
తన ఇంటి సహాయకురాలి జీతం, ఐటీ ఫ్రెషర్స్ కంటే ఎక్కువ
సిలికాన్ సిటీ, ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గార్డెన్ సిటీ బెంగళూరులో జీవితం అంటే చాలా ఖరీదైనదే. అలాంటిది బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ తన ఇంటి సహాయకురాలికి నెలకు రూ.45,000 కంటే ఎక్కువ చెల్లించడం చర్చకు దారితీసింది.
తాజాగా రష్యాకు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా బెంగళూరు లైఫ్ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తన బిడ్డను చూసుకునేందుకు నియమించుకున్న పనిమనిషికి నెలకు రూ. 45,000 చెల్లిస్తానని వెల్లడించింది. అంతేకాదు ఇంటి పనిని కూడా "వృత్తిపరంగా" చూస్తానని, ఏదేని కార్పొరేట్ ఉద్యోగం లాగే ప్రోత్సాహకాలను అందిస్తానని అస్లమోవా చెప్పారు.
ఇంకా ఇంటి అద్దెకు 1.25 లక్షల రూపాయలు, తన పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ.30వేలు, ఆహారంతో సహా ఇంటి ఖర్చుల కోసం రూ.75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ఈ మహిళ వెల్లడించింది. పనిమిషికి 45 వేలు ఇవ్వడం అంటే తనను "పిచ్చిదానిని" అని అనుకోవచ్చు. కానీ ఆమె విధేయత, వృత్తి నైపుణ్యం కారణంగా ఆమె ఈ ప్రతిఫలానికి అర్హురాలని తాను భావించినట్లు తెలిపింది. తన కుమార్తె ఎలినా కోసం నానీని నియమించుకునే ముందు కనీసం 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశానని ఆమె చెప్పారు.
దీనిపై నెటిజన్లు స్పందించారు. బెంగళూరు సహా భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు స్పందించారు. కొందరు ఆమెను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. మీరు ఎక్కువ చెల్లిస్తున్నారనీ, ఇంతకంటే తక్కువకు ఫ్లాట్‌లు దొరుకుతాయని కమెంట్ చేశారు. మరొక వినియోగదారు “అది TCS, ఇన్ఫోసిస్ ,యాక్సెంచర్ టెక్ ఫ్రెషర్లకు చెల్లించే దానికంటే ఎక్కువ.” అని పేర్కొన్నారు.
అయితే విమర్శలపై స్పందిస్తూ అస్లమోవా తన వైఖరికి కట్టుబడి ఉండటం విశేషం. "మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే, కర్మ మీకు ఫలితం ఇస్తుంది" అని కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అలాగే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన వృద్ధికి బదులుగా ఇంటి పనికి రోజుకు చాలా గంటలు కేటాయించేవారు విలువైన అవకాశాలను కోల్పోతున్నారని చెబుతూ, వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు.