
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ ఇలా..
1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం
1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.
1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడులు.
2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..
2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.
2:30 AM శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు.
3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.
4:00 AM ఎల్‌వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులు
భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.
