
స్నేహితులు, బంధువులతో కలిసి ఏదైనా వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒకరిద్దరి ఫోన్‌లోనే ఎక్కువ ఫొటోలు తీస్తుంటారు. తర్వాత వాటిని షేరింగ్ యాప్‌ల ద్వారా షేరు చేసుకుంటారు. కొన్ని రోజులకు మరో ఈవెంట్‌లో అందరూ కలిసి ఫొటోలు దిగితే మళ్లీ ఇదే మాదిరిగా షేర్ చేసుకోవాల్సిందే. అయితే ఏఐ ఆధారిత యాప్ ‘పిక్‌సీ’ దీనికో పరిష్కారం చూపుతుంది. ఏఐ సాయంతో స్నేహితుల వద్ద ఉన్న మీ ఫొటోలను సెర్చ్ చేసి ఇద్దరి అనుమతితో షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది. దీన్ని ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిడావట్కా నేతృత్వంలోని బిలియన్ హార్ట్స్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ మ్యుచువల్ ఫొటో షేరింగ్ యాప్ అని కంపెనీ పేర్కొంది.
కొన్ని సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల కోట్ల ఫొటోలు దిగుతున్నారు. వాటిలో చాలా వరకు ఇతరుల ఫోన్లలోనే ఉండిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పిక్‌సీ ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పింది.
ప్రత్యేకతలు
గివ్ టు గెట్: ఇది యాప్ ప్రధాన సూత్రం. స్నేహితులు మీ ఫోటోలను షేర్ చేయాలంటే తప్పనిసరిగా ఇరువురి అనుమతి కావాల్సిందే. ఇది పరస్పర ఆమోదం ఆధారంగా పనిచేసే వ్యవస్థ. ఇది ఫొటోల షేరింగ్‌ను ఆటోమేట్ చేస్తుంది.
పిక్‌సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్నేహితుల ఫోన్లలో ఉన్న మీ ఫోటోలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. వాటిని మీకు పంపుతుంది. ఒకసారి అనుమతిస్తే మాన్యువల్‌గా ప్రతిసారి పంపాల్సిన శ్రమ ఉండదు.
ఈ యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అనుసరిస్తుంది. ఫొటోలు పూర్తిగా వినియోగదారల డివైజ్‌లోనే ఉంటాయి. పిక్‌సీ సర్వర్‌లకు వాటిని యాక్సెస్ చేసే అవకాశం లేదు. తద్వారా వినియోగదారు గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.
జులై 2025లో లాంచ్ అయినప్పటి నుంచి 27 దేశాలు, 160+ నగరాల్లో ఈ యాప్ వినియోగదారులున్నారు. కేవలం రెండు నెలల్లోనే 75 రెట్లు యూజర్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మయాంక్ బిడావట్కా మాట్లాడుతూ..‘ప్రపంచంలో 15 ట్రిలియన్లకు పైగా ఫొటోలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా వరకు షేర్ చేసుకోరు. పిక్‌సీ వినియోగదారుల పరస్పర అనుమతితో ఈ సమస్యను పరిష్కరిస్తుంది’ అన్నారు.
ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు