
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ(AI) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ పూర్తిగా అంతర్గతంగా శిక్షణ ఇచ్చిన తన మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్ ‘మై ఇమేజ్-1(MAI-Image-1)’ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఓపెన్‌ఏఐ (OpenAI)పై ఆధారపడుతుండడాన్ని తగ్గించుకునేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది.
ఫొటోరియలిస్టిక్ ఇమేజరీ
‘MAI-Image-1 మోడల్ ఫొటోరియలిస్టిక్ ఇమేజరీని ఉత్పత్తి చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఫొటోలో లైటింగ్ పరిస్థితులు, నీటిపై ప్రతిబింబాలు, ప్రకృతి దృశ్యాలు అత్యంత వాస్తవికంగా ఉంటాయి. భారీ ఎల్‌ఎల్‌ఎంలు వాడుతూ నెమ్మదిగా అవుట్‌పుట్ ఇచ్చే మోడళ్లతో పోలిస్తే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అత్యంత వాస్తవిక అవుట్‌పుట్‌లను సాధించడానికి ఇప్పటికే నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం’ అని కంపెనీ తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ MAI-Image-1 ఇప్పటికే ప్రముఖ ఏఐ బెంచ్‌మార్క్ అయిన ఎల్‌ఎంఅరెనా(LMArena)లో టాప్ 10లో స్థానం సంపాదించింది. LMArenaలో ఏఐ అవుట్‌పుట్‌ల ఆధారంగా వివిధ మోడళ్లను పోల్చి ఉత్తమమైన వాటికి ఓటు వేస్తారు.
ఏఐ ఇమేజ్ జనరేషన్ విభాగంలో ఓపెన్‌ఏఐ (DALL-E), గూగుల్ (Nano Banana) వంటి సంస్థలు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో సంస్థ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓపెన్‌ఏఐ తన సోరా(Sora) 2 టూల్‌ను ఉపయోగించి వీడియోలను సృష్టించే యాప్‌ను ఇప్పటికే అమెరికా, కెనడాలోని యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రారంభించింది.
ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?