మీతో మీరు అనుబంధం ఏర్పరుచుకోండి... | Gaur Gopal Das challenges common myths around balance and having it all | Sakshi
Sakshi News home page

మీతో మీరు అనుబంధం ఏర్పరుచుకోండి...

Jan 19 2026 6:10 AM | Updated on Jan 19 2026 6:10 AM

 Gaur Gopal Das challenges common myths around balance and having it all

జైపూర్‌ సాహితీ సంరంభం

‘నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్త్రీ, పురుషులు కుటుంబాల కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ఏమేమి చేయాలా అని నిత్యం ఆందోళన చెందుతున్నారుగానీ తమ కోసం తాము ఏం చేసుకోవాలనే సంగతిని మర్చి΄ోతున్నారు. నేడు ప్రతి మనిషి  అన్నీ పట్టించుకుంటూ తనను తాను నిర్లక్ష్యం  చేసుకుంటున్నాడు. మీకేమి కావాలో గ్రహించండి. మీతో మీరు అనుబంధం పెంచుకోండి’ అన్నారు  ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న ఆధ్యాత్మిక మార్గదర్శి గురు గోపాల్‌దాస్‌.

‘అయిన వారి కోసం అన్నీ చేయాల్సిందే... కానీ వారి కంటే మీ అయిన వారు మీరే. మీకేం కావాలి? మీ ఇష్టాల గురించి, ఆరోగ్యం  గురించి, అభిరుచుల గురించి,  లక్ష్యాల గురించి, అసలేమీ చేయకుండా కొన్నాళ్లు గడపాలనుకుంటున్న తీరిక సమయాల గురించి మీరేమి చేసుకుంటున్నారు? మీతో మీ అనుబంధం సరిగా లేక΄ోతే మీ అయినవారికి మీరు చేయాల్సిందంతా ఎలా చేయగలరు?’ అని ప్రశ్నిస్తారు గురు గోపాల్‌దాస్‌.
‘జైపూర్‌ సాహితీ సంరంభం’ లో తన తాజాపుస్తకం ‘యూ కెన్‌ హావ్‌ ఇట్‌ ఆల్‌’ వెలువడిన సందర్భంగా  జీవన మార్గాల సులభతరం గురించి ఆయన మాట్లాడారు.

మార్చలేని సమస్యలు
ప్రతి మనిషికీ జీవితంలో సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్ని పరిష్కరించేవి ఉంటాయి... కొన్ని పరిష్కరించలేనివి. ఉదాహరణకు ఫలానా వ్యక్తికి మీరంటే పడదు... మీ గురించి చెడు చెప్తుంటాడు... మీరు ఎంత ప్రయత్నించినా మారడు. దానిని నేను గణితంలో ‘పై’తో ΄ోలుస్తాను. ఏం చేసినా దాని విలువ మారదు. కాబట్టి మార్చలేని సమస్యలను పూర్తిగా వదిలిపెట్టాలి. వాటికై ఏ మాత్రం శక్తి వృథా చేయకూడదు. రెండో రకం సమస్యలు... మార్చదగ్గవి. మీ అబ్బాయికి మంచి కాలేజ్‌లో సీటు రాని పరిస్థితి ఉంటే మెరుగైన కాలేజ్‌లో అయినా మీరు సంపాదించగలరు కదా. దీనిని నేను గణితంలో ‘ఎక్స్‌’ విలువ కనుగొనడంతో ΄ోలుస్తాను. అలాంటి ఎక్స్‌ సమస్యల గురించి  పని చేయాలి. కాబట్టి ‘పై’ను వదిలిపెట్టండి. ‘ఎక్స్‌’ సంగతి చూడండి.

రాళ్లు కింద పడేయండి
ఒక సాధువు దగ్గరకి ఒక కుర్రవాడు వచ్చి ‘స్వామీ... నాకు మనశ్శాంతి కావాలి’ అని అడిగితే ఆ సాధువు కొన్ని రాళ్ల చూపించి ‘వాటిని వారంపాటు మూటలో వేసుకుని విడువకుండా తిరుగు’ అన్నాడు. ఆ కుర్రవాడు ఆ రోజూ ఆ రాళ్లమూటతో తిరగడం మొదలెట్టాడు. ఆ రాళ్లు రాను రాను బరువయ్యాయి.  చివరిరోజు సాధువు ఆ మూటను కింద పడేయ్‌ అనగానే కుర్రవాడికి మనశ్శాంతి అంటే ఏమిటో అర్థమైంది. మనమంతా అనవసర రాళ్లను మోస్తూ ఉంటాం. అసూయ, కుళ్లు, కుతంత్రం, ద్వేషం, పగ, దురాశ, స్వార్థం... సంబంధం లేని వ్యక్తి/విషయం గురించి అభి్రపాయం, సామాజిక మాధ్యమాలలో ముసుగు ముఖంతో విమర్శలు గుప్పిస్తుంటాం... ఇవన్నీ బరువులు. ఈ రాళ్లను ప్రతిరోజు ఉదయాన్నే లేచి లెక్కబెట్టి పారేయండి. మనశ్శాంతి తప్పక దొరుకుతుంది.

మాట్లాడండి
నేటి మనిషి దేని గురించీ మాట్లాడటం లేదు. అన్నీ మనసులో పెట్టుకుంటున్నాడు. నీతో ఈ సమస్య ఉంది... నా వల్ల ఈ ΄÷రపాటు జరిగింది... అని భార్యాభర్తలు, పిల్లలు, ఉద్యోగులు, ఇరుగు ΄÷రుగు వారు మాట్లాడుకుంటే సమస్యలు లేని సామరస్య జీవితం దొరుకుతుంది. చాలా సమస్యలు కేవలం మాట్లాడక΄ోడం వల్ల పాషాణరూపం దాలుస్తాయి. మౌనం సమస్యకు మూలం. మౌనం వద్దు. మాట మొదలెట్టండి... మాట్లాడండి అని బోధించారు గురు గోపాల్‌దాస్‌.
ఆయన మాటలను వినడంతో వదిలేయకుండా ఆచరణలో పెడితేనే మనశ్శాంతి కలుగుతుంది.

– జైపూర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement