నిద్ర... సమస్యలు- పరిష్కారాలు | Insomnia and Hypersomnia Causes Symptoms Treatment full details | Sakshi
Sakshi News home page

Insomnia: నిద్ర... సమస్యలు- పరిష్కారాలు

Jan 27 2026 8:44 PM | Updated on Jan 27 2026 8:44 PM

Insomnia and Hypersomnia Causes Symptoms Treatment full details

ఎవరిలోనైనా నిద్ర తక్కువైతే దాని తాలూకు ప్రతికూల ప్రభావాలు దేహంపైనా, మనసుపైనా... ఇలా రెండింటిపైనా ఉంటాయి. చిత్రంగా ఇంకొందరిలో నిద్ర ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్యలూ కనిపిస్తుంటాయి. ప్రధానంగా నిద్ర తాలూకు సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 
’నిద్రలేమి (ఇన్‌సామ్నియా)  ’అతి నిద్ర (హైపర్‌సామ్నియా) ’ నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం (పారాసామ్నియా).

నిద్ర...
దాన్ని అనుభవించి, ఆస్వాదించి తెలుసుకోవాలేగానీ అక్షరాల్లో నిర్వచించడం కష్టం. నిర్వచనమే ఇవ్వలేని ఓ అద్భుతం. దేహం, మనసూ ప్రశాంతంగా సేదదీరే అనిర్వచనీయమైన ప్రక్రియ.  అందుకే నిద్ర తాలూకు ప్రశాంతత లోపించినవారు ఆ నిద్రాసుఖం కోసం పరితపిస్తారు. ఆ సుఖానుభూతి కోసం తాపత్రయపడతారు. సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అనుభవించే ఆ అనుభవం కోసం ప్రతి వ్యక్తీ తన జీవితంలోని దాదాపు మూడో వంతు వెచ్చిస్తాడు. అయితే కొందరిని ఆ నిద్రదేవత కరుణించదు.

మరికొందరిలో నిద్రపరమైన కొన్ని  సమస్యలుంటాయి. ఆ సమస్యలు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడతాయి. నిద్రలో నడవడం వంటి కొన్ని రకాల నిద్రకు సంబంధించిన సమస్యలు ఒక్కోసారి కొన్ని  ప్రమాదాలకూ కారణమవుతాయి. నిద్ర గురించి ఇలాంటి ఎన్నో విషయాలను తెలిపే ఈ కథనంలో స్లీప్‌కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం...

నిద్రలేమి (ఇన్‌సామ్నియా)...
సాధారణంగా ప్రతి ఒక్కరూ దాదాపు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతుంటారు. ఇది సాధారణం. అంతకంటే తక్కువగా నిద్రపోతే... దాన్ని నిద్రలేమి (ఇన్‌సామ్నియా) అని చెప్పవచ్చు. సాధారణ నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటల పాటే అయినా... జనాభాలోని 2 శాతం  నుంచి 4 శాతం ప్రజల్లో ఇది కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ల శరీర తత్వాన్ని బట్టి అది వాళ్లకు ఎలాంటి సమస్యను తెచ్చిపెట్టకపోవచ్చు. అలా కొద్దిసేపు నిద్రే అయినప్పటికీ వాళ్లలో ఎలాంటి అలసటా, నీరసం, నిస్సత్తువ లేదా ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఉంటే వాళ్ల శరీర తత్వాన్ని బట్టి వాళ్లకు ఆ నిద్ర సరిపోతుందన్నమాట. అయితే చాలామందిలో నిద్రలేమి వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవి...

∙ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించే శక్తి లోపించడం. 
∙రాత్రి నిద్రలేమి వల్ల పగటివేళ కునికిపాట్లు పడుతూ ఉండటం. 
∙జ్ఞాపకశక్తి తగ్గడం.  
∙పనిలో తగినంత సామర్థ్యం చూపలేకపోవడం. 
నిద్రలేమి సమస్య కేవలం ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఉంటే అదో సమస్య కాబోదుగాని... అదే నెలల పాటు కొనసాగితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఇలా నిద్రలేమితో బాధపడేవాళ్లలో రక్తపోటు హై–బీపీ, మధుమేహం (డయాబెటిస్‌), గుండెజబ్బులు, బ్రెయిన్‌స్ట్రోక్, భరించలేనంతగా తలనొప్పులు, హైపర్‌ ఎసిడిటీ, కడుపులో పుండ్లు (గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌), ఉద్విగ్నత (యాంగ్జైటీ),  నరాల సమస్య (న్యూరోసిస్‌), కుంగుబాటు (డిప్రెషన్‌) లాంటి కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

నిద్రలేమికి కారణాలు... 
∙వేళకు నిద్రపోక పోవడం (ఇర్రెగ్యులర్‌ స్లీప్‌ హ్యాబిట్స్‌) 
∙వేళకు తినకపోవడం (ఇర్రెగ్యులర్‌ ఫుడ్‌ హ్యాబిట్స్‌) 
∙నిద్రకు ముందు పొగతాగడం 
∙కాఫీ, టీ, కెఫిన్‌ ఉండే కాఫీ అలాగే కూల్‌డ్రింక్స్‌ తాగడం 
∙తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్, యాంగ్జైటీ)కి గురికావడం 
∙ఆస్తమా, గుండెజబ్బులకు సంబంధించిన కొన్ని రకాల మందులు వాడటం వల్ల. 
∙కొన్ని రకాల జబ్బుల కారణంగా... అందునా ముఖ్యంగా ఆస్తమా, కంజెస్టివ్‌ హార్ట్‌ డిసీజెస్,  మూత్రపిండాల సమస్యలు (కిడ్నీలో వ్యర్థాలు మిగిలిపోవడం వల్ల), కొన్ని లివర్‌ సమస్యలు 
∙థైరాయిడ్‌ సమస్యలు 
∙స్థూలకాయం / ఊబకాయం  
∙తీవ్రమైన నొప్పుల కారణంగా (అంటే విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, మెడనొప్పి, తిమ్మిర్లు, మంటలు ఉండటం)

నిద్ర లేమి – నివారణ చర్యలు...
నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి గాఢమైన  నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ.

∙బెడ్‌రూమ్‌ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వురీ చల్లగానూ, వురీ వేడిగా ఉండకూడదు. 
∙నిద్రపోతున్న గదిలో మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. 
∙పొగతాగడం పూర్తిగా మానేయాలి. 
∙సాయంత్రం నుంచి కాఫీలు, టీలను, కెఫిన్‌ ఉండే కూల్‌డ్రింక్స్‌ తీసుకోకూడదు. 
∙రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.
∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రకు ఉపక్రమించడం.  
∙పగటి పూట ఎక్కువసేపు నిద్రపోకపోవడం. 
∙నిద్రకు వుుందర టీవీలో తీవ్రమైన ఉద్విగ్నత, ఉద్రిక్తత, ఉద్వేగపూరితమైన  దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌లూ చూడకపోవడం.

∙రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో (డే లైట్‌) గడపడం ఓ మంచి సూచన. (పగలంతా వుసకమసగ్గా ఉండే వెలుగు తక్కువ గదుల్లో గడపడం వల్ల రాత్రిపూట మంచి నిద్రపట్టకపోవచ్చు). 
∙నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను వినడం.

∙అలాగే పెద్దపెద్ద చప్పుళ్లు ఉండే రణగొణధ్వని ల్లాంటి వు్యూజిక్‌కు దూరంగా ఉండటం. 
∙రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగడం. (పాలలో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆసిడ్‌తో మంచి నిద్ర పట్టే అవకాశముంటుంది).

∙నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి సరికాదు. నిజానికి పుస్తకం చదివితే నిద్ర వస్తుందని చాలావుంది అంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో పుస్తకంలో ఆసక్తికరమైన అంశాలుండటం, పుస్తకంలోని కంటెంట్‌లో ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలుంటే అవి నిద్రను దూరం చేయడానికి అవకాశాలెక్కువ.

∙నిద్రకు ముందర టీవీ లేదా మొబైల్‌ చూడటం కూడా సరికాదు. ఇది రెండు రకాలుగా నిద్రకు దూరం చేస్తుంది. స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కారణంగా నిద్ర పట్టదు. అలాగే మొబైల్‌ చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఆసక్తికరమైన అంశాలూ, ఉద్విగ్నతకూ, ఎక్సైట్‌మెంట్‌కు గురిచేసే అంశాలు నిద్రను దూరం చేయవచ్చు.

∙నిద్రపోవడాన్ని ఓ పనిలా అనుకొని దానిపైనే దృష్టిపెట్టి నిద్రకు ఉపక్రమించాలి. ఆ సమయంలో వేరే విషయాలు ఆలోచించడం సరికాదు.

∙ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఆల్కహాల్‌ తీసుకున్న రాత్రి పూర్తిగా నిద్రపట్టకపోవచ్చు. లేదా ఆ నిద్ర నాణ్యత (స్లీప్‌ క్వాలిటీ) చక్కగా ఉండకపోవచ్చు. ఆల్కహాల్‌తో పట్టిన నిద్ర తర్వాత మనసు చికాగ్గానూ, నిద్రలేచాక పూర్తిగా అలసట తీరిన భావన లేకపోవడానికి స్లీప్‌ క్వాలిటీ చక్కగా లేకపోవడమే కారణం.  

∙బెడ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన లైట్‌ మ్యూజిక్‌ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అయితే నిద్రకు ఉపక్రమించాక ఆ మ్యూజిక్ ఆపాలన్న స్పృహ కారణంగా నిద్ర ఆపుకోవాల్సి రావచ్చు.

∙ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులతో బాధపడేవారు తాము వాడే కొన్ని రకాల మందుల వల్ల సరిగా నిద్రపట్టకపోవచ్చు. ఉదాహరణకు ఆస్తమాకు వాడే కొన్ని రకాల ఇన్‌హేలర్స్‌తో కొందరికి సరిగా నిద్రపట్టకపోవచ్చు. అందుకే లంగ్స్, కిడ్నీ జబ్బులతో బాధపడేవారు తాము ఉపయోగించే మందులను డాక్టర్లకు చూపించి, వారి  సలహామేరకు మందులు వాడటం లేదా వాటిని పగటిపూట వాడేలాగా వేళల్లో మార్పు చేసుకోవచ్చు. ఇక తీవ్రమైన నొప్పుల సమస్యలతో బాధపడేవారు (పెయిన్‌ డిజార్డర్స్‌ ఉన్నవారు) తమ డాక్టర్‌ను సంప్రదించి తమకు నిద్రాభంగం కలిగించని విధంగా తమ సమస్యలకు తగిన మందులు సూచించాల్సిందిగా కోరాలి.  

హైపర్‌సామ్నియా
సాధారణంగా సగటున నిద్రపోయే వ్యవధి అయిన ఎనిమిది గంటలకంటే కూడా చాలా ఎక్కువ సేపు నిద్రపోవడాన్ని ‘హైపర్‌సామ్నియా’గా (hypersomnia) చెప్పవచ్చు

హైపర్‌సామ్నియాకు కారణాలు...
∙హైపోథైరాయిడిజం అనే రుగ్మత ఉన్నవాళ్లూ, అలాగే దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడేవారు... రాత్రివేళల్లో వారికి సరైన నిద్రలేకపోవడం వల్ల పగలు ఎక్కువగా నిద్రపోతుంటారు. అలాగే నిద్రలో ఊపిరి అందకపోవడం (స్లీప్‌ ఆప్నియా), రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్, నార్కొలెప్సీ వంటి సమస్యలున్నవాళ్ల లోనూ నిద్ర ఎక్కువగా వస్తుంటుంది.

∙స్లీప్‌ ఆప్నియా సమస్య :  నిద్ర సవుస్యల్లో ప్రధానమైనది నిద్రపోతున్నప్పుడు వచ్చే గురక కారణంగా ఊపిరి అందకపోవడం. దీన్నే స్లీప్‌ ఆప్నియా సిండ్రోమ్‌ అంటారు. శ్వాసప్రక్రియ 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఆగిపోతే దాన్ని ‘ఆప్నియా’గా చెబుతారు. కొందరు తమది చాలా చిన్నపాటి గురక అని, దాంతో పెద్దగా ప్రమాదం లేదని అనుకుంటుంటారు. గురక చిన్నదైనా, పెద్దదైనా వుుక్కు నుంచి గొంతు వరకు గాలి తీసుకెళ్తే అవయవాల్లో అడ్డంకి వల్లనే ఆ గురక వస్తుంటుంది. ఆ అడ్డంకి వల్ల ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్‌ మోతాదు తగ్గి శరీరంలో కార్బన్‌–డై–ఆక్సైడ్‌ మోతాదులు పెరిగిపోతుంటాయి. దాంతో మెదడుకు అందాల్సినంత ఆక్సిజన్‌ అందక చాలాసార్లు తమకు తెలియకుండానే వాళ్లలో నిద్రాభంగమవుతుంటుంది. ఫలితంగా స్లీప్‌ ఆప్నియాతో బాధపడేవారికి నాణ్యమైన నిద్ర (క్వాలిటీ స్లీప్‌) ఉండదు. ఫలితంగా రాత్రివేళ సరిగా నిద్రలేకపోవడంతో ఆ నిద్రలేమిని (ఇంగ్లిష్‌లో స్లీప్‌ డెబిట్‌)ను ఉదయం వేళల్లో భర్తీ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇలా గురక కారణంగా తరచూ నిద్రభాగం అవుతుండేవారు తరచూ ఉదయం వేళల్లో నిద్రతో తూగుతూ (నిద్రలో జోగుతూ) ఉంటారు. ఇలా తూగడం / జోగడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు జరిగే అవకాశముంది. డ్రైవింగ్‌ చేసేప్పుడు ఇలా తూగడం / జోగడం ఎంతో ప్రమాదకరం. అదీగాక ఇలా రాత్రివేళ నిద్రలేమి (స్లీప్‌ డెఫిసిట్‌) వల్ల ఉదయంవేళల్లో మందకొడిగా (డల్‌గా) ఉంటుంటారు.

∙సమస్యలను పరిష్కరించడం (ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌), ఏకాగ్రతా అలాగే సవుస్యపై దృష్టికేంద్రీకరణ (కాన్సంట్రేషన్‌)... ఇలాంటి అన్ని విషయాల్లోనూ సవుస్యలుంటాయి.

∙తీవ్రమైన తలనొప్పులు : కొందరిలో ఉదయం వేళల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. నిద్రసమస్య కారణంగా రాత్రివేళల్లో నోటితో గాలిపీల్చుకోవడం వల్ల నోరెండిపోయిన ఫీలింగ్‌ కొనసాగుతుంది. పీల్చుకునే గాలిలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గడంతో మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రస్థానమైన ‘వూమిల్లరీ బాడీ’ అనే అవయవం తాలుకు పరిమాణం (సైజ్‌) 20 శాతం వరకు తగ్గిపోతుంది. శరీరంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గడం వల్ల... దాని తాలూకు దుష్ప్రభావం గుండెపై పడుతుంది. హార్ట్‌ ఎటాక్స్‌తో అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ల ఆరోగ్య చరిత్ర (కేస్‌ హిస్టరీ) పరిశీలిస్తే... ముఖ్యంగా  ‘స్లీప్‌ ఆప్నియా’ సమస్య ఉన్నవాళ్లలో 30 శాతం వుంది గుండెపోట్లకు గురవుతున్నట్లు అనేక పరిశీలనల్లో తేలింది.  

∙‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ :  ఈ సమస్యతో బాధపడేవారు పదే పదే తమ కాళ్లను కదిలిస్తూ, ఆ చర్య వల్ల రిలీఫ్ పొందుతుంటారు. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో పగలు చాలాసేపు నిద్రపోతూ ఉంటారు.

∙‘నార్కోలెప్సీ’ : మెదడుకు సంబంధించిన ఈ జబ్బుతో బాధపడేవారు రాత్రి మామూలుగా నిద్రపోయినప్పటికీ... మళ్లీ పగటివేళ అలా కునుకులోకి జారిపోయి నిద్రలోకి వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటివారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోతూ ఉంటారు.

∙కెటాప్లెక్సీ : ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్లకు... నిద్రలేవగానే కాళ్లూ, చేతులు రెండూ కాసేపు పనిచేయకుండాపోతాయి. ఈ కండిషన్‌నే ‘స్లీప్‌ పెరాలిసిస్‌’ అని కూడా అంటారు.

∙క్లీన్‌ లెవిన్‌ సిండ్రోమ్‌ : వీళ్లు నెలల తరబడి నిద్రపోతూనే ఉంటారు. వీళ్లకు ఆకలి కూడా ఎక్కువ. ఇలా ఎక్కువగా తినడాన్ని హైపర్‌ బులీమియా అంటారు.  

ఇక్కడ పేర్కొన్న ఇలాంటి అతినిద్ర (హైపర్‌సామ్నియా)కు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలూ, సలహాలు, తగిన చికిత్సలు  తీసుకోవాలి.

పారాసామ్నియా సమస్యలు
నిద్రలో వింతగా ప్రవర్తించడాన్ని ‘పారాసామ్నియా’ అంటారు. ఈ పారాసామ్నియాలో చిత్రవిచిత్రమైన చాలా రకాల సమస్యలను చూడవచ్చు.

∙నిద్రలో నడవడం
(స్లీప్‌ వాకింగ్‌) : ఇది నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈఎమ్‌) స్టేజ్‌–4లో వచ్చే సమస్య. కొందరు తలుపులు తెరుచుకుని కూడా నిద్రలో నడుస్తూ వెళ్తారు.  మర్నాడు ఉదయం నిద్ర లేచాక వాళ్లకు తాము చేసిందేమీ గుర్తుండదు. ఇలాంటివాళ్లు మేడ మీది నుంచి పోవడం లేదా ఇతరత్రా ప్రమాదాలకు (యాక్సిడెంట్స్‌కు) గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.

∙నిద్రలో భయంతో ఉలిక్కిపడిలేవడం (స్లీప్‌ టెర్రర్స్‌) : ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో డాక్టర్లు ఈ సమస్యను ఎక్కువగా చూస్తుండటం చాలా సాధారణం. పెద్దగా అరుస్తూ నిద్రలోంచి లేవడం, లేచాక భయంకరంగా ప్రవర్తించడం, టీవీ లేదా మొబైల్‌  వంటి వస్తువులను విసిరేవేయడం లేదా బద్దలు కొట్టడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేసే పిల్లల్ని అదుపు చేయడమూ చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4 లలో వస్తుంది. కాబట్టి ఆ దశల్లో వాళ్లేం చేస్తున్నారన్నది వాళ్లకు ఏమాత్రం తెలియదు.

∙నిద్రలో పీడకలలు రావడం (నైట్‌మేర్‌) : ఈ సమస్యలో భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4లో వచ్చే సమస్య. నిద్రలేచాక ఏమాత్రం గుర్తుకురాని భయంకరమైన కలలు వస్తుండటం ఈ జబ్బు విషయంలో జరుగుతుంటుంది.

∙నిద్రలో కలవరింతలు, పొంతనలేని మాటలు (స్లీప్‌ టాకింగ్‌) : ఈ సమస్యతో బాధపడేవారు నిద్రలో ఏదేదో కలవరిస్తుంటారు. ఏమాత్రం పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4లో వచ్చే సమస్యే.  ఆ దశలో వచ్చే సమస్య కావడంతో వాళ్లు మాట్లాడుతున్నదేమిటో వాళ్లకే తెలియదు. నిద్రలేపి అడిగినా వాళ్లేమీ చెప్పలేరు. అందుకే వాళ్లనేదైనా ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెబుతుంటారు.

∙కన్ఫ్యూజనల్‌ అరోజల్స్‌ : నిద్రలోంచి లేచి ఏవేవో పొంతన లేని విషయాలను ప్రస్తావిస్తుంటారు.

∙స్లీప్‌ అన్యురోసిస్‌ : చిన్నారులు నిద్రలో పక్క తడపటం మామూలే. కానీ  సాధారణంగా ఈ అలవాటు మూడునుంచి ఐదేళ్ల లోపు పిల్లలప్పుడే ఆగిపోతుంది. అయితే అరుదుగా కొందరిలో పది పదిహేనేళ్లవరకు కొనసాగుతూ వారిని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాజికంగా నలుగురిలో కలవడం, ఫంక్షన్లలో పాల్గొనడం, రాత్రుళ్లు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వెనకాడటం, ఆత్మవిశ్వాసం, తమపట్ల తమకు గౌరవం (సెల్ఫ్‌ ఎస్టీమ్‌)తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.  

నిద్రకు సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సమస్య నిర్ధారణ కోసం కొందరిలో వాటికి అవసరమైన కొన్ని రకాల పరీక్షలూ చేయాల్సి రావచ్చు.  

ఇక చికిత్సల విషయానికి వస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్లను సంప్రదిస్తే చాలావరకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, అవసరమైన కొందరికి కొన్ని రకాల ఉపకరణాలు వాడటం (సీ–ప్యాప్‌ లాంటివి), చాలా అవసరమైన  మరికొందరికి తగిన మందులు వాడటం ద్వారా వైద్యనిపుణులు ఈ సమస్యలను పరిష్కరిస్తారు. స్లీప్‌ వాకింగ్‌ లాంటి నిద్రకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నందున నిద్రసమస్యలను తేలిగ్గా తీసుకోకుండా, బిడియం వదిలి డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించడం అవసరం.

నిద్ర అంటే ఏమిటన్నది ఇంకా ఇప్పటికీ పూర్తిగా తెలియని రహస్యమే. ఆ కలల ప్రపంచమంటే ఏమిటన్నది ఇంకా పూర్తిగా పరిష్కరానికి నోచుకోని ప్రహేళికే. అందుకే నిద్ర గురించిన అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నిద్ర తాలూకు  అనేక దశలూ, స్లీప్‌కు సంబంధించిన అనేక సమస్యలూ, వాటికి పరిష్కారాలూ, ప్రశాంతమైన నిద్రకోసం పాటించాల్సిన సూచనలేమిటన్నది చూద్దాం...

నిద్ర... దశలు
నిద్రలో ప్రధానంగా రెండు దశలుంటాయి. అందులో మొదటిది ‘నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గా చెప్పే ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ దశ. రెండోది ‘ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గా పిలిచే ‘ఆర్‌ఈఎమ్‌’ దశ. ఇందులో మొదట పేర్కొన్న దానిలో కనురెప్పల కింద కనుపాప కదలదు కాబట్టి దాన్ని ‘నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గానూ... అలాగే దాని తాలూకు మొదటి అక్షరాలతో సంక్షిప్తంగా ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’గా చెబుతారు. ఇక రెండో దాంటో కనుపాప వేగంగా కదులుతుంటుంది కాబట్టి దాన్ని ‘ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గానూ సంక్షిప్తంగా ‘ఆర్‌ఈఎమ్‌’గా పిలుస్తారు.

నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈఎమ్‌)లోని ఉపదశలు... 
కంటిపాప కదలికలు, కాళ్లూ చేతుల కదలికలు ఉండని మొదటి దశ ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ (నాన్‌ ర్యాపిడ్‌ ఐ వుూవ్‌మెంట్‌)లో  మళ్లీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2, స్టేజ్‌ 3, స్టేజ్‌ 4 అని నాలుగు ఉపదశలుంటాయి.
ఇందులో...

స్టేజ్‌–1 అనేది 10–15 నిమిషాల పాటు 
స్టేజ్‌–2 అన్నది 10–15 నిమిషాలు పాటు 
స్టేజ్‌–3 అన్నది 20–25 నిమిషాల పాటు 
స్టేజ్‌–4 అన్నది 20–30 నిమిషాల పాటు
కొనసాగుతుంటుందని ఓ అంచనా.

నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌లోని ఈ నాలుగు  ఉప–దశలు దాటగానే...  నిద్ర అనేది  కంటిపాపలు వేగంగా కదిలే ఆర్‌ఈఎమ్‌ (ర్యాపిడ్‌ ఐ వుూవ్‌మెంట్‌) దశలోకి వెళ్తుంది.  దీన్ని ఐదో దశ పరిగణిస్తే... ఇలా ఈ ఐదు దశలూ ఒక వరసలో కొనసాగడాన్ని ఒక ‘స్లీప్‌ సైకిల్‌’ అంటారు. ఇక్కడ పేర్కొన్న దశలవారీగా... ఒక రాత్రి నిద్రలో ఇలాంటి స్లీప్‌ సైకిల్స్‌ ఐదు నుంచి ఆరు వరకు నడుస్తాయి.

ఏ అర్ధరాత్రో అకస్మాత్తుగా నిద్రలేచామంటే... మనం ఏ దశ తాలూకు నిద్ర నుంచి లేచామో తెలుసుకోడానికి ఓ బండగుర్తు ఉంటుంది. నిద్ర లేచీ లేవగానే చాలా వుత్తుగా ఉంటూ... వెంటనే తేరుకోలేనట్లుగా ఉంటే అప్పుడు వునం ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ దశ నుంచి లేచావున్నవూట. అదే ‘ఆర్‌ఈఎమ్‌’ దశలోంచి నిద్రలేస్తే రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ ఉంటుంది. కనుపాపలు కదులుతుండే ‘ఆర్‌ఈఎమ్‌’ నిద్రలోనే కలలు వస్తుంటాయి. ఆ దశలోని కలలే చాలావరకు గుర్తుంటాయి.  

డాక్ట‌ర్‌ రమణ ప్రసాద్‌
సీనియర్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ 
– పల్మునాలజిస్ట్‌

నిర్వహణ
యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement