
అమెరికా తొలి గుడ్ ఫార్మర్ అవార్డుకు మహిళా సేంద్రియ రైతు క్లారెండా ‘ఫార్మర్ సీ’ స్టాన్లీ ఎంపికయ్యారు. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రసిద్ధ రోడేల్ ఇన్‌స్టిట్యూట్, డావైన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ పురస్కార ప్రదానానికి శ్రీకారం చుట్టటం విశేషం. పదేళ్లకు మించకుండా పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం (రీజనరేటివ్ ఆర్గానిక్ అగ్రికల్చర్)ను ఆచరిస్తూ, పర్యావరణానికి, సమాజానికి ఉత్తమ సేవలు అందించిన ఆదర్శ కృషీవలురికి ఈ పురస్కారం ఇవ్వటం ఈ ఏడాది ప్రారంభించామని అమెరికాలో 1947 నుంచి సేంద్రియ వ్యవసాయ పరిశోధనలకు పట్టుకొమ్మ అయిన రోడేల్ ఇన్‌స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జెఫ్ ట్రాక్ అన్నారు.
‘స్టాన్లీ తన గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్‌లో చేస్తున్న పని తన వ్యవసాయ క్షేత్రాన్ని సుసంపన్నం చేయటంతోపాటు కొత్త తరం రైతులకు ప్రేరణగా నిలుస్తోంది. తొట్టతొలి ద గుడ్ ఫార్మర్ అవార్డ్ యుఎస్ పురస్కారాన్ని ప్రదానం ఆమెకు ప్రదానం చేయటం గర్వంగా ఉంది’ అన్నారాయన. నార్త్ కరోలినలో గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్‌ను నిర్వహిస్తున్న స్టాన్లీ సేంద్రియ విలువల పట్ల నిబద్ధతతో వ్యవసాయం చేస్తున్న హెర్బలిస్టు.
రీజెనరేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆర్థిక ప్రగతితోపాటు, సమానత్వం, విద్య, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గాను ఆమెను పురస్కారం వరించింది. 20 రాష్ట్రాల నుంచి సుమారు వంద దరఖాస్తులు రాగా స్టాన్లీని జ్యూరీ ఎంపికచేసింది. ఈ పురస్కారం కింద పది వేల డాలర్ల నగదును, జ్ఞాపికను అందజేస్తారు. స్టాన్లీ విలువైన ఔషధ మొక్కలను, తేయాకును పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నారు.
కొత్తగా సేద్యవృత్తిని చేపట్టిన వారికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. చారిత్రకంగా అణగారిన వర్గాల బడుగు వారికి ఆమె ప్రాధాన్యం ఇస్తారు. నేలను సేంద్రియ పద్ధతుల్లో పునరుజ్జీవింపజేసుకుంటూనే పంటలు పండిస్తూ ఈ వ్యవసాయం ఆర్థికంగానూ, పర్యావరణపరంగా, ఆహార భద్రతాపరంగానూ గిట్టుబాటు వ్యవహారమే అని స్టాన్లీ నిరూపించుకున్నారు.
‘గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్‌లో మేం అనుసరిస్తున్న సాగు పద్ధతికి ఈ పురస్కారం వెన్నుతట్టింది. ఈ క్షేత్రంలో మేం పంటలను మాత్రమే పండించటం లేదు, పరివర్తనను పెంపొందిస్తున్నాం’ అన్నారు స్టాన్లీ సంతోషంగా. డావైన్స్ గ్రూప్ ఐదేళ్ల క్రితం ఇటలీలోని పర్మలోయూరోపియన్ రీజెనరేటివ్ ఆర్గానిక్ సెంటర్‌ను రోడేల్ ఇన్‌స్టిట్యూట్ తోడ్పాటుతో నెలకొల్పింది. అక్కడ జరిగే సభలో స్టాన్లీకి పురస్కార ప్రదానం జరుగుతుంది. ఆమె రాకపోకల ఖర్చులన్నీ డావైన్స్ గ్రూప్ భరిస్తుంది.
ఆమె తమ దేశానికి రావటం వల్ల రీజనరేటివ్ ఆర్గానిక్ వ్యవసాయ స్ఫూర్తి తమ ప్రాంత రైతులకు ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నామని డావైన్స్ గ్రూప్ సంతోషిస్తోంది. పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేయటంతోపాటు.. పండించిన ఆహారాన్ని తినిపించి వ్యాధులు నయం చేసే ఆసుపత్రిని పొలంలోనే నిర్వహించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న స్టాన్లీ సింగిల్ వుమన్ ఫార్మర్ కావటం మరో విశేషం.
(చదవండి: మెగా గుమ్మడి!)