ఒక రైతు పెంచుకుంటున్న కుక్క ఆ రోజు కనపడలేదు. ఇంటికి రాలేదు. రైతు వెతకబోయే వేళకు చీకటి పడిపోయింది. రైతు విలవిలలాడిపోయాడు. రైతుకూ కుక్కకూ ఉన్న అనుబంధం గ్రామస్థులకు తెలుసు. రాత్రంతా జాగారం చేస్తున్న రైతు బాధ గమనించి తెల్లవారుతూనే రైతుకు సాయంగా కుక్కను వెతక బయలుదేరారు. వెళ్లగా వెళ్లగా వంతెన కింద మట్టిలో కుక్క పడుకుని కనిపించింది. వంతెన మీద నుంచి గ్రామస్థులు ఎంత పిలిచినా అది లేచి రాలేదు. ఏమై ఉంటుందా అని గ్రామస్థులు వంతెన దిగి కుక్క దగ్గరకు వెళితే అక్కడ కుక్క కుక్కలా లేదు. వెచ్చటి రగ్గులా ఉంది. ఎవరిదో తెలియని కుక్కపిల్ల చలికి వణుకుతూంటే దాని ఒళ్లు వెచ్చబెట్టేందుకు రాత్రంతా ఇంటికి రాకుండా కరుణతో కాపాడుతూ ఉంది. గ్రామస్థులు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. దీనికి ఉన్న కరుణ మనిషికి ఎందుకు లేదు?
దేశంలో ఈ గడ్డకట్టే చలిగాలుల్లో, నెత్తి మీద కాసింత నీడ లేక, ఉత్తబిత్తల ఆకాశం కింద, తోచిన గుడ్డ కప్పుకుని వేలాదిమంది అభాగ్యులు రాత్రుళ్లు దయనీయంగా పడు కుని ఉన్న దృశ్యాలు మీడియాలో వస్తున్న వేళ – ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో నోబెల్ శాంతి విజేత ‘లైమా గ్బవీ’ తమ ఆఫ్రికా దేశపు కథను చెప్పడం కేవలం యాదృచ్ఛికం. ఆమె చెప్పిన కథకు కొనసాగింపుగా మరో నోబెల్ శాంతి విజేత కైలాశ్ సత్యార్థి తన జీవితంలో ఎదురైన ఘటనను చెప్పుకొచ్చారు – చాలా ఏళ్ల కిందటి మాట. ఒక తండ్రి నా తలుపు తట్టాడు. అయ్యా... నా కూతురిని రక్షించు అన్నాడు. అప్పుడు చిన్న పత్రికను నడుపుతున్నాను.
ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్‌కు 30 కుటుంబాలు పనికి వెళితే వారిని కట్టు బానిసలుగా చేశారనీ, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారనీ, తన కూతురు వయసుకు రావడం చూసి అమ్మేయబోతున్నారనీ, పోలీసులు సాయానికి రాకపోవడం వల్ల పత్రికలో రాస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని వచ్చాననీ ఆ తండ్రి నాతో ఏడుస్తూ చెప్పాడు. పత్రికలో ఆ విషయం రాయడానికి కూచుని వెంటనే పెన్సిల్ పక్కన పడేశాను. అక్కడ ఉన్నది నా కూతురో, చెల్లెలో అయితే ఇలా వ్యాసం రాస్తూ కూచుంటానా? అనుకున్నాను. ఆ తర్వాత నా తల పగిలి ఉండొచ్చు. వెన్నుపూసను విరిచినంత పని చేసి ఉండొచ్చు. నా కాలిని విరగ్గొట్టి ఉండొచ్చు. కాని ఇప్పటికి లక్షా ముప్పై వేల మంది అలాంటి పిల్లలను కాపాడాను. వారి ఆనంద బాష్పాలలో నేను దేవుణ్ణి చూశాను. కరుణే నాకు ఇంత శక్తి ఇచ్చిందని అనుకుంటున్నాను.
‘మనిషి మంచివాడే. నాగరికత వల్ల చెడిపోయాడు’ అన్నాడు రూసో. నాగరికత అంటే గాలి కూడా పీల్చడానికి వీల్లేనంతగా అభివృద్ధి చెందడం కాబోలు! మరి చెడి పోవడం అంటే? కరుణ అడుగంటిన వాడు అవడమే! కరుణ లేకపోతే ఏమవుతుంది? పీడన, పెత్తనం, చెడు, దుర్మార్గం, నిస్సహాయత, హింస, దౌర్జన్యం... కళ్ల ముందు కని పిస్తున్నా చలించని జడత్వం వస్తుంది. జడత్వం రాయి. కరుణ జల. తల్లిదండ్రులకు తమ పిల్లల ఐ.క్యూ (ఇంటెలిజెన్స్ కోషియెంట్) బాగుండాలని ఉంటుంది. కాని పిల్లల్లో చూడాల్సింది, పాదుకొనేలా చేయాల్సింది సి.క్యూ. అంటే ‘కంప్యాషన్ కోషియెంట్’. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత సంతోషపడాలి. చీకట్లో నల్లపూస దొరకగలదేమోగానీ నేటి మనిషిలో కరుణ దొరకడం దుర్లభం అవుతోంది.
అందుకే మనిషికి ఇంకో మనిషి, వర్గం, ప్రాంతం, కులం, మతం... అన్నింటి పట్లా విరోధభావం, శత్రుత్వం. తుదకు పశుజాలం పట్ల కూడా మనిషి కరుణ చూపడం లేదు. మనిషికి కరుణ ఉంటే నదులు, పర్వతాలు, అడవులు ఇలా ఉండేవా? అన్నారు కైలాశ్ సత్యార్థి. అందుకే మనిషిలో ‘సి.క్యూ’ కొలవగలిగే యాప్‌ను కనిపెట్టాలి. అది ఎక్కువ కలిగిన వారినే వివాహానికి, ఉద్యోగానికి, రాజకీయ పదవులకి ఎన్నుకోవాలి. స్కిల్స్ పెంచుకోవడానికి శిక్షణ ఇచ్చినట్టే కరుణ పెంచుకోవడానికి శిక్షణ ఇవ్వాలి అన్నారు సత్యార్థి.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన తాజా పుస్తకం ‘కరుణ: ది పవర్ ఆఫ్ కంప్యాషన్’ ఆవిష్కరణ వేడుకలో ఇంటిని, కుటుంబాన్ని, సరిహద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరగల కరుణ అవసరం గురించి ఇలాంటి మాటలెన్నో సాగాయి. ‘త్రుంచ బోకుము... తల్లికి బిడ్డకు వేరు చేతువే’ అని విలపించిన కరుణశ్రీ నడిచిన తెలుగు నేలకు కరుణ తెలియదా ఏమి? కాకుంటే కాస్త మరుగున పడి ఉంటుంది, మరుపున అణిగి ఉంటుంది అంతే!


