
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించదానికి దుబాయ్ పోలీసులు, సరికొత్త ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సిస్టం ప్రవేశపెట్టారు. ఇది మానవ ప్రమేయం లేదా ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం అవసరం లేకుండానే.. ఐదు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తుంది.
దుబాయ్ పోలీసులు ఎమిరేట్ అంతటా రోడ్డు భద్రతను పెంపొందించడంలో భాగంగా.. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ (ITS)ను ఆవిష్కరించారు. ఇది GITEX గ్లోబల్ 2025లో ప్రదర్శించబడిన ఏఐ బేస్డ్ ప్లాట్‌ఫామ్. ఈ టెక్నాలజీ డ్రైవర్లు రోడ్డు నియమాలను ఎలా పాటిస్తున్నారనే విషయాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ట్రాఫిక్ అడ్డుకోవడం, కారణం లేకుండా రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపడం, వాహనాల మధ్య దూరాన్ని నిర్వహించడంలో విఫలం కావడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ గుర్తిస్తుంది.
ట్రాఫిక్ అనేది ఇప్పటివరకు చాలా దేశాల్లో మాన్యువల్‌గానే నిర్వహిస్తున్నారు. గతంలో దుబాయ్ కూడా ఇదే విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ కచ్చితమైన వివరాలను అందిస్తుందని, తద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయని.. అక్కడి అధికారులు చెబుతున్నారు.