అందరికీ అమ్మమ్మ | Sudha Murty On Jaipur Literature Festival 2026 | Sakshi
Sakshi News home page

అందరికీ అమ్మమ్మ

Jan 20 2026 5:57 AM | Updated on Jan 20 2026 5:57 AM

Sudha Murty On Jaipur Literature Festival 2026

జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌

‘‘నా ఫ్రెండ్‌కు ఫోన్‌ చేస్తే ‘ఇప్పుడు రాకు, సీరియల్‌ చూస్తున్నా’ అంది. అమ్మమ్మలు నానమ్మలు సీరియల్స్‌ చూస్తుంటే పిల్లలకు ఎవరు కథలు చెప్తారని పిల్లల కోసం
రాయడం మొదలుపెట్టాను. అలా దేశానికే ‘ఆచి’ (అమ్మమ్మ) అయ్యాను’’ అన్నారు సుధామూర్తి. 50 ఏళ్ల వయసులో రాయడం మొదలుపెట్టి తన 50వ పుస్తకం వెలువరించిన సందర్భంగ ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో వేలాది ప్రేక్షకులతో ఆమె మాట్లాడారు. తన మనవరాలిని దృష్టిలో పెట్టుకుని పిల్లలందరి కోసం కథలెలా రాస్తున్నారో వివరించారు.

‘మా కాలం అమ్మమ్మలు, నానమ్మల్లా ఇప్పటి అమ్మమ్మలు, నానమ్మలు లేరు. వాళ్లు సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. కుంకుమ్‌ తన అత్తగారిని మెప్పిస్తుందా లేదా అని వారి టెన్షన్‌. కుంకుమ్‌ ఒక పాత్ర అట. లేదంటే వాళ్లకు వాట్సప్‌ గ్రూపులున్నాయి. వాటిలో బిజీగా ఉంటున్నారు. మరి పిల్లలకు మంచి విషయాలు ఎవరు చెప్పాలి... ఎలా చెప్పాలి... ఇప్పటికే మైక్రో ఫ్యామిలీల వల్ల పిల్లలు అమ్మమ్మలతో, నానమ్మలతో గడపడం లేదు. ఉన్న అమ్మమ్మలేమో బిజీ. పిల్లల గురించి చాలా నిర్లక్ష్యం సాగుతోంది. అందుకనే పిల్లల కోసం కథలు రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 50 పుస్తకాలు రాస్తే వాటిలో 30 పిల్లల కోసమే. అందుకే పిల్లలందరూ నన్ను ‘ఆచి’ అని పిలుస్తున్నారు. అలా దేశానికే బామ్మనయ్యాను’ అని హర్షధ్వానాల హోరు మధ్య సుధామూర్తి చెప్పారు. జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో తన 50వ పుస్తకం ‘ది మేజిక్‌ ఆఫ్‌ లాస్ట్‌ ఇయర్‌ రింగ్స్‌’ వెలువడ్డ సందర్భంగా ఆమె మాట్లాడారు.

→ మనవరాలి కోసం
‘లండన్‌లో పెరుగుతున్న నా ఇద్దరు మనవరాళ్లలో ఒక మనవరాలు అనుష్కకు అక్కడకు వెళ్లినప్పుడల్లా కథలు చెప్పేదాన్ని. ఆ అమ్మాయి లాంటి పాత్ర ‘నూని’ ని సృష్టించి ఆ పాత్రతో ఒక ట్రయాలజీ రాస్తున్నాను. మొదటి భాగం ‘ది మేజిక్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ టెంపుల్‌’లో మన పిల్లలకు తెలియాల్సిన ఆర్కియాలజీ గురించి చెప్పాను. మన దేశంలో ఆర్కియాలజీ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన దేశం పురావస్తు శాస్త్రాన్ని పట్టుగొమ్మ. సైన్స్, టెక్నాలజీ చదువులో ఎలాగూ ఉంటుంది. ఆర్కియాలజీ ద్వారా గతాన్ని తెలుసుకోమని ఎవరు చెప్తారు? అందుకే ఆ భాగం రాశాను. రెండో భాగం ‘ది మేజిక్‌ ఆఫ్‌ లాస్ట్‌ ఇయర్‌ రింగ్స్‌’ రాశాను. ఇది మన దేశ బాలలకు పార్టిషన్‌ గురించి తెలియాలని రాశాను’ అన్నారామె.

→ సునాక్‌ కుటుంబం కాందిశీకులే
‘నా మనవరాలి వంటి పిల్లలకు దేశ విభజన గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే నా అల్లుడు రిషి సునాక్‌ కుటుంబం కూడా కాందిశీకులే. వాళ్లు పాకిస్తాన్‌ నుంచి దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నైరోబీలో స్థిరపడి అక్కడి నుంచి కూడా యు.కెకు కట్టుబట్టలతో వలస రావాల్సి వచ్చింది. కాలి కింద నేల లేకపోవడం అంటే ఏమిటో, నేలతో పాటు భాష, సంస్కృతిని కూడా కోల్పోవడం అంటే ఏమిటే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అయితే ఇది నెగెటివ్‌ ఇంపాక్ట్‌ ఇచ్చేదిలా కాకుండా గతంలో పెద్దవాళ్లు చేసిన తప్పును ఇప్పుడు మనం చేయకూడదు...  విభజనలు, విడదీయడాలు ఎవరికీ మంచివి కావు అని అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పుస్తకం రాశాను. మూడవ భాగం నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాల గురించి రాస్తాను. వాటి గురించి పిల్లలకు ఎవరూ సరిగా చెప్పరు’ అన్నారామె.

→ జీవితం సులభం చేయకండి
ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకు అడిగింది సమస్తం అందచేస్తున్నారు. దాంతో వారికి జీవితం ఇంత సులభమనే భావన కలిగిస్తున్నారు. జీవితం ఎంత మాత్రం సులభం కాదు. దానికి దానివైన ఎగుళ్లు, దిగుళ్లు, ఆనందాలు, బాధలు ఉంటాయి. పిల్లల్ని వాటికి ప్రిపేర్‌ చేయాలి. నా కొడుకు చిన్నప్పుడు కింద పడితే లేపి ‘నడిచిన వాడే పడతాడు. కాళ్లు ఉన్నది నడవడానికి. పడితే లేచి ముందుకు సాగడానికి’ అని చెప్పేదాన్ని. పిల్లలకు సమస్యలే రాకుండా చూడాలనుకోవడం సరి కాదు’ అన్నారామె.
రచయితలు కావాలనుకున్న పిల్లలందరూ బాగా పుస్తకాలు చదవాలని, మంచి రచయితలందరూ మంచి పాఠకులని సూచించారామె.

– జైపూర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement