
గుండె సమస్యలతో ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు నిత్యం చూస్తున్నాం. కర్ణాటక హసన్ జిల్లాలో 40 రోజుల వ్యవధిలో 23 మంది మరణించారు. ఈ కథనాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందునా 25-40 మధ్యవయసున్న వాళ్లే ఎక్కువగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దేశంలో నిత్యం ఏదో ఒక మూల హఠాన్మరణం ఘటన చోటు చేసుకుంటోంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వ్యక్తులు, ఎలాంటి అరోగ్య సమస్యలు లేని వ్యక్తులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడుస్తున్నారు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టులతోనే వాళ్లు చనిపోతున్నారని డాక్టర్లు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా పోటు తప్పదని అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో..
ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటున్నారు. కర్ణాటక మైసూర్‌లోని ప్రముఖ జయదేవ ఆస్పత్రికి గత మూడు నాలుగు రోజుల నుంచి వేలమంది జనం క్యూ కట్టారు. ఓపీ కోసం వేకువ జాము నుంచే ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్‌లలో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. మైసూర్‌తో పాటు బెంగళూరు బ్రాంచ్ ముందు కూడా ఇదే పరిస్థితి. జయదేవ ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ ఆస్పత్రి.
ಮೈಸೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತ ಹೆಚ್ಚಿದ ಹಿನ್ನಲೆ, ಜಯದೇವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಕ್ಯೂ.#mysore #jayadevahospital #newskarnataka pic.twitter.com/KJDtN2DwwV
— News Karnataka (@Newskarnataka) July 8, 2025
VIDEO Credits: News Karnataka
అయితే మీడియా కథనాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో ఆందోళన చెందవద్దని జయదేవ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కేఎస్ సదానంద ప్రజలకు సూచిస్తున్నారు. ‘‘జనాలు అంతా ఒక్కసారిగా ఇక్కడికి ఎగబడినంత మాత్రాన.. సమస్య పరిష్కారం కాదు. కేవలం పరీక్షలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఊహాగానాలకు అతిగా స్పందించొద్దు. మీరు ఆస్పత్రులకు ఎగబడడం వల్ల.. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు చికిత్సలో అంతరాయం కలగవచ్చు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకున్న మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారాయన.
హసన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. వీటిపై విచారణకుత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది కూడా. అదే సమయం కోవిడ్ వ్యాక్సిన్‌ల పనితనం గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేయగా.. కేంద్ర ఆరోగ్య శాఖ పలు అధ్యయనాలను ప్రస్తావిస్తూ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.