కొడుకు బాధను అర్థం చేసుకునేది తల్లిదండ్రులేగా! | Parents Throw Cake Party to Cheer Up Failed Son Viral | Sakshi
Sakshi News home page

కొడుకు బాధను అర్థం చేసుకునేది తల్లిదండ్రులేగా!

May 5 2025 7:54 AM | Updated on May 6 2025 8:55 PM

Parents Throw Cake Party to Cheer Up Failed Son Viral

బెంగళూరు: పరీక్షల్లో ఫెయిల్‌ అయితే జీవితమే అయిపోయినట్లు ఫీలైపోయి ప్రాణాలు తీసుకునే విద్యార్థులను చూసుంటాం. లేదంటే.. ఏదో నేరం చేసినట్లు పిల్లల్ని మందలించే.. దండించే పేరెంట్స్‌ను చూసుంటాం. కానీ, పరీక్ష తప్పితే ఇంటా.. బయటా అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అభిషేక్‌ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే.. ఎవరేం అనుకుంటే ఏమి అనుకుంటూ ఇలా కేక్‌ కట్‌ చేయించారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఘటన గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు పరీక్ష తప్పితే.. చుట్టుపక్కల వాళ్లను పిలిచి.. కేక్‌ తెప్పించి కట్‌ చేయించి.. చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్‌ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు. 

టెన్త్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు అభిషేక్‌. మొత్తం 600 మార్కులకుగాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. లాగిపెట్టి కొట్టక.. ఇదేం పని అని తిట్టుకున్న వాళ్లు ఉన్నారు ఈ ఫొటోలు, వీడియో చూశాక. కానీ, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు బాధను అర్థం చేసుకునేది ఆ తల్లిదండ్రులేగా!. మరోసారి రాసి పాసవుదులేరా అని వెన్నుతట్టి ప్రొత్సహించారు. పరీక్షలలో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడం కాదు, భవిష్యత్తులో విజయానికి పట్టుదల కీలకం అని సందేశం ఇచ్చారు ఆ పేరెంట్స్‌. అఫ్‌కోర్స్‌.. అభిషేక్‌ తల్లిదండ్రులు చేసిన ఈ పని నచ్చనివాళ్లు కూడా ఉంటారనుకోండి. అది వేరే విషయం.


 

Advertisement
 
Advertisement
Advertisement