శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..! | World Asthma Day 2025: Spreading Awareness Practical Tips For Managing | Sakshi
Sakshi News home page

World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!

May 6 2025 9:10 AM | Updated on May 6 2025 4:31 PM

World Asthma Day 2025: Spreading Awareness Practical Tips For Managing

ఆస్తమా అనేది ఓ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. నిజానికి దీన్ని ఓ ఆరోగ్య సమస్యగా చెప్పడం కంటే ఏదైనా సరిపడని వస్తువు దేహంలోకి వెళ్లినప్పుడు... మన వ్యాధినిరోధక వ్యవస్థ చూపే ప్రతిచర్యగా చూడటం సబబు. ఇలా ఏదైనా సరిపడని వస్తువు శ్వాసవ్యవస్థలోకి వెళ్లినా లేదా ఒక్కోసారి కడుపులోకి వెళ్లినా... మన సొంత వ్యాధినిరోధక వ్యవస్థ దాన్ని పరాయి వస్తువుగానూ (ఫారిన్‌బాడీ), లేదా దేహానికి హాని చేసే అంశంగానూ భావించినప్పుడు శ్వాస నాళాలు సన్నబడిపోతాయి. దాంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఊపిరి చాలా బలంగా తీసుకోవాల్సిరావడం, శ్వాసనాళాలు సన్నబారడంతో పిల్లికూతలు వినిపించడం ఇవన్నీ ఆస్తమాలో కనిపిస్తుంటాయి. ఆస్తమా ఉన్నవారిలో ఊపిరితిత్తులకు ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట) వస్తుంది. ఈ ఎటాక్‌ రావడన్నమది దీర్ఘకాలం బాధించే (క్రానిక్‌)  సమస్యగా ఎపిసోడ్స్‌గా వస్తూ ఇబ్బంది పెడుతుంది. ప్రపంచంలోని ఆస్తమా కేసుల్లో కేవలం 12శాతం మాత్రమే భారత్‌లో ఉన్నప్పటికీ ప్రపంచ ఆస్తమా మరణాల్లో 40%కి పైగా మనదేశంలోనే సంభవిస్తున్నాయి. మనదేశ ప్రజల్లో ఆస్తమా పట్ల అంతగా అవగాహన లేకవడం, ఇన్‌హేలర్ల పట్ల అనేక రకాల అపోహలూ... ఇలాంటి అంశాలన్నీ కలసి మన దేశవాసుల్లో ఆస్తమా కేసుల్లో మరణాలను పెంచుతున్నాయి. నేడు (మే 6న) ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా ఈ సమస్యపై అవగాహన కోసం ఇస్తున్న కథనమిది.  

ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయు నాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన దేహానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి  తీసుకెళ్లి, అక్కడి కాలుష్య కార్బన్‌ డై ఆక్సైడ్‌ను మళ్లీ బయటకు వదలడానికి అంచెలంచెలుగా అనేక నాళాలు ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట, ఎర్రబారడం) కారణంగా అవి ఉబ్బుతాయి. 

దాంతో సెన్సిటివ్‌గా మారిపోతాయి. అంటే ఉదాహరణకు చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు అది ఎర్రబారి, వాచి, ముట్టుకుందామంటేనే ముట్టనివ్వని విధంగా మారడాన్ని ఇన్‌ఫ్లమేషన్‌ అని చెప్పవచ్చు. కొంత జాగ్రత్తతో జీవితాంతం ఆస్తమాను అదుపులో ఉంచుకోని, పూర్తిస్థాయి సాధారణ జీవితం, నిండు ఆయుర్దాయం కలిగి ఉండవచ్చు. కానీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఆస్తమా పట్ల అవగాహన కొంత తక్కువగానే ఉండటంతో... పూర్తిగా అదుపులో ఉంచగలిగే ఈ సమస్య వల్ల కలిగే దుష్ప్రభావాలు మన దేశంలో ఎక్కువే. 

ఉదాహరణ కోసం ఓ కేస్‌ స్టడీ... 
హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ స్నేహ (ఇది అసలు పేరు కాదు) కేవలం ఐదు నెలల వ్యవధిలో మూడోసారి తీవ్రమైన ఆస్తమా ఎటాక్‌తో ఆమెను ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు తీసుకురావల్సి వచ్చింది. ఆమె చెప్పే మాట ఏమిటంటే... ‘డాక్టర్, నేను టాబ్లెట్స్‌ తీసుకుంటున్నా, కానీ ఇన్‌హేలర్‌ తీసుకోవాలంటే భయంగా ఉంది. వాటికే అలవాటు పడతానేమో అనే అభిప్రాయంతో తీసుకోవడం లేదు’’ అని చెప్పింది. 

నిజానికి టాబ్లెట్‌ తీసుకోవడం వల్ల ఆ మందు రక్తంలో కలిసి దేహమంతా ప్రవహిస్తుంది. అది అప్పటి అవసరం కాబట్టి తీసుకోక తప్పదు. అయితే ప్రివెంటివ్‌ ఇన్‌హేలర్స్‌  క్రమం తప్పకుండా వాడటం... అలాగే మొదటి చికిత్సగా (ఫస్ట్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌గా) తీసుకోవాల్సిన ఇన్‌హేలర్స్‌ వాడితే అసలు ఎటాక్‌ రాకుండానే నివారించడానికి చాలావరకు ఆస్కారం ఉంటుంది. 

నిజానికి చాలా తక్కువ మోతాదులో (ఒక మాటలో చెప్పాలంటే టాబ్లెట్‌లో ఉండే దానికంటే 400వ వంతు తక్కువ మోతాదులో) మందు వెళ్లి... ఆస్తమా దుష్ప్రభావం చూపుతున్న నిర్ణీత ప్రదేశంలోనే ఇన్‌హేలర్స్‌లోని మందులు ప్రభావం చూపుతాయి. ఇవి ఎప్పటికీ అలవాటు కావు. 

అందువల్ల ఈ ఏడాది ఆస్తమా డే నినాదం ఏమిటంటే... ‘‘ఆస్తమా మీ జీవనానికి అడ్డంకి కాకూడదు. అంతేకాదు... ఇన్‌హేలర్స్‌ అందరికీ అందుబాటులో ఉంచుదాం... హాయిగా శ్వాస తీసుకుందాం... అన్నవి ఈ ఏడాది ఆస్తమా డే తాలూకు స్ఫూర్తిమాటలు.    

కారణాలు...
జన్యుపరమైన అంశాలు ఆస్తమాకు ప్రధాన కారణమని చాలా అధ్యయనాల్లో తేలింది. దాంతో ;eటు సరిపడని వాతావరణం లేదా ఆహారపదార్థాల తోపాటు కొన్నిసార్లు గాలిలో ఉండే పుప్పొడి వంటివి దీన్ని ట్రిగ్గర్‌ చేస్తాయి. శ్వాసించే సమయంలో ఏదైనా దేహానికి సరిపడని పదార్థాలు (వీటిని అలర్జెన్స్‌ అంటారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశించి అవి అలర్జిక్‌ రియాక్షన్స్‌ కలిగిస్తాయి. ఇలా అలర్జిక్‌ రియాక్షన్‌ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఇవి కొన్ని... 

  • గదుల్లోపల (ఇన్‌–డోర్స్‌లో) ఉండే అలర్జెన్స్‌ (ఉదాహరణకు పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్‌లో ఉండే డస్ట్‌మైట్స్‌. 

  • కాలుష్యంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే దుమ్ముధూళి కణాలు. 

  • కొన్నిసార్లు పెంపుడు జంతువులనుంచి రాలిన వెంట్రుకలు. 

  • ఆరుబయట ఉండే అలర్జెన్స్‌: (ఉదాహరణకు పుప్పొడి, బూజు వంటి పదార్థాలు). పొగాకు కాలినప్పుడు / మండినప్పుడు వచ్చే ఘాటైన పొగ ఘాటైన రసాయనాలు, స్ప్రేలు.. వాటి తాలూకు ఘాటైన వాసనలు కొందరిలో ఆస్తమాకు కారణం కావచ్చు. 

  • వాయు కాలుష్యం (కాలుష్యంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలు) ఇవేగాక ఇంకా చాలా అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అవి... చలిగాలి, చాలా తీవ్రంగా చేసే వ్యాయామాలు. కొన్నిసార్లు మనకు సరిపడని మందుల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. 

  • ఇటీవల విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ (అర్బనైజేషన్‌) వల్ల పెచ్చరిల్లుతున్న అనేక అంశాలు ఆస్తమాను కలిగిస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.

పిల్లల్లో ఆస్తమా...  
చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఆస్తమా వస్తుంటుంది. అయితే దీన్ని గుర్తించడం తల్లిదండ్రులకు కష్టమవుతుంది. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఎగిసిపడుతున్న రొమ్మును పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఆస్తమాను గుర్తిస్తారు. 

చిన్నపిల్లల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్‌ ట్యూబులు మొదటే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక జలుబు, పడిశం వంటి వాటి కారణంగా ఆ మార్గాలు మామూలుగానే ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంటాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అవి ఆస్తమా వల్ల సన్నబడ్డాయా లేక పడిశం, జలుబు లక్షణాలా అన్నది గుర్తించడం కొంత కష్టమవుతుంది.

ఆస్తమా లక్షణాలు... 

  • దగ్గు, ఆయాసం... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం చేడం లేదా గట్టిగా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు, ఆయాసాలు మరింతగా పెరుగుతాయి. 

  • ఛాతీ బిగుతుగా పట్టేసినట్లుగా ఉండటం. 

  • శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. 

  • హాయిగా ఊపిరి తీసుకోలేకపోవడం... సాఫీగా శ్వాస సాగకపోవడం. 

  • పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). 

  • కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు.

నిర్ధారణ... 
పెద్దవాళ్లతో ΄ోలిస్తే పిల్లల్లో ఆస్తమా నిర్ధారణ కాస్త కష్టమైన ప్రక్రియ. లక్షణాల తోపాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా అది ఆస్తమా కావచ్చేమోనని తొలుత అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా చిన్నప్పుడు వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలసి కనిపిస్తుండవచ్చు. 

దాంతో ఆ  లక్షణాలు కేవలం ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... 

రైనైటిస్‌ 

సైనసైటిస్‌ 

ఆసిడ్‌ రిఫ్లక్స్‌ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (జీఈఆర్‌డీ) 

వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్‌ వే అబ్‌నార్మాలిటీస్‌) ∙స్వరపేటిక సరిగా పనిచేయక΄ోవడం (వోకల్‌ కార్డ్‌ డిస్‌ఫంక్షన్‌) 

బ్రాంకైటిస్‌ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు 

రెస్పిరేటరీ సింటాక్టికల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి) వంటివి కొన్నిసార్లు ఆస్తమా  లక్షణాలనే కనబరుస్తుంటాయి. 

ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం ఉండటం వల్ల కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. అవి... 

ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షలు (స్పైరోమెట్రీ) వంటివి.    

ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కొద్దిపాటి వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాకా... ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేస్తారు. 

ఇక ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షతో ఆస్తమా కాస్త కష్టమవుతుటుంది. పేషెంట్‌ చెప్పేవీ, తల్లిదండ్రులు గమనించినవీ... ఇలా అనేక లక్షణాలతోపాటు ఈ పరీక్షల సహాయంతో డాక్టర్లు ఆస్తమాను నిర్ధారణ చేస్తారు.  

చికిత్స...
సాధారణంగా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే చాలామందిలో వారు పెరుగుతున్న కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండాపోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. 

ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... 

దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్‌ చికిత్స.  వాయునాళాల ఇన్‌ఫ్లమేషన్‌ నివారణకు ఈ మందులను వాడాలి. దాదాపు వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. 

తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స : ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్‌ అనీ, క్విక్‌ రిలీఫ్‌ మెడికేషన్‌ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్‌ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. 

మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా  వెళ్లడానికి స్పేసర్‌ డివైజ్‌ విత్‌ మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందువల్ల ఉపయోగించే మందు వృథా కాకుండా ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్‌హేలర్‌ ఉపయోగించాలి.

ఆస్తమాలో సరికొత్త మందులు బయాలాజిక్స్‌... 
బయాలజిక్స్‌ అనే ఔషధాలు తీవ్రమైన ఆస్తమాకు ఒక వినూత్న ఆశారేఖ అని చెప్పుకోవచ్చు. ఒమలిజుమాబ్, మెపోలిజుమాబ్, బెన్‌రలిజుమాబ్‌ లాంటి బయాలాజిక్స్‌ తీవ్రమైన ఆస్థమా రోగులకు ఉపశమనం కలిగించేవిగా పరిశోధనల్లో వెల్లడైంది. వీటిని ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. వీటివల్ల ఆస్తమా తీవ్రత బాగా తగ్గిపోతుంది. ఇవి కొన్ని నిర్ణీత ‘ఇమ్యూన్‌ ΄పాత్‌వే’లను లక్ష్యంగా చేసుకుని పనిచేయడం ద్వారా ఆస్తమా తీవ్రతనూ, దాని ఉద్ధృతినీ తగ్గిస్తాయి. 

అలా అవి ఇమ్యూన్‌పాత్‌–వే లను అడ్డగించడం (బ్లాక్‌ చేయడం) ద్వారా ఒక్కసారిగా పెచ్చరిల్లే (ఫ్లేరప్స్‌)ను తగ్గిస్తాయి. అంతేకాదు... ఈ సరికొత్త మందులు... పదేపదే హాస్పిటల్‌కు రావాల్సిన అవస్థను తగ్గించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతాయి. కాస్త ఖరీదైనవే అయినప్పటికీ ఆస్తమాతో కలిగే అవస్థలూ, ఇబ్బందులతో పోలిస్తే వీటిని తీసుకోవడం 
ఎంతో మేలు.

కేవలం కొన్నాళ్లు మందులు వాడటం లేదా చికిత్స తీసుకోవడంతో మాత్రమే ఆస్తమా తగ్గి΄ోతుంది. దీన్ని అనుక్షణం నియంత్రణలో ఉంచడం అవసరం. అలాగే ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తించి, వాటినుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటం చేస్తుండాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తమా నివారణ, నియంత్రణ చాలా సులభమే. అందుకే ఆందోళనకు గురికాకుండా తమ డాక్టర్‌తో నిత్యం ఫాలోఅప్‌లో ఉండాలి.     ∙

ఆస్తమా ఎటాక్‌లో ఏం జరుగుతుందంటే...
ఆస్తమా ఎటాక్‌ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని నాళాల కండరాలు ఉబ్బడం వల్ల వాటి మధ్యభాగంలోని స్థలం సన్నబడిపోయి, శ్వాస మార్గాలు మూసుకుపోయినట్లుగా అవుతాయి. ఫలితంగా ఆ నాళాల్లో గాలి ఫ్రీగా కదిలేందుకు సరిపడనంత స్థలం లేకపోవడంతో శ్వాస సరిగా అందదు. దాంతో మనకు ఆస్తమా అటాక్‌ వస్తుందన్నమాట. ఏవైనా మనకు సరిపడని వాటిని తిన్నా, పీల్చుకున్నా మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. 

ఒక్కోసారి చలి సీజన్‌లోనూ ఆ వాతావరణంలో గాలిలో ఉండే మంచు సరిపడని కారణంగా వాయునాళాలు ఉబ్బుతాయి. దాంతోపాటు వాయునాళాల్లో కాస్త జిగురుగా ఉండే మ్యూకస్‌ అనే పదార్థం స్రవిస్తుంది. అసలే నాళాలు సన్నబడి ఉండటంతోపాటు... ఈ మ్యూకస్‌ కూడా అడ్డుపడటం వల్ల వాయువులు కదిలే ప్రాంతం మరింత మూసుకుపోతుంది. ఫలితంగా గాలి పీల్చడమూ, వదలడమూ... అంటే మొత్తంగా శ్వాస తీసుకోవడమే చాలా కష్టమవుతుంది. 

పిల్లల్లో ఆస్తమాను గుర్తించడమిలా... 
పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటిగాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్‌గా భావించేందుకు అవకాశముంది. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశానికి (ట్రిగరింగ్‌ ఫ్యాక్టర్‌కు) గురైన వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. 

పగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్‌... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను తక్షణం ప్రేరేపిస్తాయి. పిల్లలను జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించినప్పుడు  పిల్లలు వేగంగా శ్వాస తీసుకోవడం, వాళ్లకు సరిగా శ్వాస అందక΄ోవడం, రొమ్ము తీవ్రంగా ఎగసిపడుతున్నట్లుగా  మొదలుకాగానే... తల్లిదండ్రులు దాన్ని ఆస్తమాగా అనుమానించి తక్షణం డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లా. 

ఇన్హేలర్‌ వాడే సమయంలో తప్పక చేయవలసినవి...  

ఇన్‌హేలర్‌ వాడే సమయంలో ఊపిరితిత్తుల్లో మందు పూర్తిగానూ... అంతటా సమంగానూ విస్తరించడానికి స్పేసర్‌ను ఉపయోగించడం. 

స్టెరాయిడ్‌ ఇన్‌హేలర్‌ వాడిన తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం. 

తక్షణ ఎటాక్‌ను నివారించేందుకు ఫస్ట్‌లైన్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వాడే రిలీవర్‌ ఇన్‌హేలర్‌ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం. 

