
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో.. ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యంతో ఇన్నాళ్లూ లాభపడిన అమెరికా ఇప్పుడు టారిఫ్‌ల పేరుతో బేరాలాడుతూ భారత్‌పై వేధింపులకు దిగుతోందని భారత్‌లో చైనా రాయబారి జు ఫెయింగ్‌హాంగ్ విమర్శించారు.
భారత్‌పై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించడాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మౌనంగా ఉంటే అమెరికా వేధింపుల్ని మరింతగా పెంచుతుందన్న ఆయన.. ఈ విషయంలో భారత్ పక్షాన చైనా గట్టిగా నిలబడుతుందని వెల్లడించారు. భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లను తెరవడంపై ఫెయింగ్ హాంగ్ స్పందిస్తూ... ఒకరి ఉత్పత్తులకు మరొకరు అవకాశమివ్వడం ద్వారా రెండు దేశాల అభివృద్ధికి ఎంతగానో అవకాశముందని చెప్పారు. ఆసియాకు రెండు దేశాలు డబుల్ ఇంజన్ల వంటివని అభివర్ణించారు.
పోటీపరంగా చూస్తే ఐటీ, సాఫ్ట్‌వేర్, బయోమెడిసిన్ ఉత్పత్తుల్లో భారత్ మెరుగ్గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిర్మాణరంగం, నూతన ఇంధన రంగాల్లో చైనాది పైచేయిగా ఉందని వివరించారు. రెండు ప్రధాన మార్కెట్లు అనుసంధానమైతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భారత్‌పై అమెరికా సుంకాల (US Tariffs) విధింపు, వాటిని మరింత పెంచుతామని ఆ దేశం చేస్తున్న ప్రకటనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫీహాంగ్ వ్యాఖ్యానించారు.

ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పడటం.. బెదిరింపులకు పాల్పడేవారికి మరింత ధైర్యాన్నిస్తుంది. చైనా (China)లోని తియాంజిన్ వేదికగా ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ సహా అన్నిపక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ‘‘అంతర్జాతీయ వేదికపై పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనాలు ఐక్యంగా ఉంటూ.. పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల స్నేహం.. ఆసియాకు, ప్రపంచానికీ మేలు చేకూరుస్తుంది. భారత్, చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవు’’ అని ఫీహాంగ్ పేర్కొన్నారు.
జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో వేదికగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని.. చైనా అని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటుగా స్పందించారు.
అంతేకాదు.. మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని, యూరోపియన్ యూనియన్ అని వెల్లడించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. అయినా భారత్‌పైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.