
ఇరవైలలో సివిల్స్‌కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా
మాత్రం 35వ యేట ప్రిపరేషన్ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్‌లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్‌కు సిద్ధం అవుతున్నప్పుడు...
‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్‌లో సక్సెస్ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్ ప్రిపరేషన్‌లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్‌కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైమ్ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్‌కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.
ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్‌సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.
కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్‌లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా.
(చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..)