ఇన్‌హేలర్‌ వాడే సరైన టెక్నిక్‌ను డాక్టర్‌ దగ్గర నేర్చుకోవడం. ఎప్పుడూ దాన్ని అనుసరించడం. అదుపులో ఉంచేందుకు వాడే ఇన్‌హేలర్‌ను ఇంట్లో ఉంచుకుని క్రమం తప్పకుండా వాడటం.  

ఇన్‌హేలర్‌ వాడకంలో చేయకూడని పనులు... 

  • లక్షణాలు తగ్గిన తర్వాత ఇక ఇన్‌హేలర్‌ వాడకానికి దూరంగా ఉండటం. 

మీ ఇన్‌హేలర్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవడం.... 
డాక్టర్‌ చెప్పిన మోతాదుకు మించి రిలీవర్‌ ఇన్‌హేలర్‌ను ఎక్కువగా వాడటం. 

ఒకవేళ రాత్రుళ్లు దగ్గు, ఆయాసం లాంటి ఆస్తమా హెచ్చరికలను పట్టించుకోకపోవడం... ఇవన్నీ చేయకూడని పనులు.

అలర్జిక్‌ ఆస్తమా కోసం... మరికొన్ని అలర్జీ పరీక్షలు...

కొన్ని ట్రిగరింగ్‌ అంశాల కారణంగా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తుంటే... అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్‌ టెస్ట్‌ చేయిస్తారు. ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్‌ రియాక్షన్‌  జరుగుతుందేమోనని గమనిస్తారు. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్‌ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్‌ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. 

కొంతమందిలో వాళ్లు తీసుకున్న ఆహారం కారణంగా అలర్జీతో ఆస్తమా ప్రేరేపితమై ఉండవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందని తెలుసుకోవడం కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అందుకే పెద్దవారైతే తమకు తాము... పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు... ఏయే పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. 

ఫలానా పదార్థాలతోనే ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయని ఒకటి రెండుసార్లు పరిశీలనల తర్వాత తెలిసిపోతుంది. అప్పుడు తమకు సరిపడనివీ, తమలో ఆస్తమాను ప్రేరేపించే సదరు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలూ చేయించాల్సి రావచ్చు.  
డా. విజయ్‌ కుమార్‌ చెన్నంచెట్టి, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనలాజిస్ట్‌ – స్లీప్‌ స్పెషలిస్ట్‌. 

క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్ట్‌లు..
ఆస్తమ లక్షణాలను ముందుగానే పసిగడితే..అటాక్‌ అవ్వకుండా నివారించొచ్చు అని చెబుతున్నారు అంకురా ఆస్పత్రి వైద్యులు  శ్రీనివాస్. అలాగే పిల్లలు, పెద్దలు శ్వాసలో గురక, దగ్గు, తరుచుగా జలుబు సంబంధిత ఇన్షెక్షన్లు బారినపడటం వంటి లక్షణాలను నిర్లక్యం చేయకూడదని అన్నారు. సకాలంలో వైద్యుడిని సంప్రదించి..తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని అన్నారు. 

అలాగే ఆస్తమా వచ్చిన రోగులు ఇన్‌హేలర్‌  పక్కనే ఉంచుకోవాలని సూచించారు. శరీరానికి సరిపడే ఆహారాలపై శ్రద్ధపెట్టి మందులతో వ్యాధి అదుపులో ఉంచుకునేలా జాగ్రత్తలు పాటిస్తే త్వరితగతిన ఈ సమస్య నుంచి బయపడతారని చెబుతున్నారు. 
డాక్టర్ శ్రీనివాస్ జక్కా, పీడియాట్రిక్స్, పల్మోనాలజీ & అలెర్జీ కన్సల్టెంట్, అంకురా హాస్పిటల్

13 శాతం మంది రోగులు భారత్‌లోనే..
ప్రపంచవ్యాపంగా  13 శాతం మంది ఆస్తమా రోగులు భారత్ లోనే ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు ఆలివ్ ఆస్పత్రి  పల్మోనాలజీ వైద్యులు సయ్యద్ తాహ మహ్మద్‌   దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు నిర్థారణ, తగిన చికిత్సలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఆస్తమాకు మందుల కూడా అందుబాటులో ఉన్న విషయం రోగులకు తెలియజేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు.

 సకాలం చికిత్స తీసుకోకపోవడంతోనే ప్రాణాంతకంగా మారుతున్నాయని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్యను సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుందన్నారు.
ఆలివ్ ఆస్పత్రి  పల్మోనాలజీ వైద్యులు సయ్యద్ తాహ మహ్మద్‌

 

(చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్‌ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్‌ ఛేంజర్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement