అమ్మ అర్థం చేసుకుంటుంది | Sunita Sharan released her book at the Jaipur Literature Festival | Sakshi
Sakshi News home page

అమ్మ అర్థం చేసుకుంటుంది

Jan 21 2026 12:26 AM | Updated on Jan 21 2026 12:27 AM

Sunita Sharan released her book at the Jaipur Literature Festival

‘నేను చనిపోవాలనుకున్న ప్రతిసారీ అమ్మ బతికించింది’ అన్నారు అమెరికాలో చెఫ్‌గా, కుక్‌ బుక్స్‌ రచయితగా, రెస్టరెంట్ల యజమానిగా ప్రసిద్ధి చెందిన సువిర్‌ శరణ్‌. చిన్నప్పటి నుంచి తాను పురుష దేహంలో చిక్కుబడ్డ స్త్రీగా గుర్తించి సమాజం నుంచి, లోకం నుంచి  పారిపోవాలని అనుకున్నప్పుడల్లా అమ్మ తనను అర్థం చేసుకుందని చెప్పారాయన. ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో తన పుస్తకం విడుదలైన సందర్భంగా తల్లి సునీతా శరణ్‌ ఎలా జీవదాయినిగా కా పాడుతూ వచ్చిందో చెప్తూ భిన్న జెండర్‌ అస్తిత్వాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని మాట్లాడారాయన.

‘నాకు ఐదేళ్లు దాటినప్పటి నుంచే నాలోని భిన్నత్వం అర్థమవసాగింది. నాలో ఉన్నది నేను కాదని, ఈ అబ్బాయిలో అమ్మాయి ఉందని తెలిసిన మరుక్షణం నుంచి నా ప్రపంచం తల్లకిందులైపోయింది. భయంతో ఇంట్లో అమ్మ ఎక్కడుందా అని వెతుక్కునేవాణ్ణి. అమ్మ వంటగదిలో ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్లి  చీరకొంగులో మొహం దాచుకుని భద్రంగా ఉన్నట్టు భావించేవాణ్ణి. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా అమ్మ ఉంటేనే ధైర్యం’ అన్నారు సువిర్‌ శరణ్‌ (53). తాను ‘గే’ అని చెప్పడానికి సంకోచపడని సువిర్‌ శరణ్‌ ‘ఇప్పుడు ఇలా ప్రకటించుకుంటున్న స్థితి వేరు.

ఈ స్థితికి చేరడానికి సాగిన కఠోరమైన ప్రయాణం వేరు. ఆ ప్రయాణపు ప్రతి దశలో అమ్మ నన్ను కా పాడింది’ అన్నారాయన. ఢిల్లీకి చెందిన సువిర్‌ శరణ్‌ అమెరికాలో స్టార్‌ చెఫ్‌గా, చిత్రకారుడిగా, కుక్‌ బుక్స్‌ రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన తాజా పుస్తకం ‘టెల్‌ మై మదర్‌ ఐ లైక్‌ బాయ్స్‌’ విడుదలైన సందర్భంగా తనకు ఇష్టమైన ‘ఉమ్రావ్‌జాన్‌’ దుస్తులు ధరించి, తల్లి సునీతా శరణ్‌ ప్రేక్షకుల్లో కూచుని ఉండగా ప్రేక్షకులతో సంభాషించారు. దానికి ముందు ప్రసిద్ధ రచయిత్రి శోభా డే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఆటలు ఆడకపోతే...
మగ పిల్లలు ఆటలు ఆడతారు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌ ఇలాంటి ఆటలు ఆడకపోతే వాళ్లకు డౌట్‌ వస్తుంది. నేను అబ్బాయిలు ఆడే ఆటలు ఆడేవాణ్ణి కాదు. రంగులంటే నాకు ఇష్టం. రంగులతో బొమ్మలు వేసుకునేవాణ్ణి. వాళ్లు తేడాను కనిపెట్టారు. ఆ తర్వాత ఎంతో హింసించారు. నా స్థితిని అర్థం చేసుకోవడానికి అమ్మ ఎంతో ప్రయత్నించింది. మగపిల్లలు వంటగదిలోకి వస్తే తల్లులు ఇక్కడేం పని అని తరిమేస్తారు. అమ్మ నన్ను ఉండనిచ్చింది. అలా నాకు వంట తెలిసింది. ఇవాళ నేను అమెరికాలో స్టార్‌ చెఫ్‌గా ఉన్నానంటే అమ్మ నా బాధ మళ్లించడానికి వంట నేర్పడమే... అన్నారు శరణ్‌.

చనిపోదామనుకుంటే...
నా పదహారో ఏట నేను చనిపోవాలని ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానేశాను. కట్టెపుల్లగా మారిపోయి మంచాన పడ్డాను. అమ్మ ఆ రోజ్లులో ఎంత తల్లడిల్లిందో తలుచుకంటే బాధేస్తుంది. మరేం చేయను. నేను నాలా ఉందామనుకుంటే నేను కోరుకున్న అస్తిత్వంతో ఉందామనుకుంటే ప్రతి ఒక్కరికీ సమస్యే. బంధువులు, స్నేహితులు, స్కూల్లో క్లాస్‌మేట్లు అందరూ కామెంట్లు చేసేవారే. అమ్మ తప్ప అందరూ బాధిస్తూ ఉంటే చచ్చిపోదామనుకున్నాను. రెండేళ్లు అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసి బతికించింది. ఆ సమయంలో నేను బొమ్మలతో, రకరకాల వంటలతో ప్రయోగాలు చేశాను. అవన్నీ న్యూయార్క్‌లో ‘దేవి’ రెస్టరెంట్‌ స్థాపించినప్పుడు నాకు లాభించాయి. అమెరికాలో ‘మెషిలిన్‌ స్టార్‌’ సాధించిన తొలి ఇండియన్‌ రెస్టరెంట్‌ నాదే... అన్నారు శరణ్‌.

న్యూయార్క్‌  పారిపోయి...
ఇండియాలో ఉండలేక చదువు పేరుతో న్యూయార్క్‌ వెళ్లిపోవాలనుకున్నప్పుడు కూడా అమ్మ నాకు సపోర్ట్‌ ఇచ్చి నిలబెట్టింది. ఇప్పుడూ ప్రపంచానికి నాలా నేను తెలుసు. నాలాంటి వారి హక్కుల కోసం పని చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను. నేను తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే... పిల్లలు తమలో భిన్న జెండర్‌ అస్తిత్వాలను గుర్తించినప్పుడు వారిని మొదటగా అర్థం చేసుకోవాల్సింది మీరే. బయట సాగే హింస నుంచి ధైర్యాన్ని ఇవ్వాల్సింది మీరే. మీరు కూడా దాడి చేస్తే పిల్లలు ఇళ్ల  నుంచి  పారిపోవడం, చనిపోవడం తప్ప ఏం చేయగలరు. శోభా డే గారు ఇందాక మాట్లాడుతూ నాలాంటి పిల్లలు ఒక్కరు ఉన్నా తాను పెంచగలిగేదాన్ని కాను అన్నారు. మా అమ్మ కాబట్టి నన్ను పెంచింది. ప్రతి అమ్మ మా అమ్మలా ఉంటే భిన్న జెండర్‌ అస్తిత్వాలతో కూడా పిల్లలు విజయాలు సాధిస్తారు. వారిని వారిలా గౌరవించి ్రపోత్సహించండి...అని ముగించారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement