. ఆటలు కూడు పెట్టవు అనే రోజుల్లో మా అమ్మా నాన్నలు నేను చెస్ ఆడటాన్ని అంగీకరించారు. రేపు పరీక్ష అనగా ఇవాళ చెస్ టోర్నమెంట్‌కు పంపారు. మనం ఎంచుకున్న దారిని తల్లిదండ్రులు అంగీకరిస్తే పిల్లలకు ఇక టెన్షన్ ఉండదు. తల్లిదండ్రులు టెన్షన్‌గా ఉంటే మనం సక్సెస్ కాలేము.
మా అమ్మా నాన్నలు ఈ విషయంలో నన్ను ఎంతో సౌకర్యంగా ఉంచారు. తల్లిదండ్రులు పిల్లలకు పూర్తిగా దూరంగా ఉండకూడదు. అలాగే వారి జీవితాలను పూర్తిగా ఆక్రమించకూడదు. ఒక మర్యాద ఇస్తూ పిల్లల అభిరుచులను పరిశీలించి ప్రోత్సహించాలి’ అన్నారు విశ్వనాథన్ ఆనంద్.
వర్రీతో గేమ్ గెలుస్తామా?
‘హంగేరీలో ఒక టోర్నమెంట్‌కు హాజరు కావాల్సి ఉంటే వాతావరణంలో మార్పుల రీత్యా ఫ్లయిట్స్ కేన్సిల్ అయ్యాయి. నేను బస్సులో చాలా గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. ప్రాక్టీసుకు టైమ్ లేదు. అలా అని బస్సు జర్నీ అంతా నేను వర్రీ అవుతుంటే గేమ్ గెలుస్తానా? అందుకని గేమ్ సంగతి మర్చిపోయి జర్నీ ఎంజాయ్ చేశాను. ఆందోళన వల్ల ఫలితాలు రావు. వర్రీ పడొద్దు. ఒకటి చె΄్తాను. మీరు ఇవ్వదగ్గ బెస్ట్ కోసం ఎప్పుడూ ప్రయత్నించాలి. మీ స్థాయి 90 మార్కులు అయితే కనీసం 91 మార్కుల కోసం ప్రయత్నించాలి. అది చేయండి. చాలు’ అన్నారాయన.
మూడు రకాల తప్పులు
‘అందరం మూడు రకాల తప్పులు చేస్తాం. మొదటి రకం తప్పులు... ఇవి చేస్తే ఇక ఫినిష్ అయిపోతాం. రెండో రకం తప్పులు. వీటిని చేస్తే దిద్దుబాటు చేసుకోవచ్చు. మూడో రకం తప్పులు... ఇవి ఎవరైనా చేసేవి... పెద్ద లెక్కలోకి రావు. మనం మొదటి రకం తప్పులు... అంటే మన చదువును, జీవితాన్ని, కెరీర్‌ని ఫినిష్ చేసే తప్పులు ఎప్పుడూ చేయకూడదు’ అన్నారాయన.
– జైపూర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి


