
ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా 12వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం పాకిస్తాన్ ఉల్లంఘించింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్‌లో 8 సెక్టార్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.
యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం . సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలని అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్
బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన భద్రతా బలగాలు.. దర్యాప్తు చేపట్టాయి.
కాగా, సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేసినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. అతడి నుంచి పాక్ కరెన్సీని, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు.గుజ్రన్ వాలాకు చెందిన మహ్మద్ హుస్నైన్‌గా గుర్తించిన అతడు ప్రస్తుతం పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పహల్గాం ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చ రిల్లిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది.