వివేకా హత్య కేసులో మేం మినీ ట్రయల్ నిర్వహించలేం
ప్రతి చిన్న అంశానికీ దర్యాప్తు కోరతారా?
భూతద్దంలో చూపిస్తూ మళ్లీ దర్యాప్తు కోరుతూపోతే హైకోర్టుకు పంపాల్సి వస్తుంది
నిందితులకూ హక్కులు ఉంటాయి కదా?
గోడ మీద పిల్లి వాటంలా సీబీఐ తీరు..
పిటిషనర్ కోరినట్లు కాదు.. మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి
అంతేగానీ కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు
విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి..
స్పష్టమైన వైఖరితో రండి.. దీనిపై 5న తేల్చేస్తాం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను మరింత జాప్యం చేసేలా నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే విచారణ పూర్తయిన అంశాలను మళ్లీ తిరగతోడుతూ, కాలయాపన చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
తదుపరి దర్యాప్తునకు సంబంధించి కింది కోర్టు (ట్రయల్ కోర్టు) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో ‘మినీ ట్రయల్’ (సమాంతర విచారణ) నిర్వహించలేమని, పిటిషనర్ కోరినట్లుగా ప్రతి చిన్న అంశానికీ మళ్లీ విచారణకు ఆదేశిస్తూ పోతే కేసు కొలిక్కి రావడానికి మరో పదేళ్లు పడుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారా?
సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు (సీబీఐ కోర్టు) తమ అభ్యర్థనలను పక్కన పెట్టిందంటూ ఛార్జిషీటులోని అంశాలను ఒక్కొక్కటిగా చదివే యత్నం చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ కలుగజేసుకుంటూ.. ‘ఇవన్నీ ట్రయల్ కోర్టు చూసుకోవాలి్సన అంశాలు. మీరు ఇక్కడ మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారా? ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ మళ్లీ దర్యాప్తు కోరుకుంటూ పోతే.. మేం హైకోర్టుకు పంపాల్సి వస్తుంది. అక్కడి నుంచి మళ్లీ కింది కోర్టుకు వెళ్లేసరికి మరో పదేళ్లు పడుతుంది. ఈలోపు ట్రయల్ ముగియదు. నిందితులకూ హక్కులు ఉంటాయి కదా?’ అని ఘాటుగా ప్రశ్నించారు.
గోడ మీద పిల్లి వాటం వద్దు: సీబీఐకి సుప్రీం చురకలు..
ఇదే సమయంలో సీబీఐ తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది. పిటిషనర్ అడిగారు కదా అని ప్రతిదానికీ తలొగ్గడం సరికాదని హితవు పలికింది. ’దర్యాప్తు సంస్థగా మీ వైఖరి ఏమిటి? మీకు దర్యాప్తు అవసరమనిపిస్తోందా? లేదా? ఇప్పటికే చేసిన దర్యాప్తుతో సంతృప్తి చెందారా? ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. అంతేగానీ కోర్టు ఆదేశిస్తే చేస్తాం అంటూ గోడ మీద పిల్లి వాటంగా వ్యవహరించవద్దు. ఒకవేళ నిజంగానే దర్యాప్తులో లోపాలున్నాయని భావిస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. పిటిషనర్ కోరిన మేరకు కాకుండా, సాక్ష్యాధారాల మేరకు మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అంతేగానీ, కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు. విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి..’ అని సీబీఐ న్యాయవాదిని ధర్మాసనం గట్టిగా మందలించింది.
ఆ ఒక్క అంశంపైనే అనుమతి..
కింది కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. హత్య జరిగిన రోజు (మార్చి 15, 2019) అర్ధరాత్రి సమయంలో కిరణ్ యాదవ్ (ఏ–2 సోదరుడు), అరుణ్‌రెడ్డి (ఏ–1 బంధువు) మధ్య మెసేజ్‌ల మార్పిడిపై మాత్రమే తదుపరి దర్యాప్తునకు సెషన్స్ కోర్టు అనుమతించిందని గుర్తు చేసింది. ఆ ఒక్క అంశం మినహా మిగిలిన వాటిపై దర్యాప్తు అవసరం లేదని కింది కోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు మళ్లీ అవే అంశాలను సుప్రీంకోర్టులో ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసింది.
నిందితుల హక్కులను కాలరాస్తారా..?
ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. తాము విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు పేరుతో కేసును సాగదీస్తున్నారని కోర్టుకు విన్నవించారు. స్పీడ్ ట్రయల్ తమ హక్కు అని, ఏళ్ల తరబడి కేసును సాగదీయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేసును లాజికల్ ఎండ్‌కు (తార్కిక ముగింపు) తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణను నిరవధికంగా సాగదీస్తూ పోతే నిందితుల హక్కులకు భంగం వాటిల్లుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించింది.
ఫిబ్రవరి 5న తేల్చేస్తాం..
ఈ నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే దానిపై స్పష్టమైన వైఖరితో రావాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ రోజుతో ఈ అంశంపై ఒక స్పష్టతనిస్తామని పేర్కొంది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో పిటిషనర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.


